న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు పురోగతికి పరిమితులు ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ సంస్థ ‘ఫిచ్’ పేర్కొంది. గతంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరా (2019–20) నికి గతంలో వేసిన 6.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది. అధిక రుణ భారం వల్ల ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశాలు ప్రభుత్వానికి పరిమితంగానే ఉన్నాయని ఈ సంస్థ అభిప్రాయపడింది. 

రానున్న సంవత్సరంలో భారత జీడీపీ 7.1 శాతానికి పుంజుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత రేటింగ్‌ను మార్పు చేయకుండా బీబీబీ మైనస్, స్థిరమైన దృక్పథాన్నే కొనసాగించింది.

అధిక స్థాయిలో ప్రభుత్వ రుణం, ఆర్థిక రంగ సమస్యలు, కొన్ని నిర్మాణాత్మక అంశాలు వెనక్కి లాగుతున్నా... బలమైన విదేశీ మారక నిల్వలతో మధ్య కాలానికి వృద్ధి పరంగా మంచి అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ తెలిపింది. వరుసగా ఐదో త్రైమాసిక కాలం (ఏప్రిల్‌–జూన్‌)లో భారత జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. 

‘దేశీయ డిమాండ్‌ క్షీణిస్తోంది. ప్రైవేటు వినియోగం, ఇన్వెస్ట్‌మెంట్‌ బలహీనంగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్య వాతావరణం కూడా బలహీనంగానే ఉంది’ అని ఫిచ్ వివరించింది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ప్రైవేట్ వినియోగం 1.8 శాతానికి పడిపోయిందని గుర్తు చేసింది. 

మరోవైపు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకున్న ఆటోమొబైల్ రంగానికి ఉద్దీపన ప్యాకేజీ అమలు చేయడంతోపాటు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గింపు, బ్యాంకులకు అదనపు నిధులు సమకూర్చినా, ద్రవ్య విధానంలో సడలింపులకు పరిమితులు ఉన్నాయని ఫిచ్ పేర్కొంది. వివిధ రంగాల్లో ఎఫ్ డీఐ పెట్టుబడులను అనుమతించేందుకు నిబంధనలను సడలిస్తూ సంస్థాగత సంస్కరణలు తెచ్చింది మోదీ సర్కార్. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నా అధిక రుణాల వల్ల ముందడుగు వేయడానికి పరిమిత అవకాశాలు ఉన్నాయని ఫిచ్ స్పష్టం చేసింది.