Asianet News TeluguAsianet News Telugu

స్పేర్ పార్ట్స్ పై కస్టమ్స్ తగ్గించాలి... లేదంటే గ్రే మార్కెట్‌దే హవా

స్మార్ట్ ఫోన్ల తయారీలో కీలకమైన విడి భాగాలపై విధిస్తున్న దిగుమతి సుంకాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. 20 శాతం దిగుమతి సుంకాన్ని కొనసాగిస్తూనే గరిష్ఠంగా రూ.4000లకు పరిమితం చేయాలని కోరింది. గ్రే మార్కెట్లో సెల్ ఫోన్ల విక్రయాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఐసీఈఏ తెలిపింది.
 

Limit import duty on phones above Rs 20,000 to Rs 4000: Handset makers
Author
Hyderabad, First Published Jan 30, 2020, 10:42 AM IST

న్యూఢిల్లీ: సెల్‌ఫోన్‌ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే బడ్జెట్‌లో ఉద్దీపనలు ప్రకటించాలని ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఎగుమతులకు ప్రోత్సాహకాలు కొనసాగించాలని, సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధికంగా ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలని విజ్ఞప్తి చేసింది.

దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారీ అవకాశాలున్న సెల్‌ఫోన్‌ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి వచ్చే బడ్జెట్‌లో చర్యలు ప్రకటించాలని ఇండియన్‌ సెల్యూలార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) ప్రభుత్వాన్ని కోరుతోంది. 

ఎగుమతులకు ప్రోత్సాహకాలు కొనసాగించాలని, కొన్ని విడిభాగాల దిగుమతులపై సుంకాన్ని పెంచాలని, సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధికంగా ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గించాలని విజ్ఞప్తి చేసినట్లు ఐసీఈఏ జాతీయ ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రో చెప్పారు. 

also read Budget 2020: ఆయన బడ్జెట్‌ స్పీచ్ దేశ గతినే మార్చేసింది...

ఎగుమతుల ప్రోత్సాహానికి అమలు చేస్తున్న ఎంఈఐఎస్‌ (మర్కండైజ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఫ్రం ఇండియా స్కీమ్‌) స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల మేరకు కొత్త నిబంధనావళి అమల్లోకి తెచ్చేవరకు, సెల్‌ఫోన్‌ ఎగుమతులపై 4 శాతం ప్రోత్సాహకాన్ని కొనసాగించాలని ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ కోరింది. ఇటీవల తొలగించిన రెండు శాతం ప్రోత్సాహకాన్ని, విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ధరిస్తారనే అంచనాలు ఉన్నాయి. 

సెల్ ఫోన్ల తయారీ సంస్థలపై విధిస్తున్న కార్పొరేట్‌ పన్నును 10 శాతానికి పరిమితం చేయాలని ఐసీఈఏ అభ్యర్థిస్తోంది. దిగుమతి చేసుకునే వస్తువులపై చెల్లించిన కస్టమ్స్‌ను వాపసు పొందేందుకు ఎగుమతిదారులకు అమలవుతున్న డ్యూటీ డ్రాబ్యాక్‌ కింద పరిమితి ఒక్కో ఫోన్‌కు గరిష్ఠంగా రూ.197 మాత్రమే ఉంది. పెరిగిన ధరల దృష్ట్యా ఈ మొత్తాన్ని రూ.700కు పెంచాలని సూచిస్తున్నారు.

ద్విచక్ర వాహనాలు, జనరిక్‌ ఔషధాల రంగంలో దేశీయ సంస్థలు అంతర్జాతీయంగా ఖ్యాతి గడిస్తున్నాయి. ఈ స్థాయిలో సెల్‌ఫోన్‌ తయారీ సంస్థలూ రూపుదిద్దుకునేలా సహకరించేందుకు రూ.1,000 కోట్ల నిధిని అత్యవసరంగా ఏర్పాటు చేయాలన్న అభ్యర్థన వ్యక్తమవుతున్నది. 

