Asianet News TeluguAsianet News Telugu

భారత్ - అమెరికా మధ్య వాణిజ్య యుద్ధమా? ట్రంప్ సాహసిస్తారా?


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్రుష్టిలో ఏదీ ఆయన మిత్ర దేశంగా కనిపిస్తున్న దాఖలాలు లేవు. ఇటీవల తరుచుగా భారత్ అధిక సుంకాలు విధిస్తున్నదని, దానికి ప్రాదాన్య హోదా ఉపసంహరిస్తామని హెచ్చరిక చేస్తున్నారు. అదే జరిగితే ప్రతిగా భారత్ కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు భారీగా పెంచే అవకాశం ఉన్నది. ఏప్రిల్ ఒకటో తేదీ గడువు అని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి కూడా పేర్కొన్నారు. 

India may impose retaliatory tariffs on US goods from April 1
Author
Hyderabad, First Published Mar 6, 2019, 4:08 PM IST

అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 29 వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ‘జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ)’ కింద భారత్‌కు కల్పించే ప్రయోజనాలను తగ్గించాలని అమెరికా నిర్ణయిస్తే కేంద్రం కూడా ప్రతిగా సుంకాలు విధించే అవకాశం ఉన్నది. ఈ ప్యాకేజీ 60 రోజుల పాటు సాగుతుందని, ఒకవేళ వాణిజ్య సంబంధమైన వివాదాలు, సమస్యలపై అమెరికా, భారత్ రాజీకి వస్తే ఈ నిర్ణయం వెనుకడుగు వేయొచ్చునని కేంద్ర విదేశాంగశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాల్ నట్స్, చిక్ పీస్, లెంటిల్స్, బోరిక్ ఆసిడ్, డయాగ్నిస్టిక్ రీఏజెంట్స్ తదితర వస్తువులపై 290 మిలియన్ల డాలర్ల భారం పడనున్నది. గతేడాది జూన్ నెలలో స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. ఇప్పటికే రాయితీ కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఆరుసార్లు విఫలమయ్యాయి. ఏప్రిల్ ఒకటో తేదీ తుది గడువు కానున్నదని, దాని కోసం వేచి చూస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. 

ఇదిలా ఉంటే భారత్‌కు ఇచ్చిన ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్‌పీ)ను వెనుకకు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. తమ ఉత్పత్తులపై అధిక సుంకాలను వేస్తూ జీఎస్‌పీ ఉద్దేశాన్ని భారత్ నీరుగార్చిందని ఆరోపిస్తున్న ట్రంప్.. దాన్ని ఉపసంహరించాలని చూస్తున్నారు.

ఇదే జరిగితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న దాదాపు రూ.40,000 కోట్లు (5.6 బిలియన్ డాలర్ల) విలువైన ఉత్పత్తులపై భారం పడనున్నది. ప్రస్తుతం వీటికి జీఎస్‌పీలో భాగంగా పన్నులు లేవు. నిజానికి ఇటీవల భారత్‌ను అధిక సుంకాల దేశంగా తరచూ అభివర్ణిస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలో జీఎస్‌పీ అర్హత తొలగింపునకు తన సమ్మతిని తెలుపుతూ సోమవారం ఆ దేశ పార్లమెంట్‌కు లేఖలు పంపడం గమనార్హం. 
తద్వారా భారత్‌కు వాణిజ్య యుద్ధ సంకేతాలను ఇచ్చారు. టర్కీపైనా అగ్రరాజ్య అధ్యక్షుడు ఇదే తీరును కనబరుచడం గమనార్హం. జీఎస్‌పీ ఉపసంహరణ జరిగితే చైనా తరహాలోనే భారత్, టర్కీలపైనా అమెరికా తీరు ఉండనున్నది. ఇప్పటికే వాణిజ్య లోటును తగ్గించడానికి పదేపదే భారత్‌లో అధిక సుంకాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో జీఎస్‌పీని వెనుకకు తీసుకుని భారత్‌తోనూ ప్రతీకార సుంకాలకు తెర తీద్దామన్నదే ట్రంప్ తాజా ఆలోచన అంతరార్థమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నట్లు భారత్‌లో అధిక సుంకాలు ఏమీ లేవని కేంద్ర వాణిజ్య కార్యదర్శి అనుప్ వివరణ ఇచ్చారు. 

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు అనుగుణంగానే భారత్ సుంకాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి అనుప్ స్పష్టం చేశారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే భారత్ వసూలు చేస్తున్న దిగుమతి సుంకాలు తక్కువేనని ఆయన చెప్పారు. 

జీఎస్‌పీ ఉపసంహరణ నిర్ణయం కొన్ని రంగాలనే ప్రభావితం చేస్తుందని భారత ఎగుమతిదారుల సంఘం ఎఫ్‌ఐఈవో అభిప్రాయపడింది. శుద్ధిచేసిన ఆహారం, తోలు, ప్లాస్టిక్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు వంటి రంగాల ఎగుమతులపై జీఎస్‌పీ ప్రభావం ఉంటుందని ఎఫ్‌ఐఈవో అధ్యక్షుడు గణేశ్ కుమార్ గుప్తా చెప్పారు. అయితే జీఎస్‌పీ ఉపసంహరణ జరిగితే కేంద్రం ఈ రంగాల ఎగుమతులకు చేయూతనివ్వాలని ఆయన కోరారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నలా భావించే అమెరికాను.. ట్రంప్ దుందుడుకు వైఖరి అబాసుపాలు చేస్తున్నది. నిత్యం వివాదాస్పద నిర్ణయాలతో ఇరుగుపొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న ట్రంప్ తీరు.. అగ్రరాజ్య గత వైభవాన్ని మసకబారుస్తున్నది. స్వేచ్ఛ, విశాల దృక్పథాలకు చిరునామాగా ఉన్న అమెరికా.. ట్రంప్ రాకతో స్వార్థ ప్రయోజనాలకు నిలయంగా మారింది. 

