సౌదీ అరేబియాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), విప్రో, కార్నివల్‌ సినిమాస్‌, గ్లెన్‌మార్క్‌తోపాటు 15 భారత సంస్థలు  పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇందుకోసం బుధవారం జరిగిన సౌదీ- ఇండియా ఫోరం కార్యక్రమంలో ఈ కంపెనీలు అవగాహన పూర్వక ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. 

15 ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్, సౌదీ
ఇందులో 11 కంపెనీల ఎంఓయూలు మునుపటి ఒప్పందాలకు కొనసాగింపు కాగా.. నాలుగు కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందాలని సౌదీ అరేబియేన్‌ జనరల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటికి సంబంధించి ఆయా కంపెనీలకు లైసెన్సులు జారీ చేశామని వెల్లడించింది.

రిలయన్స్‌తో జట్టుకు సౌదీ అరామ్కో ఆసక్తి
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో జట్టు కట్టేందుకు సౌదీ అరామ్కో ఆసక్తిగా ఉంది. భారత పెట్రోకెమికల్స్‌, రిఫైనరీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌తోపాటు ఇతర కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సౌదీ అరామ్కో సీఈఓ అమీన్‌ అల్‌-నాసర్‌ తెలిపారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు సౌదీ అరేబియా యువ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. 

భారత్‌లో 10వేల కోట్ల డాలర్ల పెట్టుబడులకు సౌదీ ఓకే
భారత్‌లోని ఆయా రంగాల్లో 10,000 కోట్ల డాలర్ల (రూ.7.10 లక్షల కోట్లు) పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అన్నారు. 2016లో భారత ప్రధాని మోదీ సౌదీ అరేబియాలో పర్యటించినప్పటి నుంచి ఇప్పటివరకు 4,400 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. 

ఇండియాతో ద్వైపాక్షిక బంధం పటిష్టానికే సౌదీ ప్రాధాన్యం
ఇరు దేశాలకు ప్రయోజనం కలిగేలా భారత్‌తో పెట్టుబడి, వాణిజ్య సంబంధాలను మరింత పటిష్ఠపర్చుకోవాలని భావిస్తున్నట్లు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పారు. బుధవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మోదీతో కలిసి ప్రసంగిస్తూ భారత్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) సామర్థ్యాన్ని ప్రశంసించారు. 

ఐటీలోనే పెట్టుబడులు పెడుతున్నామన్న సౌదీ యువరాజు సల్మాన్
తమ దేశం కూడా ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోందని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అన్నారు. భారత పెట్రోకెమికల్స్‌ రంగంలో సౌదీ ఇప్పటికే భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఇతర రంగాల్లోనూ తాము పెట్టబడులు పెట్టాలని భావించామని సౌదీ యువరాజు సల్మాన్ తెలిపారు. 

పెట్రో కెమికల్స్ తదితర రంగాల్లో సౌదీ పెట్టుబడులు
భారత్‌లోని ఇంధనం, పెట్రోకెమికల్స్‌, మాన్యుఫాక్చరింగ్‌లో 10 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ అరేబియా హామీ ఇచ్చిందని విదేశాంగ శాఖ కార్యదర్శి (ఈఆర్‌) టీఎస్‌ తిరుమూర్తి తెలిపారు. ఎప్పటిలోగా ఈ పెట్టుబడులు వస్తాయన్న ప్రశ్నకు మాత్రం ఆయన నిర్దిష్ట సమయమేమీ లేదన్నారు.

కీలక రంగాల్లో పురోగతి కోసం భాగస్వామ్య ఒప్పందాలు
ఇంధనం, నీళ్లు, సాంకేతికత, కళలు, వినోదం, ఆరోగ్య సంరక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు సహా పలు వ్యూహాత్మక వృద్ధి రంగాల్లో సౌదీ అరేబియా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కేంద్రం వివరించింది. 

సౌదీలో పెట్టుబడులకు భారత్ ప్రాధాన్యత ఇలా
సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టాలని భారత్‌ కూడా అనుకుంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి సురేశ్‌ ప్రభు వెల్లడించారు.  కేవలం పెట్రోలియమ్‌ ఉత్పత్తుల రంగానికే పరిమితం కాకుండా వైవిధ్యభరిత రంగాలు, ఉత్పత్తులు, ప్రాంతాల్లో అడుగుపెట్టడంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.