Limit import duty on phones above Rs 20,000 to Rs 4000: Handset makers

ఇక ప్రస్తుత సెల్‌ఫోన్లకు 12 శాతం జీఎస్‌టీ అమలవుతోంది. అయితే సెల్‌ఫోన్‌ తయారీకి వినియోగించే విడిభాగాలపై మాత్రం 18 శాతం, 28 శాతం జీఎస్టీ వేస్తున్నారు. ఇది సహేతుకం కాదని సెల్ ఫోన్ల తయారీ సంస్థలు అభిప్రాయ పడుతున్నారు. దాన్ని తగ్గించి వేయాలని కోరుతున్నాయి.

సెల్ ఫోన్లలో వినియోగించే లిథియం అయాన్‌ సెల్స్‌పై సుంకాన్ని 5-0 శాతమే విధించాలని, ఛార్జర్లపై దిగుమతి సుంకాన్ని 15 నుంచి 20 శాతానికి, కంప్రెషర్లపై 10 నుంచి 20 శాతానికి, సెట్‌టాప్‌ బాక్స్‌ ఛార్జర్లపై 15 శాతానికి పెంచాలి. జాబ్‌వర్క్‌లు సులభతరం చేసేందుకు కంపెనీల మధ్య బదిలీ నిబంధనలను సులభతరం చేయాలని కోరుతున్నారు.

ఖరీదైన స్మార్ట్‌ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం కొనసాగిస్తూనే, గరిష్ఠ పరిమితిని రూ.4000కు పరిమితం చేయాలి. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా చూడాలని భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ దారులు కోరుతున్నారు. ఒకవేళ దిగుమతి సుంకాన్ని తగ్గించేందుకు కేంద్ర విత్త మంత్రి సుముఖత వ్యక్తం చేస్తే అత్యధికంగా లబ్ది పొందేది ఆపిల్ ‘ఐఫోన్’ మాత్రమే. ఐఫోన్ల ధరలన్నీ రూ.20 వేల పైనే పలుకుతున్నాయి మరి. 

also read రతన్ టాటా పాదాలకు నమస్కరించిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు

అఫ్ కోర్స్ ఆపిల్ భారతదేశంలో ఐఫోన్లు బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న సంస్థ విస్ట్రోన్‌లో తయారు చేసేందుకు కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రస్తుతం భారతదేశంలో ఐఫోన్ ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 7 మోడల్స్ తయారవుతున్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రకారం వియత్నాం నుంచి దిగుమతులు భారీగా పెరిగాయి. వీటిపై పరిశీలన జరిపి దేశీయ పరిశ్రమను ఆదుకునే చర్యలు చేపట్టాలని స్మార్ట్ ఫోన్ల పరిశ్రమ కోరుతోంది.

హై ఎండ్ ఫోన్లపై భారీగా దిగుమతి సుంకాలు విధిండంతో ఏటా గ్రే మార్కెట్లలో రూ.8000 కోట్ల విలువైన హై ఎండ్ ఫోన్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఇది బేసిక్‌గా రూ.2560 కోట్ల నష్టానికి దారి తీస్తుంది. కేవలం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అమలు చేస్తే రూ.1600 కోట్ల ఆదాయం లభిస్తుందని ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. 

హై ఎండ్ ఫోన్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో మార్పులు తీసుకొస్తే ప్రభుత్వ ఖజానాకు రూ.1100 కోట్ల ఆదాయం లభిస్తుంది. గ్రే మార్కెట్లలో రూ.5000 కోట్ల విలువైన హై ఎండ్ ఫోన్ల విక్రయాలను నిషేధించొచ్చునని ఐసీఈఏ పేర్కొంది. గ్రేమార్కెట్‌కు పశ్చిమాసియా, హాంకాంగ్, సింగపూర్ దేశాల నుంచి ఎంపిక చేసిన విమానాశ్రయాల ద్వారా స్మార్ట్ ఫోన్ల స్మగ్లింగ్ జరుగుతోందని ఐసీఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. హై ఎండ్ ఫోన్లలో ఆపిల్ ఐఫోన్ ప్రముఖంగా నిలుస్తుంది. 95 శాతం దిగుమతులపైనే ఆపిల్ ఆధార పడి ఉంటుంది. ఇతర మార్కెట్లతో పోలిస్తే బారతదేశంలో 20 శాతం దిగుమతి సుంకం విధించడం వల్ల దాని ధర తడిసి మోపెడవుతోంది మరి. 

Follow Us:
Download App:
  • android
  • ios