ముఖ్యంగా వ్యాపార రంగంలో ట్రంప్ సర్కార్ ఆలోచనలు.. ఆ దేశ ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక అసమానతల నిర్మూలనకు పెద్దపీట వేసిన పెద్దన్న.. ఇప్పుడు ఆధిపత్య పోరుకే అగ్ర తాంబూలం ఇస్తున్నారు మరి. మొత్తానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాల ప్రయోజనాలకు అండగా నిలిచిన అమెరికా దృక్పథానికే ట్రంప్ తూట్లు పొడుస్తున్నారు.

అగ్రరాజ్య అధ్యక్ష పీఠం అధిరోహించిన నాటి నుంచి ట్రంప్ అన్నీ వివాదాస్పద నిర్ణయాలనే తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాణిజ్యపరమైన అంశాల్లో ట్రంప్ దూకుడు.. భారత్ వంటి మైత్రి దేశాలనూ ఇబ్బంది పెడుతున్నది. ఇప్పటికే హెచ్ 1-బీ వీసాల నిబంధనల్ని కఠినతరం చేసి భారతీయ ఐటీ రంగాన్ని, అమెరికా ఉద్యోగాల్ని ఆశిస్తున్న భారతీయులని తీవ్రంగా ట్రంప్ దెబ్బతీసిన విషయం తెలిసిందే.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న చైనాపై పరస్పర సుంకాలను విధిస్తూ వాణిజ్య యుద్ధానికీ తెరతీసిన సంగతీ విదితమే. అధికారంలోకి వస్తే అక్రమ వలసల్ని అరికడుతామని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని, వాణిజ్య లోటును సరిచేస్తామన్న ట్రంప్.. ఆ వాగ్ధానాలను నిలబెట్టుకునేందుకు కఠిన వైఖరినే అవలంభిస్తున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్య హోదాలో అమెరికాకున్న ప్రాధాన్యాలనూ మరిచి వివాదాస్పద నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు.

జీఎస్‌పీని అమెరికా వెనుకకు తీసుకుంటే భారత్‌పై చెప్పుకోదగ్గ ప్రభావమేమీ ఉండబోదని వాణిజ్య కార్యదర్శి అనుప్ వాధవాన్ అన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2017-18)లో అమెరికాకు భారత్ 48 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయగా, అందులో జీఎస్‌పీ కింద 5.6 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉన్నాయని, వీటికి 190 మిలియన్ డాలర్ల పన్ను ప్రయోజనమే వచ్చిందని చెప్పారాయన. 

భారత్ ప్రధానంగా ముడి సరుకులు, ఆర్గానిక్ కెమికల్స్ వంటి ఇంటర్మీడియేట్ గూడ్స్‌ను అమెరికాకు ఎగుమతి చేస్తున్నది. 1976 నుంచి జీఎస్‌పీ కింద అమెరికా మార్కెట్‌లో రసాయనాలు, ఇంజినీరింగ్ వంటి పలు రంగాలకు చెందిన 1,937 భారతీయ ఉత్పత్తులకు పన్ను మినహాయింపులు లభిస్తున్నాయి.

పేదరికంలో మగ్గిపోతున్న దేశాలకు, అవకాశాలు లేక అభివృద్ధిలో వెనుకబడిన దేశాలకు అమెరికా వాణిజ్యపరంగా ఇచ్చిన ఓ భరోసా. ఈ జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్‌పీ) కింద అమెరికాకు ఎగుమతులు చేస్తున్న దేశాలకు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. భారత్‌కు ఇప్పుడు 5.6 బిలియన్ డాలర్ల ప్రయోజనం కలుగుతున్నది. ఈ హోదా దూరమైతే ఎగుమతులకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

జీఎస్‌పీ పరిధిలో ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులున్నాయి. పశుసంరక్షణ, మాంసం, చేపలు వంటి సముద్ర ఉత్పత్తులు, హస్తకళల వస్తువులకు జీఎస్‌పీ కింద పన్నులు పడటం లేదు. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రధాన ఆదాయ వనరులైన ఎగుమతులకూ జీఎస్‌పీలో భాగంగా పన్ను మినహాయింపో లేక స్వల్ప పన్నులో వర్తిస్తున్నాయి.

జీఎస్‌పీ కింద ప్రపంచంలోని దాదాపు 120 అభివృద్ధి చెందుతున్న దేశాలు లబ్ధి పొందుతున్నాయి. గతేడాది డిసెంబర్ నాటికి భారత్, బ్రెజిల్ దేశాలే ఎక్కువ ప్రయోజనం అందుకున్న దేశాలు. ఈ విషయంలో టర్కీ ఐదో స్థానంలో ఉన్నది. చైనాతోపాటు మరికొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు జీఎస్‌పీ అర్హత లేదు. లబ్ధి పొందుతున్న దేశాలను, జీఎస్‌పీ పరిధిలో ఉన్న ఉత్పత్తులను ఏటా అమెరికా సవరిస్తూ ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios