ఈ ఆర్ధిక సంవత్సరంలో భారత ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు పెరిగింది. మంగళవారం విడుదలైన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాల ప్రకారం ఇది 8.7 శాతంగా నమోదైంది. మరోవైపు దేశంలో ద్రవ్యలోటు కూడా బాగా పెరిగింది.  

మంగళవారం విడుదలైన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్‌వో) గణాంకాల ప్రకారం భారత ఆర్ధిక వ్యవస్థ 8.7 శాతం వృద్ధి చెందింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 8.7 శాతంగా అంచనా వేయబడింది. ఇది గత ఆర్ధిక సంవత్సరంలో 6.6 శాతానికి కుదించారు. ఎనిమిది ప్రధాన పరిశ్రమల సంయుక్త సూచిక ఏప్రిల్ 2022లో 143.2 వద్ద వుంది. ఇది ఏప్రిల్ 2021 నాటి సూచికతో పోలిస్తే 8.4 శాతం పెరిగింది. మరోవైపు 2021-22 ఆర్ధిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి జనవరి - మార్చి త్రైమాసికంలో 4.1 శాతంగా వుంది. ఇది గడిచిన మూడు నెలల కాలంలో 5.4 శాతంగా నమోదైంది. ఎన్ఎస్‌వో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020- 21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆ ఏడాది జనవరి - మార్చి కాలంతో పోలిస్తే జీడీపీ 2.5 శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌వో రెండవ ముందస్తు అంచనాలో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను జడీపీ వృద్ధి 8.9 శాతంగా అంచనా వేసింది. 

మరో డేటా ప్రకారం దేశంలో ద్రవ్యలోటు కూడా బాగా పెరిగింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను, జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఇది ‘కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ’ వేసిన అంచనాల కంటే తక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 6.9 శాతంగా నమోదవుతుందని కేంద్రం తొలుత అంచనా వేసింది. ఈ విషయాన్ని ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల్లో కూడా పొందుపరిచారు. తర్వాత ఈ అంచనాలను 6.9 శాతానికి మార్చారు. 

అయితే, ఈ అంచనాలను తల్లకిందులు చేస్తూ జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకు మించి పెరిగిన విషయం తెలిసిందే. బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగి, గోధుమ, కూరగాయలు, పండ్ల ధరలు భారీగా పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణానికి దారి తీసినట్లు ఆర్ధిక శాఖ తెలిపింది. మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఎనిమిది మౌలిక సదుపాయాల రంగాలు ఏప్రిల్‌లో 62.6 శాతం విస్తరణతో 8.4 శాతం వృద్ధిని సాధించాయి. బొగ్గు, ముడిచమురు, సహజవాయుడు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్ , విద్యుత్ వంటి మౌలిక రంగాల ఉత్పత్తి మార్చి 2022లో 4.9 శాతం పెరిగింది. తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా కోర్ సెక్టార్ ఏప్రిల్ 2021లో అనూహ్యంగా 62.6 శాతం వృద్ధి రేటును సాధించింది.