Hindenburg: మరో బాంబు పేలుస్తామని ట్వీట్ చేసిన హిండెన్ బర్గ్...బిక్కు బిక్కు మంటున్న బిలియనీర్లు..
హిండెన్‌బర్గ్ కంపెనీ ఓ సంచలన ప్రకటన చేసింది. హిండెన్‌బర్గ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంచలన నివేదికతో రాబోతున్నామని ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ ట్వీట్‌లో పేర్కొంది.

తన నివేదికలతో స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించడంలో ప్రసిద్ధి చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్, ఇప్పుడు మరో 'రిపోర్టు'ను తీసుకురానున్నట్లు తెలిపింది. త్వరలో భారీ నివేదిక రాబోతోందని ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ ట్వీట్‌లో పేర్కొంది. హిండెన్‌బర్గ్ రిపోర్టు కారణంగా ఇటీవల భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలను చవిచూశారు. అంతేకాదు అదానీకి చెందిన చాలా కంపెనీలు సెబీ పర్యవేక్షణలోకి వెళ్లిపోయాయి. ప్రపంచ కుబేరుల లిస్టులో 2వ స్థానంలో ఉన్న అదానీ, ప్రస్తుతం 23వ స్థానానికి పడిపోవడం వెనుక హిండెన్ బర్గ్ సృష్టించిన కలకలమే కారణం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది ఈక్విటీ, క్రెడిట్, డెరివేటివ్స్ మార్కెట్‌లపై డేటాను విశ్లేషించే ఆర్థిక పరిశోధన సంస్థ. దీనిని నాథన్ ఆండర్సన్ 2017లో స్థాపించారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ హెడ్జ్ ఫండ్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది. కార్పొరేట్ ప్రపంచం కార్యకలాపాల గురించి బహిర్గతం చేయడంలో ఇది ప్రసిద్ధి చెందింది. కంపెనీ పేరు 1937లో జరిగిన హిండెన్‌బర్గ్ ప్రమాదం నుంచి స్ఫూర్తి పొందినది కావడం విశేషం, ఈ పేరు ఉన్న ఒక జర్మన్ ప్యాసింజర్ ఎయిర్‌షిప్ మంటల్లో చిక్కుకుని 35 మందిని చనిపోయారు.
షేర్ మార్కెట్‌లో డబ్బు దుర్వినియోగం జరిగినా, ఏదైనా కంపెనీ ఖాతా నిర్వహణ తప్పులు కనిపించినా, కంపెనీ తన స్వలాభం కోసం స్టాక్ మార్కెట్‌లో తప్పుడు బెట్టింగ్‌లు వేసినా, ఇతర కంపెనీల షేర్లకు నష్టం వాటిల్లినా వెంటనే హిండెన్ బర్గ్ సంస్థ తన టీంతో రంగంలోకి దిగి అకౌంట్స్ లోని లోపాలను దొరకబుచ్చుకొని బహిర్గతం చేస్తుంది.
హిండెన్ బర్గ్ గ్రూప్ ఇలాంటి నివేదికలను విడుదల చేయడం ఇది మొదటిది కాదు. ఇంతకుముందు, ఇది అమెరికా, కెనడా, చైనాకు చెందిన సుమారు 18 కంపెనీలపై ప్రత్యేక నివేదికలను ప్రచురించింది. ఆ తర్వాత ఆయా కంపెనీలు నేలమట్టం అయిపోయాయి.
హిండెన్‌బర్గ్ కు బాగా పేరు తెచ్చిన నివేదిక అమెరికా ఆటో రంగంలోని పెద్ద కంపెనీ నికోలా గురించి కావడం విశేషం. ఈ నివేదిక తర్వాత, నికోలా షేర్లు 80 శాతం పడిపోయాయి. నికోలాపై ఈ నివేదికను తయారుచేసింది. మరెవరో కాదు నికోలా కంపెనీ మాజీ ఉద్యోగులే కావడం విశేషం. ఈ నివేదిక అనంతరం నికోలా వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయిన ట్రెవర్ మిల్టన్ వెంటనే కంపెనీకి రాజీనామా చేశారు. కంపెనీపై విచారణ కొనసాగుతోంది.