జీఎస్టీ అమలును ప్రారంభించినప్పుడు ఇష్టారాజ్యంగా శ్లాబ్‌లను నిర్ణయించిన జీఎస్టీ మండలి.. సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నా కొద్దీ వాటిని ఎత్తేస్తున్నది. తాజాగా నిర్మాణంలో ఉన్న ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీని భారీగా తగ్గిస్తూ ఆదివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీని ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం నుంచి ఐదు శాతానికి దించుతూ నిర్ణయించింది. ఇక చౌక ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీని ఎనిమిది నుంచి ఒక్క శాతానికి తగ్గించిన కౌన్సిల్.. లాటరీలపై విధిస్తున్న శ్లాబ్ తగ్గింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశీయ నిర్మాణ రంగం డిమాండ్లు, మధ్య తరగతి వర్గ ప్రజల ఆశలను పరిగణనలోకి తీసుకున్న మండలి.. జీఎస్టీ ఉపశమనం కలిగించింది.

తగ్గించిన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అండర్-కన్‌స్ట్రక్షన్ హౌజింగ్ ప్రాపర్టీలకు 5 శాతం జీఎస్టీనే వర్తిస్తుందని కౌన్సిల్ పేర్కొన్నది. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ లేదా రెడీ-టు-మూవ్ ఫ్లాట్ల కోసం చేసే చెల్లింపులపై ప్రస్తుతం 12% జీఎస్టీ పడుతున్నది. అమ్మిన సమయంలో నిర్మాణం పూర్తయిన ధ్రువపత్రం లేనివి కొన్నప్పుడు ఈ ధ్రువపత్రం ఉంటే అంటే పూర్తయిన ఇండ్లపై జీఎస్టీ వర్తించట్లేదు. ఇక ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ఉండదని, కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం బిల్డర్లు ఐటీసీని క్లయిమ్ చేసుకోలేరని జీఎస్టీ మండలి తెలియజేసింది.  

చౌక ధరల ఇండ్ల అమ్మకాలకూ వీలుగా జీఎస్టీ రేటును ఒక్క శాతానికి తగ్గించామని జైట్లీ తెలిపారు. దీంతో ప్రస్తుతం ఎనిమిది శాతంగా ఉన్న పన్ను.. ఏకంగా ఏడు శాతం తగ్గినైట్లెంది. అలాగే నిర్మాణ రంగంలో చౌక ధరల నిర్వచనాన్నీ మార్చివేశారు. మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్లు, నాన్-మెట్రో నగరాల్లో 90 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి, రూ.45 లక్షలలోపు ధరలు ఉన్న ఇండ్లను చౌక ధరలవిగా ప్రకటించారు.

దీంతో రుణ లభ్యత పెరిగి, తమకు నచ్చిన, అనువైన ఇండ్లను మధ్యతరగతి ప్రజలు పొందవచ్చని జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. ఖరీదైన ఇండ్లపై ఐటీసీ లేకుండా జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించామని బీహార్ డిప్యూటీ సీెం సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేశారు. 

నిర్మాణంలో ఉన్న ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీ శ్లాబ్ తగ్గింపు.. ప్రత్యేకించి చౌక ఇళ్లపై జీఎస్టీని ఒక శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమని స్థిరాస్తి పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. అందుబాటు గృహాలు, ఫ్లాట్లకు జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. కొనుగోలుదార్ల సెంటిమెంట్ మెరుగై గృహాల అమ్మకాలకు ఊతం లభిస్తుందని పేర్కొంది. దీనిపై స్థిరాస్థి రంగ ప్రముఖులు స్పందించారు. 

క్రెడాయ్‌ అధ్యక్షుడు జక్సయ్‌ షా స్పందిస్తూ ‘అందుబాటు గృహాలపై జీఎస్‌టీ రేటును 1 శాతానికి తగ్గించడం దేశీయ స్థిరాస్తి రంగంలో ఓ విప్లవాత్మక మార్పు. గృహ కొనుగోళ్లదార్లకు అతి పెద్ద ఊరట కలిగించే నిర్ణయం ఇది. కొనుగోలుదార్ల సెంటిమెంట్ బలపడేందుకూ దోహదం చేస్తుంది’ అని పేర్కొన్నారు. 

నారెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్‌ హీరానందని ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘జీఎస్టీ మండలి నిర్ణయంపై స్థిరాస్తి పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది స్వాగతించదగిన పరిణామం. గిరాకీ పరిస్థితులు మెరుగయ్యేందుకు ఇది దోహద పడుతుంది’అని తెలిపారు.

అనరాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి స్పందిస్తూ ‘ఇబ్బందులతో సతమతం అవుతున్న స్థిరాస్తి రంగానికి జీఎస్టీ రేట్ల తగ్గింపు ఉపశమనం చేకూర్చే అంశం. 2019లో ఈ రంగం ఎంతోకొంత పురోగతి బాట పట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందుబాటు గృహాల ధర శ్రేణి పరిమితిని సవరించడం కూడా స్థిరాస్తి పరిశ్రమకు ఉత్తేజమిచ్చేదే’ అని చెప్పారు. 

సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘గిరాకీ పరిస్థితులను మెరుగుపర్చే దిశగా జీఎస్టీ మండలి తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇది. కొన్ని త్రైమాసికాలుగా గృహాల అమ్మకాలు స్తబ్దుగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిణామంతో గిరాకీ పుంజుకునే అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. 

నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజాల్‌ ఈ సందర్భంగా ప్రతిస్పందిస్తూ స్థిరాస్తి రంగానికి ఎంతో ఊరటనిచ్చే నిర్ణయం ఇది. దేశ ఆర్థిక వ్యవస్థ కీలకమైన ఈ రంగ వృద్ధికి ఇది  దోహదం చేస్తుంది. గృహ అమ్మకాల గిరాకీ మెరుగవ్వడమే కాకుండా ఉద్యోగ సృష్టికి కూడా తోడ్పడుతుంది. పన్ను విధానమూ మరింత సరళీకృతం అవుతుంది’ అని తెలిపారు.