న్యూఢిల్లీ: భారత్‌లో వేల కోట్ల రూపాయాల ఆర్థిక మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారు ఒక్కొక్కరిగా పోలీసులకు చిక్కుతున్నారు. ఆ మధ్య విజయ్‌ మాల్యా.. మొన్న నీరవ్‌ మోదీ.. తాజాగా మరో ఆర్థిక నేరగాడు అరెస్టయ్యాడు. రూ. 8,100 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో స్టెర్లింగ్‌ బయోటిక్‌ ప్రమోటర్ల అనుంగు సహచరుడు హితేశ్‌ పటేల్‌ను అల్బేనియాలో‌ని టిరానాలో పోలీసులు అరెస్టు చేశారు. 

గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్‌ బయోటెక్‌ గ్రూప్‌‌నకు చెందిన హితేశ్‌ పటేల్‌ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మార్చి 11వ తేదీన జారీ చేసిన ఇంటర్‌పోల్‌ నోటీసు ఆధారంగా హితేశ్‌ను టిరానాలో ఈ నెల 20వ తేదీన అరెస్టు చేసినట్టు అల్బేనియా అధికారులు ప్రకటించారు.

స్టెర్లింగ్‌ బయోటెక్‌ కేసులో ప్రధాన నిందితులైన నితిన్‌ సందేసరా, చేతన్‌ సందేసరా సోదరుల సన్నిహిత బంధువు పటేల్‌. కేసులో ఆయన కూడా సహ నిందితుడు. ఆయనను త్వరలోనే భారత్‌కు అప్పగించనున్నట్టు అధికారులు చెప్పారు. సందేసరా సోదరులు ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీలకు డమ్మీ డైరెక్టర్లను తేవడంలో పటేల్‌ కీలకంగా వ్యవహరించినట్టు ఆయనపై అభియోగం ఉంది.

హితేశ్‌ నరేందర్‌ భాయ్‌ పటేల్‌ను తాము అరెస్టు చేసినట్టు అల్బేనియా అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు తెలిపారు. త్వరలోనే హితేశ్‌ అప్పగింత లాంఛనాలు పూర్తి చేసి భారత్‌కు తీసుకువచ్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అల్బేనియా వెళ్తారని చెబుతున్నారు.
 
సందేసరా సోదరులు ఆంధ్రాబ్యాంకు సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంకు రూ.8100 కోట్ల మేరకు రుణాలు ఎగవేసినట్టు అభియోగం ఉంది. స్టెర్లింగ్‌ బయోటెక్‌ కంపెనీ పైన, దాని డైరెక్టర్లు నితిన్‌ సందేసరా, చేతన్‌ సందేసరా సోదరులు, చేతన్‌ భార్య దీప్తి, రాజ్‌ భూషణ్‌ ఓంప్రకాశ్‌ దీక్షిత్‌, విలాస్‌ జోషి, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ హేమంత్‌ హాథి, ఆంధ్రాబ్యాంకు మాజీ డైరెక్టర్‌ అనూప్‌ గార్గ్‌తో పాటు కొందరు గుర్తు తెలియని వ్యక్తులపై ఈడీ, సీబీఐ కేసులు దాఖలు చేశాయి.
 
ఆంధ్రాబ్యాంకు నాయకత్వంలోని కన్సార్షియం నుంచి వారు రూ.5 వేల కోట్ల మేరకు రుణం తీసుకుని ఎగవేశారని, అది మొండి బకాయిగా మారిందని ఆరోపణ ఉంది. మొత్తం ఎగవేత రుణం పరిమాణం రూ.8100 కోట్లకు చేరినట్టు చెబుతున్నారు.

ఆ కేసులో ఇప్పటివరకు సీబీఐ ఐదు చార్జిషీట్లు దాఖలు చేసింది. రూ.4710 కోట్ల విలువ గల ఆస్తులు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో రూ.140 కోట్ల మేరకు లంచాలు ముట్టచెప్పారన్న కేసులో కొందరు అధికారుల పాత్రపై కూడా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. హితేశ్ పటేల్, ఆయన సన్నిహితులు నితిన్, చేతన్ ఆదాయం పన్ను శాఖ సీనియర్‌ అధికారులకు కూడా లంచాలిచ్చారన్న అభియోగాన్ని కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఈ కేసులో ప్రధాన నిందితులైన నితిన్ సందేసరా‌, చేతన్‌ సందేసరాలపై కూడా నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. కాగా.. వీరిద్దరికీ అలబానియా పౌరసత్వం ఉంది. అయితే వీరి ఆచూకీపై ఇంతవరకూ స్పష్టత లేదు.