Asianet News TeluguAsianet News Telugu

ఇక ‘భారత్’దే: డ్రాగన్‌పై పైచేయి.. ఇదీ వరల్డ్ బ్యాంక్ అంచనా!!

ఇక భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని ప్రపంచ బ్యాంక్‌ భారీగా అంచనా వేసింది. ప్రపంచంలోకెల్లా ఐదో ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని గత ఆర్థిక సంవత్సర వృద్ధి 7.5 శాతం నమోదవుతుందని తెలిపింది. వచ్చే రెండేళ్లలోనూ జీడీపీ యథాతథంగా ఉంటుందని పేర్కొంది. 

India to become 5th largest economy globally this year 2nd in APAC region by 2025
Author
Washington D.C., First Published Jun 6, 2019, 10:59 AM IST

వాషింగ్టన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) దేశ జీడీపీ అంచనాను యధాతథంగానే ఉంచిన ప్రపంచ బ్యాంక్.. గతంలో చెప్పినట్లుగానే 7.5 శాతం వృద్ధిరేటునే తాజాగా మరోసారి ప్రకటించింది. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ ఇంతే వృద్ధిరేటు నమోదు కాగలదని అంచనా వేసింది.

దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రపంచ బ్యాంక్ అంచనాలు మోదీ సర్కార్‌కు శుభవార్తేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2018-19) చివరి త్రైమాసికంలో జీడీపీ ఐదేళ్ల కనిష్ఠానికి పతనమైన విషయం తెలిసిందే. 5.8 శాతంగానే నమోదైంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును 7.5 శాతంగా ప్రపంచ బ్యాంక్ అంచనా వేయడం.. దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయన్న సంకేతాలనే ఇస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ ఆర్థిక అవకాశాలు పేరుతో ప్రపంచ బ్యాంక్ తాజాగా భారత్‌తోపాటు పలు కీలక దేశాల వృద్ధిరేటు గణాంకాలను విడుదల చేసింది. 

2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లోనూ 7.5 శాతం వృద్ధిరేటును భారత్ సాధించగలదని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. పెట్టుబడులు, వినియోగ సామర్థ్యం పుంజుకుంటాయన్న ధీమాతోనే ఈ అంచనా అని ప్రపంచ బ్యాంక్ తమ నివేదికలో పేర్కొన్నది.

దీంతో మోదీ సర్కార్‌పై విశ్వాసంతోనే తాజా అంచనాలు వచ్చాయన్న అభిప్రాయాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 7.2 శాతంగానే దేశ జీడీపీ నమోదు కావచ్చని పేర్కొన్నది.

పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సమయంలో విడుదలైన ఈ జీడీపీ అంచనాలు.. బడ్జెట్‌లో పలు ఉత్సాహవంత ప్రకటనలకు దోహదం చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆర్థిక మందగమనం, బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు, నాన్-బ్యాంకింగ్ రంగంలో నగదు కొరత, ఉద్యోగ సృష్టి, ప్రైవేట్ పెట్టుబడుల పెంపు, ఎగుమతుల వృద్ధి, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చే నెల 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారని తెలుస్తున్నది. 

భారత జీడీపీపై విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంక్.. చైనా వృద్ధిరేటు విషయంలో మాత్రం అంత నమ్మకం చూపలేకపోయింది. గతేడాది 6.6 శాతంగా ఉన్న డ్రాగన్ వృద్ధిరేటును.. ఈ ఏడాది 6.2 శాతానికి అంచనా వేసింది. వచ్చే ఏడాది 6.1 శాతం, ఆపై ఏడాది 6 శాతంగానే పేర్కొనడం గమనార్హం. 

దీంతో వేగవంతమైన వృద్ధిరేటును కలిగిన దేశంగా భారత్ ఇక ముందూ కొనసాగే వీలు చిక్కింది. ఈ విషయంలో భారత్-చైనా గణాంకాలు దోబూచులాడుకుంటున్న సంగతి తెలిసిందే.

2021లోనూ చైనాతో పోల్చితే భారత్ వృద్ధిరేటు 1.5 శాతం అధికంగా ఉండగలదని చెప్పడంతో ఆసియా ఖండంలో చైనాపై భారత్ ఆధిపత్యం కొనసాగనున్నట్లయింది. కాగా, అమెరికాతో వాణిజ్య యుద్ధం.. చైనా జీడీపీకి బ్రేకులు వేస్తున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios