ఐఎల్ఎఫ్ఎస్‪లో బయటపడ్డ ఆర్థిక సంక్షోభం దేశీయ బ్యాంకేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లో సమస్య మరింత సంక్లిష్టంగా మారింది. దేశీయంగా అగ్రశ్రేణి 50 బ్యాంకేతర ఆర్థిక సంస్థలు కేవలం నవంబర్ నెలలోనే 95 వేల కోట్ల రుణాలు చెల్లించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. వాటిల్లో రూ.70 వేల కోట్లు వివిధ సంస్థల వద్ద తీసుకున్న వాణిజ్య పత్రాల మెచ్యూరిటీ కింద చెల్లించాల్సి ఉన్నదని నివేదికలందాయని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ‘క్రిసిల్’ పేర్కొన్నది. 

ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలన్నీ అత్యధిక వడ్డీరేట్లకు రుణాలు ఇస్తున్నాయి. లిక్విడిటీ కఠినతరం కావడంతో బ్యాంకులకు అక్టోబర్ నెలలో రూ.36 వేల కోట్లు, నవంబర్ నెలలో రూ.40 వేల కోట్ల ఓఎంఎస్‌లను కొనుగోలు చేసేందుకు బ్యాంకులకు ఆర్బీఐ విండో వసతి కల్పించింది. ఇదిలా ఉంటే నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నిధుల కొరత ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. 

ఇటీవల ఈ కంపెనీ బ్యాంకు రుణాలను అందుబాటులో తెచ్చేందుకు లిక్విడిటీని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకున్నప్పటికీ మంజూరు చేసిన నిధులను కూడా ఇవ్వలేకపోతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఇండ్లకు మంజూరు చేసిన రుణాలకు నిధుల పంపిణీ జరగకపోవడంతో హౌజింగ్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. 

నిధుల లభ్యత తగ్గడంతో హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల రుణాలపై వడ్డీ రేట్లను దాదాపు అర శాతం నుంచి ఒక శాతం మేర పెంచాయి. డెవలపర్లు తీసుకునే రుణాలపై వడ్డీ ఏకంగా మూడు శాతం పెరిగిన సందర్భాలున్నాయి. హోమ్ లోన్ అకౌంట్లను బ్యాంకులకు బదలాయించడం ద్వారా నగదును సమీకరించడానికి ఎన్‌బీఎఫ్‌సీలు యత్నాలు ముమ్మరం చేశాయి. పెద్ద ప్రాజెక్టులకు కూడా రూ. 30 నుంచి రూ. 40 కోట్ల రుణాలను పంపిణీ చేయడానికి కూడా ఎన్‌బీఎఫ్‌సీలు వెనకాడుతున్నాయి.

రిటైల్ హౌజింగ్ రుణాలను తాజాగా మంజూరు చేయడం దాదాపుగా నిలిపివేశాయి. లిక్విడిటీ సమస్య కారణంగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణాల డీఫాల్ట్ అయిన విషయ తెలిసిందే. దీంతో కమర్షియల్ పేపర్(సీపీ) మార్కెట్‌లో పెట్టుబడులను పెట్టడానికి మ్యూచువల్ ఫండ్లు, ఆర్థిక సంస్థలు వెనకంజ వేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలు నిధులను సమీకరించడానికి కమర్షియల్ పేపర్ మార్గాన్ని ఎంచుకుంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు అవసరమైన నిధుల్లో 15 శాతం సీపీ మార్కెట్ నుంచే సమీకరిస్తున్నాయి. ఇవన్నీ స్వల్ప కాలిక రుణాలే. కాగా, దాదాపు 50 వేల కోట్ల విలువైన కమర్షియల్ పేపర్లు త్వరలో రిడెంప్షన్‌కు రానున్నాయి. 

దీంతో తాజాగా డిఫాల్ట్ భయాలు మార్కెట్‌ను కమ్ముకున్నాయి. నిధుల కొరతతో కేవలం 60 శాతం బిజినెస్ మాత్రమే చేస్తున్నామని ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ అధినేత ఒకరు తెలిపారు. చిన్న చిన్న కంపెనీలకు నిధుల కొరత మరింత తీవ్ర స్థాయిలో ఉందని పేర్కొన్నారు. నిధుల సమీకరణకు రుణాలను బదలాయింపునకు పలు చిన్న ఎన్‌బీఎఫ్‌సీలు ప్రయత్నిస్తున్నాయి. వాటిలో చాలా వరకు తాజాగా రుణాలను జారీ చేయడం ఆపేశాయని తెలిపారు. బ్యాంకుల నుంచి నిధుల లభ్యత లోపించడంతో రుణాలను ఇవ్వలేకపోతున్నట్టు మరో ఎన్‌బీఎఫ్‌సీ ప్రతినిధి తెలిపారు.

ఇదిలా ఉంటే అకారణంగానే 31 ఎన్‌బీఎఫ్‌సీ రిజిష్ర్టేషన్లను రద్దు రిజర్వ్‌బ్యాంక్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తమ రిజిష్ర్టేషన్లను రద్దు చేయాలని కోరిన మరో 17 ఎన్‌బీఎఫ్‌సీల సర్టిఫికెట్లను కూడా రద్దు చేసింది. రిజిష్ర్టేషన్ రద్దయిన 31 ఎన్‌బీఎఫ్‌సీలలో 27 పశ్చిమ బెంగాల్‌కు చెందినవే. మిగతా నాలుగు ఉత్తర ప్రదేశ్‌కు చెందినవి. కాగా లైసెన్స్ రద్దు కోరుతూ దరఖాస్తులు ఉన్న వాటిలో హైదరాబాద్‌కు చెందిన రామ్‌కీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఉంది. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 12వేల ఎన్‌బీఎఫ్‌సీలను ఆర్బీఐ నియంత్రిస్తున్నది. లిక్విడిటీ సంక్షోభం కారణంగా అనేక కంపెనీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదర్కొంటున్నాయి.