Asianet News TeluguAsianet News Telugu

7.3%: వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ టాప్

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) వెల్లడించింది. 2019లో భారత వృద్ధిరేటు 7.3శాతంగా ఉంటుందని, 2020లో ఈ రేటు 7.5శాతంగా ఉండనుందని అంచనా వేసింది.

Indian Economy To Grow 7.3% In 2019: IMF
Author
New Delhi, First Published Apr 10, 2019, 10:14 AM IST

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) వెల్లడించింది. 2019లో భారత వృద్ధిరేటు 7.3శాతంగా ఉంటుందని, 2020లో ఈ రేటు 7.5శాతంగా ఉండనుందని అంచనా వేసింది.

పెట్టుబడుల్లో వేగవంతమైన రికవరీ నమోదవుతోందని, వినియోగ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయని ఐఎంఎఫ్‌ వెల్లడించింది. భారత వృద్ధి పటిష్టతకు ఈ అంశాలు  కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది. 

కాగా, 2018లో భారత వృద్ధి రేటు 7.1 శాతం. ఇది చైనా 6.6 శాతం వృద్ధిరేటుకన్నా అధికం కావడం గమనార్హం. 2019, 2020ల్లో చైనా వృద్ధిరేట్లు వరుసగా 6.3 శాతం, 6.1 శాతం ఉంటాయని ఐఎంఎఫ్ విశ్లేషించింది. 

ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్‌ వార్షిక స్ప్రింగ్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై సోమవారం ప్రపంచ ఎకనామిక్ అవుట్‌లుక్‌ విడుదల కాగా, మంగళవారం ఐఎంఎఫ్‌ కూడా ఈ మేరకు ఒక నివేదికను ఆవిష్కరించింది. 

నివేదికలోని భారత్‌కు సంబంధించి అంశాలు ఇలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, దీనితో వడ్డీరేట్ల తగ్గుదల భారత్‌ వృద్ధి జోరుకు కారణంగా తెలుస్తోంది. మధ్యకాలికంగా చూస్తే, 7 శాతం స్థాయిలో భారత్‌ వృద్ధి స్థిరీకరణ పొందే అవకాశం ఉంది. 

వ్యవస్థాగత సంస్కరణల అమలు, మౌలిక ప్రాజెక్టుల విషయంలో అవరోధాల తొలగింపు ఈ అంచనాలకు కారణంగా వెల్లడించింది.  భారత్‌లో వ్యవస్థాగత, ఫైనాన్షియల్‌ రంగాలకు సంబంధించి సంస్కరణలు కొనసాగుతాయని విశ్వసిస్తుమని తెలిపింది.

ప్రభుత్వ రుణం తగిన స్థాయిలో ఉంచడం వృద్ధి పటిష్టతకు దోహదపడే మరో అంశమని వెల్లడించింది. అంశాల్లో ఒకటి. ద్రవ్యలోటు కట్టడికి కూడా భారత్‌ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నామని, ఇలాగే కొనసాగితే భారత వృద్ధిరేటుకు ఢోకా ఉండదని పేర్కొంది.

ఫైనిన్షియల్ రంగ పటిష్టత కోసం కంపెనీల బ్యాలెన్స్ షీట్ల మెరుగుదలకు తగిన ప్రయత్నాలు జరగాలని పేర్కొంది. సరళీకృత దివాల విధానాల పరిధిలో మొండిబకాయిలు(నాన్ పెర్ఫార్మింగ్ అస్సెట్స్-ఎన్‌పీఏ) ఉండాలని అభిప్రాయపడింది. అంటే ఎన్‌పీఏల సమస్య పరిష్కారమయ్యేందుకు మెరుగైన అవకాశాలు ఉండాలని, బ్యాంకింగ్‌ రంగం పటిష్టతకు ఇవి ఉపయోగపడేలా ఉండాలని తెలిపింది.

భూ సంస్కరణలు, మౌలిక రంగాల వృద్ధి వంటి అంశాల్లో వేగవంతమైన పురోగతి ఉండాలని, అప్పుడే ఉ పాధి కల్పన అవకాశాల్లో మెరుగుదల నమోదవుతుందని పేర్కొంది. 

కాగా, 2019లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాకు ఐఎంఎఫ్‌ కోత పెట్టింది. వృద్ధి 3.3 శాతమే నమోదవుతుందని తాజా అంచనాల్లో వెల్లడించింది. 2020ల్లో ఈ రేటు 3.6 శాతంగా విశ్లేషించింది.

ఇక చైనా, అమెరికాల విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. 2019, 2020ల్లో చైనా వృద్ధి నెమ్మదిగానే ఉండే వీలుందని పేర్కొంది. 2018లో అంతర్జాతీయ వృద్ధి మందగమనంలో పడిపోయిందని తెలిపింది. చివరి ఆరు నెలల కాలంలో ఈ పరిస్థితి మరింత క్షీణించిందని, దీనికి చైనా–అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం అంశాలే ప్రధాన కారణమని అభిప్రాయపడింది. 

పన్నుల వ్యవస్థలను ఆధునీకరించడం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చ చేయడం ద్వారా ప్రజా రుణాలు, సంపద అసమానతలను తగ్గించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సభ్య దేశాలకు ఐఎంఎఫ్ సూచించింది. ప్రస్తుత సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 70శాతం ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే ఉందని వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios