కేంద్ర ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో వచ్చే సోమవారం జరిగే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బోర్డు సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బోర్డు సమావేశ అజెండాను సభ్యులందరికీ ముందస్తుగా తెలియజేస్తారు.

ఈసారి మాత్రం కొందరు బోర్డు సభ్యులు అజెండా అంశాలతో పాటు మరికొన్ని ఇతర అంశాల్ని కూడా సమావేశంలో లేవనెత్తాలని భావిస్తున్నారని తెలిసింది. ఈ సమావేశంలో పాల్గొనే మొత్తం 18 మంది బోర్డు సభ్యుల్లో కొందరు ఎకనామిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌, మిగులు నిధుల నిర్వహణ, సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి కంపెనీ (ఎంఎస్‌ఎంఈ)లకు ద్రవ్య లభ్యత, మధ్యంతర డివిడెండ్‌ వంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వ ప్రోత్సాహంతో కొందరు సభ్యులు ఇలా
క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్, మిగులు నిధుల నిర్వహణ, లిక్విడిటీ చర్యలు అంశాలపై ప్రభుత్వ ప్రోత్సాహంతో కొంత మంది సభ్యులు ఆర్బీఐతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం.

ఇటీవల ఆర్థిక శాఖ గతంలో ఎన్నడూ ప్రయోగించని ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7న ప్రయోగించడానికి పూనుకుంటున్న నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్- కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తతలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకున్నాయి.

గత నెల రిజర్వ్ బ్యాంకు స్వయం ప్రతిపత్తిపై డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య చేసిన వాఖ్యలతో వివాదం రాజుకుంది. రిజర్వ్‌బ్యాంకు ప్రతిపత్తికి భంగం కలిగించే చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని విరాల్ ఆచార్య వ్యాఖ్యానించారు. 

నిబంధనల్లో మార్పులంటే తప్పనిసరి చట్ట సవరణ
మూలధన నిబంధనావళిలో మార్పులు చేయాలంటే ఆర్‌బీఐ చట్టం-1934కు సవరణలు తప్పనిసరని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. సంపన్న దేశాల్లో కనీస మూలధన నిష్పత్తి,  సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) నిబంధనావళికి సడలింపు, ఎంఎస్‌ఎంఈలతో పాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) రుణాలు మెరుగుపర్చడంపైనా చర్చించే వీలుంది.

ఆర్‌బీఐ వద్ద రూ.9.59 లక్షల కోట్ల నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఎంత పరిమాణంలో నిధులు ఆర్‌బీఐ వద్ద ఉండాలి’ అనే అంశంపై చర్చిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల సంగతి తెలిసిందే.

బోర్డు సభ్యులతోపాటు నిపుణుల వైఖరి కూడా కీలకమే
ఆర్బీఐ బోర్డులో 21 మంది ఉండేందుకు అవకాశం ఉన్నా, ప్రస్తుతం 18 మందే ఉన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌, నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌, విరాల్‌ ఆచార్య, బీపీ కనుంగో, ఎంకే జైన్‌ పూర్తిస్థాయి అధికారిక డైరెక్టర్లుగా ఉన్నారు.

ప్రభుత్వం నియమించిన మరో 13 మంది డైరెక్టర్లలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ కూడా ఉన్నారు. స్వామినాథన్‌ గురుమూర్తి, సహకార బ్యాంకర్‌ సతీశ్‌ మరాథె ప్రభుత్వం నియమించిన స్వల్పకాల అనధికార డైరెక్టర్లు సభ్యులు.

వ్యాపార దిగ్గజాలైన టాటా సన్స్ గ్రూప్‌ చైర్మన్ ఎన్‌.చంద్రశేఖరన్‌, మహీంద్రా గ్రూప్‌ ప్రతినిధి భారత్‌ నరోత్తమ్‌ దోశి, టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సహ వ్యవస్థాపకులు మనీశ్‌ సభర్వాల్‌, సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వి బోర్డులో ఉన్నారు.

సుధీర్‌ మన్‌కడ్‌ (మాజీ ఐఏఎస్‌), అశోక్‌ గులాటి (వ్యవసాయ ఆర్థికవేత్త), ప్రసన్న మొహంతి (ఆర్థికవేత్త), సచిన్‌ చతుర్వేది, రేవతి అయ్యర్‌ (మాజీ డిప్యూటీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) ఉన్నారు.

