Asianet News TeluguAsianet News Telugu

జెట్ ఎయిర్వేస్ రివైవల్ ఫస్ట్: హిందుజాలతో కూడిన కన్సార్టియం ‘వ్యూ’

మూత పడిన జెట్ ఎయిర్వేస్ సంస్థ పునరుద్ధరణ కోసం మార్గం సుగమం అవుతోంది. హిందుజాలు, ఎతిహాద్ సంస్థ తమ పరిమితికి లోబడే మైనారిటీ వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హిందుజాలు, ఎతిహాద్ సారథ్యంలోనే జెట్ ఎయిర్వేస్ టేకాఫ్ తీసుకుంటుందని అంచనాకు వచ్చిన బ్యాంకర్లు.. సంస్థ నిర్వహణ కోసం తమ వద్దే 20 శాతం వాటా ఉంచుకుంటామని బ్యాంకర్లు ఎతిహాద్‌, హిందుజాలకు కొత్త ఆఫర్‌ ఇచ్చాయి. సంస్థ పున: ప్రారంభమైన తర్వాత ఆ వాటా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విక్రయించేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 
 

Hindujas may invest RS. 1,500 cr in Jet
Author
New Delhi, First Published May 24, 2019, 11:22 AM IST

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో మూతపడ్డ ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ సంస్థను తిరిగి తెరిచేందుకు రంగం సిద్ధం అవుతుంది. అందుకు ఆసక్తి చూపుతున్న హిందుజా గ్రూప్ ముందు రూ.1000-రూ.1500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పని చేస్తున్న ఆది గ్రో సంస్థ రూ.2,500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది.

ఎతిహాద్ ఎయిర్వేస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లండన్ కేంద్రంగా పని చేస్తున్న ఆదిగ్రో సంస్థలతో కలిసి జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణకు హిందుజా గ్రూప్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నాలుగు కంపెనీలు కలిసి జెట్ ఎయిర్వేస్ సంస్థ కోసం ఒక కన్సార్టియం ఏర్పాటు చేయడానికి ఏకాభిప్రాయం కుదిరింది. 

దీని ప్రకారం ఎతిహాద్ తిరిగి జెట్ ఎయిర్వేస్ సంస్థలో 24 శాతం వాటా పొందగలుగుతుంది. ఎస్బీఐ 20 శాతం వాటా కలిగి ఉంటుంది. హిందూజా గ్రూప్ పెట్టే పెట్టుబడిని బట్టి 20-25 శాతం వాటా.. ఇచ్చిన హామీ మేరకు ఆది గ్రో రూ.2,500 కోట్ల పెట్టుబడి పెడితే ఆ సంస్థకూ అదే స్థాయిలో వాటా కేటాయించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. 

ప్రతిపాదిత కన్సార్టియంలోని సంస్థలన్నీ అగ్రిమెంట్ పై సంతకాలు చేశాక సంస్థ నిర్వహణ కోసం రూ.350-రూ.700 కోట్ల నిధులను విడుదల చేయనున్నది. ఈ మేరకు నాలుగు సంస్థల ప్రతినిధుల సమావేశం అబుదాబీలోని ఎతిహాద్ ప్రధాన కార్యాలయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రధాన ఎజెండా నాలుగు భాగస్వామ్య సంస్థల మధ్య అంగీకారం, సఖ్యత తేవడమే. 

ఈ ప్రతిపాదనల ప్రకారం జెట్ ఎయిర్వేస్ నిర్వహణ అంత తేలికేం కాదు. హిందుజాలు, ఆది గ్రో సంస్థలు సంబంధిత జెట్ ఎయిర్వేస్ సంస్థ రికార్డుల పరిశీలనకు సిద్ధ పడ్డాయి. అంతా అంగీకారమైతే సంస్థ లావాదేవీలు, పూర్వా పరాల గురించి పూర్తి వివరాలను అందజేస్తామని బ్యాంకర్లు అంటున్నారు. అలాగే జెట్ ఎయిర్వేస్ బోర్డులో నరేశ్ గోయల్ కొనసాగడంపై భాగస్వామ్య పక్షాలు ఇబ్బందిగా భావిస్తున్నాయి. 

జెట్ ఎయిర్వేస్ సంస్థలో హిందుజాలు పెట్టుబడి పెడతారా? లేదా? అన్న సంగతి ఇతమిద్దంగా తేలకున్నా సమావేశం సానుకూలంగా ముగిసినట్లు సమాచారం. హిందుజాలు సపోర్టివ్ గానే ఉన్నారని తెలుస్తోంది. ఎతిహాద్, ఆధి గ్రో సంస్థల నుంచి బోర్డులో చేరేందుకు సానుకూల అభిప్రాయం వ్యక్తమైందని వినికిడి. ఆర్థిక ప్రయోజనాల కోసమే అయితే పెట్టుబడి పెట్టేందుకు హిందుజాలు సిద్ధంగా లేరు. కానీ మైనారిటీ వాటాదారుగా హిందుజాలు ఉండాలని కోరుకుంటున్నారని వారి సన్నిహిత వర్గాల కథనం. 

బ్యాంకర్లు కూడా జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థను తిరిగి తెరింపిచేందుకు గాను కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆ సంస్థలో దాదాపు 20 శాతం వాటాను తమ వద్దే ఉంచుకొని మిగతా వాటాను ఔత్సాహిక పెట్టుబడిదారులకు విక్రయించాలని భావిస్తున్నట్టు సమాచారం. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థలో ఇప్పటికే వాటాదారైన ఎతిహాద్‌ సంస్థ మూతపడిన సంస్థలో ఒక పరిమితి మేరకే తమ సొంత పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా భారత్‌లోని సంపన్న కుటుంబాలు, కార్పొరేట్‌ వర్గాలతో మిగతా వాటాను కొనుగోలు చేయించాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆ సంస్థ షరతులతో కూడిన బిడ్‌ను దాఖలు చేసింది. 

మరోవైపు హిందుజాలతో కీలక వాటాను కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే హిందుజాలు కూడా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి జెట్‌ ఎయిర్‌వేస్‌లో కీలక వాటాను కొనుగోలు చేయలేమని తేల్చి చేప్పారు. దీంతో ఆర్థికంగా సుసంపన్నంగా ఉన్న ఎతిహాద్‌, హిందుజాలకు జెట్‌ ఎయిర్‌వేస్‌లో కీలక వాటా అప్పగిస్తే ఆ సంస్థకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం బ్యాంకర్లలో  ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది.

ఈ రెండు సంస్థలతో జెట్‌లో కీలక వాటాను కొనిపించాలని చూస్తున్న రుణదాతలైన బ్యాంకులు అవసరమైతే ఆ సంస్థలో దాదాపు 20% వరకు వాటాను తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జెట్‌ను తిరిగి గాడిలోకి తెచ్చాక రెండు నెలల తరువాత ఆ సంస్థలో తమకున్న వాటాను ఇతర సంస్థలకు విక్రయించాలని రుణదాత సంస్థలు భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే రుణదాత సంస్థలు హిందుజాలు, ఎతిహాద్‌ సంస్థలకు వెల్లడించినట్టుగా సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios