Asianet News TeluguAsianet News Telugu

గోల్డ్‌పైకి గాలి: ఆర్థిక స్థిరత్వానికే మదుపర్ల ప్రాధాన్యం

ముడి చమురు ధరలో హెచ్చు తగ్గులు, రూపాయి మారకం విలువ, అమెరికా రిజర్వు ఫెడ్ వడ్డీరేట్ల పెంపు.. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మదుపర్లను భయపెడుతున్నాయి. తమ పెట్టుబడులకు సురక్షితమైన మార్గం కోసం పసిడిని ఎంచుకుంటున్నారు.
 

Have You Considered a Gold Investment Recently?
Author
Mumbai, First Published Dec 30, 2018, 11:04 AM IST

బులియన్‌ మార్కెట్‌ మళ్లీ మదుపర్లను ఆకర్షిస్తోంది. ధరల పెరుగుదలే ఇందుకు కారణం. ప్రస్తుతం ముంబై మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారట్లు) బంగారం ధర రూ.32,650 దాటిపోయింది.

గత జూన్‌ 19 తర్వాత పసిడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న రూ.29,390తో పోలిస్తే ఇది రూ.3,260 ఎక్కువ. గతేడాదిలో దేశీయ మార్కెట్లో పసిడి ధర 10% వరకు పెరిగింది. 

ఏడాదిలో ఐదారు డాలర్లు మాత్రమే ధర పెరుగుదల
డాలర్‌ పరంగా చూస్తే పసిడి ధరలో అంత పెరుగుదల లేదు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన అంతర్జాతీయ మార్కెట్‌లో 1,275 డాలర్లు పలికిన ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ప్రస్తుతం స్వల్పంగా పెరిగి 1,281 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. అంటే ఏడాదిలో ఔన్స్‌ ధర ఐదారు డాలర్లు మాత్రమే పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం రేటు క్షీణించడం వల్లే దేశీయ మార్కెట్లో పసిడి ధర పది శాతం వరకు పెరిగింది.
 
అమెరికాలో షట్ డౌన్.. నూతన వసంతంలోకి ఇలా అడుగులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా కాంగ్రెస్‌ మధ్య నెలకొన్న విభేదాలతో అక్కడ ప్రభుత్వ నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్రిస్మస్‌ జీతాలూ నిలిచిపోయాయి. ఈ సంక్షోభం ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియడం లేదు.

ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో నెలకొన్న ర్యాలీకి ఇది కూడా ఒక కారణం. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం కావడంతో స్టాక్‌ మార్కెట్‌ తరచూ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. దీంతో ఆర్థిక సంక్షోభం తలెత్తినా తమ పెట్టుబడుల విలువ తరిగి పోకుండా చాలా మంది మదుపర్లు పెట్టుబడుల రక్షణ కోసం బంగారం కొనుగోలుపై కేంద్రీకరించారు.  

అభివృద్ధి రేటుపై భయాలు
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేవు. ఈ సంవత్సరం, వచ్చే ఏడాది వృద్ధి రేటు 3.7 శాతం మించకపోవచ్చని ఐఎంఎఫ్‌ ఇటీవలే  ప్రకటించింది. గతంఅంచనాల కంటే ఇది 0.2 శాతం తక్కువ. అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్‌శాచ్‌ 2018లో 3.8 శాతం వరకు ఉన్న అంతర్జాతీయ వృద్ధి రేటును 2019లో 3.5 శాతానికి కుదించింది. 
 
తొలగని వాణిజ్య యుద్ధ భయాలు
అమెరికా - చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య సుంకాల యుద్ధం బులియన్‌ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ యుద్ధానికి తెరపడకపోతే అంతర్జాతీయ వృద్ధి రేటు అర శాతం వరకు దెబ్బతినే ప్రమాదం ఉందని ఇప్పటికే  ప్రపంచ బ్యాంక్‌ హెచ్చరించింది.

ప్రస్తుతం కొద్దిగా సద్దుమణిగినా ఇప్పట్లో ఈ వివాదానికి తెరపడే సూచనలు కనిపించడం లేదు. దీంతో చైనా అమెరికా రుణ పత్రాల నుంచి తన పెట్టుబడులను వెనక్కి తీసుకుని బంగారం కొంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న అప్‌ట్రెండ్‌కు ఇది కూడా ఒక కారణమని భావిస్తున్నారు.
 
2019లో మరింత పెరుగనున్న పసిడి ధర 
2019లో పసిడి ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఔన్స్‌ పసిడి ధర 1,400 నుంచి 1,450 డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఒకవేళ ఆర్థిక పరిస్థితులు మరీ అంతగా దిగజారకున్నా ఔన్స్‌ బంగారం ధర 1,150 డాలర్లకు తగ్గక పోవచ్చని అంచనా.2018లో దేశీయంగా బంగారం డిమాండ్‌ 700 టన్నులు ఉండవచ్చని ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేసింది. గత ఏడాదిలో బంగారం డిమాండ్‌ 771 టన్నులుగా ఉంది. దేశంలో వార్షికంగా బంగారం డిమాండ్‌ 700-800 టన్నులుగా ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios