Asianet News TeluguAsianet News Telugu

బ్లాక్ ‘మండే’: హువే సీఎఫ్ఓ అరెస్ట్.. రూ.2.28లక్షల కోట్లు హాంఫట్!


డిసెంబర్ 6 అంటే స్టాక్ మార్కెట్ల చరిత్రలో ఒక బ్లాక్ మండేగా నిలువనున్నది. చైనా, అమెరికా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ మధ్య ఇరాన్‌పై ఆంక్షలు ఉల్లంఘించి వ్యాపారం చేశారన్న ఆరోపణలతో హువాయి చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ మెంగ్ వాంఝూను కెనడాలో అరెస్ట్ చేయడం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. భారతదేశంలో మదుపర్లు 2.28 లక్షల కోట్లు నష్టపోయారు. రూపాయి విలువ 75కు పడిపోవడంతోపాటు వ్రుద్ధిరేటు 7.2 శాతానికే పరిమితమన్న ‘ఫిచ్’ అంచనాలతో సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇక ముడి చమురు ఉత్పత్తి తగ్గింపుపై ఒపెక్ సమావేశాలు ప్రారంభం.. శుక్రవారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి.

Investors lose Rs 2.28 lakh crore as Sensex, Nifty nosedive
Author
Mumbai, First Published Dec 7, 2018, 10:18 AM IST

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు గురువారం భారీగా పతనం అయ్యాయి. మార్కెట్ వర్గాలకు ఊరటనివ్వని భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) దైమాసిక పరపతి విధాన సమీక్ష, కెనడాలో హువే చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ మెంగ్‌ వాంఝూ అరెస్ట్ ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధ పరిణామాలు తీవ్రతరం కావడం.. పలు రాష్ట్రాల్లో ఎన్నికల  ఎగ్జిట్‌పోల్స్‌ శుక్రవారంవెల్లడి కానుండటం, ఒపెక్ దేశాల భేటీ నేపథ్యంలో మదుపరులు గురువారం అప్రమత్తంగా ట్రేడింగ్‌ నిర్వహించారు. దీనికి తోడు రూపాయి విలువ పడిపోవడం కొన్ని రంగాల స్టాక్స్‌కు రుచించలేదు.

వృద్ధి రేటు పతనపు అంచనాలు, ఎఫ్‌ఐఐలు భారీగా తరలిపోతున్నారంటూ వెలువడిన అంచనాలు గురువారం దలాల్‌ స్ట్రీట్‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. ఆసియా మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ఆరంభంలోనే సెన్సెక్స్‌ 300 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా 10,700 దిగువన ట్రేడ్‌ అయ్యింది. మధ్యాహ్నానికి కాస్త కోలుకున్నట్లే కన్పించినా.. చమురు ఉత్పత్తి, సరఫరాపై నేడు జరగబోయే ఓపెక్‌ సమావేశం, శుక్రవారం సాయంత్రం వెలువడబోయే రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలపై ద ష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఒత్తిడికి గురైన సూచీలు మరింత పతనమయ్యాయి. 

గురువారం మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 572 పాయింట్లు నష్టపోయి 35,312 వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు దిగజారి 10,601 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.82గా కొనసాగింది. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌ సూచీ 1.5 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 1.3 శాతం చొప్పున నష్టపోయాయి. ఒక్క పూటలోనే మదుపరి సంపద రూ.2.28 లక్షల కోట్లు ఆవిరైంది

అమెరికా వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై కెనడాలో చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం హువే చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ మెంగ్‌ వాంఝూను అరెస్ట్‌ చేయటం ఆసియా మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లనూ కుదిపేసింది. ఈ పరిణామం మళ్లీ పలు దేశాల ఆర్ధిక వ్యవస్థల్లో వాణిజ్య యుద్ధ భయాలను పెంచింది. దీంతో ఆసియన్‌ మార్కెట్లలో అనిశ్చితి చోటు చేసుకుంది. హాంగ్‌సెంగ్‌, నిక్కీ, షాంఘై సూచీలు 2.75 శాతం మేర విలువ కోల్పోయాయి. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2019 సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో మదుపర్లు కూడా అప్రమత్తంగా వ్యవహారించారు. ఇవి భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అదే విధంగా అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఓ దశలో 54 పైసలు పతనమై 71కి పడిపోయింది. తుదకు 43 పైసల క్షీణతతో 70.89 వద్ద ముగిసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతానికి పడిపోనుందన్న అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌’ అంచనా కూడా రూపాయి, మార్కెట్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. 2019 ముగింపు నాటికి రూపాయి విలువ 75కు పడిపోయిన ఆశ్యర్యపోవాల్సిందేమీ లేదని ఫిచ్‌ పేర్కొంది. ఈ పరిణామం రూపాయి విలువను దెబ్బతీసింది. 

బీఎస్‌ఈ, ఎన్ఎస్ఈల్లో అన్ని రంగాల సూచీలు నష్టాలను చవి చూశాయి. ఆటో సూచీ అత్యధికంగా 2.26 శాతం పతనమైంది. రియాల్టీ 2.26 శాతం, మౌలిక వసతులు 1.73 శాతం, టెక్‌ 1.71 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 1.70 శాతం, ఐటీ 1.67 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.65 శాతం చొప్పున అధికంగా నస్టాపోయి మార్కెట్లను కుదుపునకు గురి చేశాయి. సెన్సెక్స్‌లో ఒక్క సన్‌ ఫార్మా మాత్రమే 1.57 శాతం లాభపడింది. 

రష్యా, ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించవచ్చన్న అంచనాలతో చమురు కంపెనీల షేర్లు పతన బాటపట్టాయి. ఇండియాన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) షేరు 2.94 శాతం, ఓఎన్‌జీసీ 2.47 శాతం, ఆర్‌ఐఎల్‌ రూ.2.72 శాతం, భారత్‌ పెట్రోలియం 1.22, హిందుస్తాన్‌ పెట్రోలియం 0.71 శాతం నష్టపోయాయి. చమురు ఉత్పత్తి విధానంపై ఒపెక్‌ సభ్యుల రెండు రోజుల సమావేశం గురువారం ప్రారంభమైంది. ఒపెక్‌ సహా ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో జరుగుతున్న ఈ సమావేశాన్ని ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మారుతి సుజుకీ, టాటా మోటార్స్‌, యెస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, భారతి ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యుఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండ్స్ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ దాదాపు 4.63 శాతం వరకు నష్టపోయాయి. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) బుధవారం రూ.357.82 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) కూడా దాదాపు రూ.791.59 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు బీఎస్ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

హువే సీఎఫ్‌ఓ అరెస్ట్‌ దెబ్బకు కొరియా ఇండెక్స్‌ కోస్పీ 1.55 శాతం, జపాన్‌ నిక్కీ 1.91 శాతం, హాంకాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌సెంగ్‌ 2.47 శాతం, షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ 1,68 శాతం మేర పడిపోయాయి. కాగా యూర్‌పకు చెందిన ఫ్రాంక్‌ఫర్ట్‌ డాక్స్‌ , పారిస్‌ సీఎసీ 40, లండన్‌ ఎక్స్ఛేంజ్‌ ఎఫ్‌టీఎస్ఈ దాదాపు 2.50 శాతం మేర కుప్పకూలాయి.

ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై హువే సీఎఫ్ఓను అరెస్ట్‌ చేయటం.. అమెరికా, చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. మెంగ్‌ వాంఝూ.. హువే ఫౌండర్‌ రెన్‌ ఝెంగ్‌ఫై కుమార్తె కూడా. రెన్‌ గతంలో చైనీస్‌ పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ ఇంజనీర్‌గా పనిచేశారు. మెంగ్‌ అరెస్ట్‌ను చైనా తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌.. ట్రేడ్ టారిఫ్ వివాదాలను కొలిక్కి తెస్తున్న కొద్ది రోజుల్లోనే హువే వివాదం రాజుకోవటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios