ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) ప్రీమియం రేట్లను 1 జూన్ 2022 నుండి అమలులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
జూన్ నెల ప్రారంభం కాగానే భారీ ఆర్థిక మార్పులు అమలులోకి రావడంతో సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. నిజానికి కొత్త నెల ప్రారంభమైన ప్రతిసారీ కొన్ని చిన్న, పెద్ద మార్పులు కనిపిస్తాయి. కాబట్టి ఈసారి కూడా మీరు జూన్ ప్రారంభంలో జరిగే మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే అవి మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) అండ్ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)లకు ప్రీమియం పెంచబడింది. కొత్త ధరలు ఈరోజు జూన్ 1, 2022 నుండి వర్తిస్తాయి. ఈ పథకాల ఆర్థిక బలాన్ని ఉటంకిస్తూ ప్రీమియం పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త మార్పు ప్రకారం PMJJBY ప్రీమియం రోజుకు రూ. 1.25 పెరిగింది. ఈ పథకానికి గతంలో వార్షికంగా ఉన్న రూ.330కి బదులుగా ఇప్పుడు రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. అంటే 32 శాతం పెరిగినట్టు. కాగా PMSBY వార్షిక ప్రీమియం రూ.12 నుంచి రూ.20కి పెంచబడింది. అంటే 67 శాతం పెరిగింది. కొత్త ప్రీమియం ధరలు ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
పీఎం ఎస్‌బీవై అన్నది ప్రమాదంలో మరణించినా లేక పూర్తి వైకల్యం పాలైనా రూ.2 లక్షల పరిహారాన్ని చెల్లిస్తుంది. పాక్షిక వైకల్యం పాలైతే రూ.లక్ష పరిహారాన్ని చెల్లిస్తారు. పీఎం జేజేబీవై కింద పాలసీదారు ఏ కారణంతో మరణించినా రూ.2లక్షల పరిహారం లభిస్తుంది.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) ప్రీమియం రేట్లను 1 జూన్ 2022 నుండి అమలులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 7 సంవత్సరాల క్రితం 2015లో ఈ రెండు పథకాలు ప్రారంభించినప్పటి నుండి ప్రీమియం రేట్లలో మొట్టమొదటి సవరణ అని ప్రభుత్వం తెలిపింది.
పీఎం ఎస్‌బీవై ప్లాన్ ఆరంభం నుంచి 2022 మార్చి 31 వరకు రూ.1,134 కోట్ల ప్రీమియం వసూలైంది. కానీ, పాలసీ దారులకు పరిహారంగా బీమా సంస్థలు చెల్లించిన మొత్తం రూ.2,513 కోట్లుగా ఉంది. వచ్చిన ఆదాయంతో పోలిస్తే రెట్టింపు మొత్తం అవి చెల్లించాయి. ఇక పీఎం జేజేబీవై కింద 2022 మార్చి నాటికి రూ.9,737 కోట్ల ఆదాయం వసూలు కాగా, చెల్లించిన మొత్తం రూ.14,144 కోట్లుగా ఉంది.