19న జరిగే సమావేశంలో వీరు ఎలా స్పందిస్తారు?  ఏయే అంశాలు ప్రస్తావిస్తారు అనేది కీలకం కాబోతోంది. వివాదం పెరిగితే ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బోర్డు సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భిన్నాభిప్రాయనన్న ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ గాంధీ
ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై జరుగుతున్న చర్చ, నిర్వహణలో ప్రభుత్వ జోక్యం కేవలం అభిప్రాయ భేదమేనని భారతీయ రిజర్‌బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ అన్నారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రయోగంపై చర్చ జరగడం దురదృష్టకరమన్నారు.

ఇలాంటి చర్చల్లో కొత్తదనమేమీ లేదన్నారు. రెండింటి మధ్య తరచుగా చర్చలు జరుగుతూ ఉంటే ఇలాంటి పరిస్థితుల తలెత్తవని, చర్చలతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.

వార్షిక ఆడిటింగ్ పూర్తయిన తర్వాత విధిగా ఆర్బీఐ కేంద్రానికి ఇవ్వాల్సిన డివిడెండ్‌ను చెల్లిస్తుందనీ అన్నారు. ప్రభుత్వం సల్పకాల ప్రయోజనాల కోసం అలోచిస్తుందని, ఆర్బీఐ దీర్ఘకాల విజన్‌తో పనిచేస్తుందని గాంధీ అన్నారు. అందుకే అభిప్రాయ భేదాలు తలెత్తుతాయని అన్నారు.

దేశీయ మూలధన అవసరాలు కీలకమే
అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకుల సగటు క్యాపిటల్‌కు అనుగుణంగా రిజర్వ్‌బ్యాంకు క్యాపిటల్‌ను తీసుకువచ్చి తద్వారా నిధులను ఉత్పాదక రంగాలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది.

మొండి బకాయిలు, డిఫాల్ట్‌లు అధికంగా ఉన్నందున దేశీయ బ్యాంకుల మూలధన అవసరాలు కూడా ఎక్కువేనని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్ ఖండించారు. మరో వైపు క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్‌కు సంబంధించి గత వారం ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ప్రస్తావిస్తూ రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న రూ. 9.59 లక్షల కోట్ల రిజర్వులను బదలాయించడానికి నిరాకరించినందున, సెంట్రల్‌బ్యాంకుల వద్ద ఉండాల్సిన క్యాపిటల్ ఏ స్థాయిలో ఉండాలన్న అంశంపై చర్చిస్తున్నట్టు తెలిపారు.

ద్రవ్యలోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం రూ. 3.6 లక్షల కోట్లను అడగడం లేదని స్పష్టం చేశారు. క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ మారిస్తే తప్ప రిజర్వుబ్యాంకు నుంచి అదనంగా నిధులు రావు కనుక దాన్ని మార్చే ప్రయత్నాలకు బోర్డు సమావేశం చర్చా వేదికగా కాబోతున్నది.

నాలుగు నెలల ముందు ఈ తొందరెందుకు: చిదంబరం
‘ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఇక నాలుగు నెలల సమయమే మిగిలి ఉంది. ఇలాంటి తరుణంలో ఆర్‌బీఐ మూలధన నిబంధనావళిని మార్చేయాలన్న తాపత్రయం ఎందుకొచ్చిందో అర్థం కావడం లేద’ని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ట్విటర్‌లో పేర్కొన్నారు.

అదనపు ధనం అవసరం లేదని ఒకపక్క అంటూనే, ఆర్బీఐపై ఎందుకు ఒత్తిడి పెంచుతున్నారని ప్రశ్నించారు. 2018-19 సంవత్సరానికి రూ. 70 వేల కోట్ల రుణ సమీకరణను కూడా వదులుకున్నట్టు గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఆర్బీఐ రిజర్వుల నుంచి డబ్బును ఎందుకు ఆశిస్తున్నట్టు అని అయన ప్రశ్నించారు.

ప్రభుత్వానికి నిధుల కొరత లేదనీ, రిజర్వ్‌బ్యాంకు క్యాపిటల్ రిజర్వులు ఎంతవరకు ఉండవచ్చునన్న అంశంపైనే చర్చిస్తున్నట్టు గత వారం ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ట్వీట్ చేశారు. దానికి ప్రతిస్పందనగా చిదంబరం ట్విట్టర్ వేదికగా తూర్పారపట్టారు.