Asianet News TeluguAsianet News Telugu

మా సంస్థను రక్షించుకుంటాం.. జెట్ ఎయిర్వేస్ ఎంప్లాయిస్ కన్సార్టియం.. ఆది గ్రూప్‌తో బిడ్‌కు రెడీ


రుణ భారం, నిర్వహణ వ్యయంతో కుదేలైన జెట్ ఎయిర్వేస్ సంస్థను నిలుపుకునేందుకు సంస్థ మాజీ ఉద్యోగుల కన్సార్టియం ముందుకు వచ్చింది. ఆది గ్రూపుతో కలిసి బిడ్‌ వేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చింది. ఎన్సీఎల్టీలో దివాళా ప్రక్రియలో పాల్గొని 75 శాతం వాటా కొనుగోలు చేసి సంస్థను కాపాడుకుంటామని ప్రతీన బూనింది. 

Jet Airways Employee Consortium, AdiGroup to bid for 75 per cent of airline
Author
New Delhi, First Published Jun 29, 2019, 11:39 AM IST

న్యూఢిల్లీ: రుణభారంతో నేలకు పరిమితమైన ప్రైవేట్ విమాన యాన సంస్థ ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’ను నిలబెట్టుకొనేందుకు ఆ సంస్థ ఉద్యోగుల ముందుకు వచ్చారు. ఆది గ్రూపు భాగస్వామ్యంతో కన్సార్షియంగా ఏర్పడి సంస్థ కోసం బిడ్‌ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ దివాలా ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం విశేషం. 

జెట్‌లో 75 శాతం వాటా కోసం తాము నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) వద్ద బిడ్‌ దాఖలు చేస్తామని కన్సార్షియం శుక్రవారం ప్రకటించింది. సంస్థను కాపాడుకొనేందుకు ఉద్యోగులు ఇలాంటి చొరవ తీసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని బిజినెస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భారత విమానయాన చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయమని వారు అంటున్నారు. ఇది నిజంగా ప్రధానమంత్రి కల ‘సబ్‌కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ సబ్‌ కా విశ్వస్‌’ను సూచిస్తుందంటూ, ఉద్యోగుల కన్సార్షియం, ఆదిగ్రూప్‌ జారీ చేసిన సంయుక్త ప్రకటన తెలిపింది.

సొసైటీ ఫర్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ ఇండియన్‌ పైలట్స్‌, జనరల్‌ సెక్రటరీ, జెట్‌ సీనియర్‌-మోస్ట్‌ పైలట్లలో ఒకరైన కెప్టెన్‌ అశ్వని త్యాగి, ఆది గ్రూపు ప్రతినిధులుపాల్గొని భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు. తాము కొన్ని సంవత్సరాలుగా జెట్‌ ఎయిర్‌వేస్‌తో కలిసి జీవితాన్ని సాగిస్తున్నామని.. సంస్థకు ప్రతికూలత ఎదురై.. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తమ సంస్థను నిలబెట్టుకొనేందుకు ధైర్యం చేసి ముందుకు రావాలని నిర్ణయించామని వారు తెలిపారు.

ఇదిలా ఉండగా, బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ రూ.8 500 కోట్ల వరకు రుణాలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు, వెండార్లకు కలిపి దాదాపు 25వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంస్థలో కీలక వాటాను విక్రయించి తమ సొమ్ము రాబట్టుకొనేందుకు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల బృందం తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైన సంగతి తెలిసిందే. 

చివరకు చేసేదేమీ లేక ఎస్‌బీఐ జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా ప్రక్రియ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం ఈ పిటిషన్‌ను ఈ నెల 20న విచారణకు స్వీకరిం చింది. దీంతో భారత్‌లో దివాలా ప్రక్రియకు చేరిన తొలి విమానయాన సంస్థగా జెట్‌ ఎయిర్‌వేస్‌ నిలిచింది. ఎన్‌సీఎల్‌టీ తదుపరి విచారణ జూలై 5న జరుగుతుందని ప్రకటించింది. దీనికి తోడు శీష్‌ చౌచారియాను ఐఆర్‌పీగా నియమించింది. 90 రోజుల్లో రిజల్యూషన్‌ ప్రణాళికను అందజేయాలని ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాస నం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఆది గ్రూపుతో జట్టుకట్టి సంస్థలో కీలక వాటా కొనేందుకు ముందుకు రావడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios