Asianet News TeluguAsianet News Telugu

ఇండియాకు స్విస్ ఖాతాల డిటైల్స్.. బట్!

భారతదేశానికి స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న నల్ల కుబేరుల జాబితా అందింది. కానీ ఇప్పటికే పలువురు భారతీయులు ఆయా ఖాతాలను మూసేశారని సమాచారం. స్విస్ట్ ఖాతాల్లో అత్యధికం అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా ఖండ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలవేని తెలుస్తోంది.

India Gets First Tranche of Swiss Account Details, Will Help Govt Uncover Black Money
Author
Hyderabad, First Published Oct 8, 2019, 2:31 PM IST

నూతన సమాచార మార్పిడి ఒప్పందానికనుగుణంగా స్విస్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో భారతీయుల ఖాతాల వివరాల తొలి సమాచారాన్ని భారత్‌ అందుకుంది. విదేశాల్లో దాగిన నల్ల కుబేరుల బ్లాక్‌మనీ వెలికితీసే ప్రక్రియలో ఇది భారీ ముందడుగని భావిస్తున్నారు. భారత్‌తోపాటు 75 దేశాలు స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ) నుంచి ఇదే తరహా సమాచారం పొందుతాయని ఎఫ్‌టీఏ ప్రతినిధి వెల్లడించారు. 

ఆటోమేటిక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఏఇఓఐ) ఫ్రేమ్‌వర్క్‌ కింద స్విట్జర్లాండ్‌ నుంచి భారత్‌ తమ ఖాతాదారుల వివరాలపై సమాచారాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. స్విస్‌ బ్యాంకుల్లో 2018లో చురుకుగా ఉన్న భారతీయుల ఖాతాలు, మూసివేసిన ఖాతాల వివరాలను కూడా తాజా సమాచారంలో పొందుపరిచారు. 

వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో తదుపరి సమాచార మార్పిడి జరుగుతుందని ఎఫ్‌టీఏ ప్రతినిధి తెలిపారు. ఎఫ్‌టీఏ మొత్తమ్మీద 75 దేశాల పౌరులకు చెందిన 31 లక్షల ఖాతాల సమాచారం ఆయా దేశాలతో పంచుకోగా, వారి నుంచి 24 లక్షల ఖాతాల సమాచారాన్ని సేకరించింది. 

ఈ డేటాలో బ్యాంకు ఖాతాదారు పేరు, ఖాతా సంఖ్యతో పాటు ఖాతాదారుని అడ్రస్‌, చిరునామా, పన్ను గుర్తింపు సంఖ్య సహా బ్యాంకు, ఆర్థిక సంస్థ పేరు ఖాతాదారు ఖాతాలో ఉన్న నిధుల వివరాలు, క్యాపిటల్‌ ఇన్‌కమ్‌ వంటి పలు వివరాలు ఉంటాయి.

భారత్‌కు స్విస్‌ బ్యాంకుల నుంచి లభించిన వివరాలతో అనధికార సంపద పోగేసిన వారిపై గట్టి చర్యలు చేపట్టేందుకు వీలు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఖాతాల డిపాజిట్లు, నగదు బదిలీ, పెట్టుబడుల ద్వారా రాబడులు వంటి కీలక సమాచారం వెల్లడవడంతో నల్ల కుబేరుల గుట్టుమట్లు దర్యాప్తు అధికారులకూ కీలక ఆధారాలుగా మారనున్నాయి.

 కాగా స్విస్‌ యంత్రాంగం అందించిన సమాచారం ఎక్కువగా భారత వాణిజ్యవేత్తలు, అమెరికా, బ్రిటన్‌ సహా ఆఫ్రికా దేశాల్లో స్ధిరపడిన ఎన్నారైలవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నల్లధనంపై ఉక్కుపాదం మోపాలని పలు దేశాలు నిర్ణయించిన క్రమంలో పలువురు భారతీయులు ఇప్పటికే స్విస్‌ సహా విదేశీ బ్యాంకుల్లో తమ ఖాతాలను మూసివేశారనే ప్రచారం సాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios