దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వచ్చే ఏడాది జనవరిలో కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసుకోనే అవకాశం ఉంది.

ప్రస్తుత పార్ట్‌టైమ్ చైర్మన్‌గా ఉన్న శ్యామల గోపీనాథ్ పదవీకాలం జనవరి 1 తో ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామల గోపీనాథ్ 2015 జనవరి 2 నుంచి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పార్ట్‌టైమ్ చైర్మన్‌గా పదవిలో ఉన్నారు.

సోమవారం జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు బ్యాంకుకు కొత్త పార్ట్‌టైమ్ చైర్‌పర్సన్‌ను నియమించాలని సిఫారసు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35బి కింద ఆమోదం కోసం ఆర్‌బిఐకి ఒక అభ్యర్థనను పంపింది.

also read డిజిటల్‌గా బ్యాంక్ ఆఫ్ బరోడా‌.. ఇక కేవలం 30 నిమిషాల్లో రుణాల ఆమోదం.. ...

ఆర్‌బీఐ అనుమతించిన వెంటనే బ్యాంక్‌ బోర్డు కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు పేర్కొంది. 

అయితే బ్యాంకు చైర్‌పర్సన్‌ పదవికి సిఫారసు చేసిన అర్హులైనవారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఆర్‌బీఐ నుంచి అనుమతి వచ్చిన వెంటనే కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సమాచారమిచ్చింది.

కొత్త అభ్యర్థికి బాధ్యతలు అప్పగించేటంత వరకూ తాత్కాలిక చైర్మన్‌గా విధులు నిర్వహించేందుకు బోర్డు నుంచి స్వతంత్ర డైరెక్టర్లలో ఒకరిని ఎంపిక చేసుకోనున్నట్లు బ్యాంకు వర్గాలు తెలియజేశాయి.