న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్​ ఇండియా, భారత్ పెట్రోలియం వాటాల విక్రయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయం చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎయిర్​ ఇండియా సహా.. ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్‌ పెట్రోలియం విక్రయాలు పూర్తికావచ్చని ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

also read ఇండియా యాజ్ దట్ గట్స్.. దశాబ్ధిలో వృద్ధి శరవేగం: బిల్ గేట్స్

ఎయిర్​ ఇండియాకు రూ.58 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంస్థలో 76 శాతం వాటాను విక్రయించాలని గత ఏడాది మార్చిలోనే భావించింది కేంద్రం. అప్పుల్లో కూరుకున్న ఎయిర్​ఇండియాను కొనుగోలు చేసేందుకు ఏ సంస్థ కుడా ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం విఫలమైంది.

గతంలో వాటా విక్రయం ప్రణాళిక విఫలమైన నేపథ్యంలో.. ఎయిర్‌ ఇండియాను 100 శాతం ప్రైవేటీకరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ గత ఆగస్టులో ప్రకటించారు. ఎయిర్‌ ఇండియాను సొంతం చేసుకొనేందుకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

also read ఆర్ కామ్ దివాళా .... అనిల్ అంబానీ రాజీనామా

గత ఆర్థిక సంవత్సరంలోని నిర్వహణ ఖర్చులో రూ.4,600 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. ఇంధన ధరలు పెరగడం, విదేశీ సర్వీసుల్లో నష్టాలు ఇందుకు కారణమని వెల్లడించింది. 2019-20 ఏడాదిలో సంస్థ నిర్వహణపరమైన నష్టాల నుంచి బయటపడే అవకాశముందని సీనియర్‌ అధికారులు గతంలో వెల్లడించారు.

భారత్‌ పెట్రోలియంలోనూ ప్రభుత్వం తనకు ఉన్న 53.29 శాతం వాటాను విక్రయించేందుకు సంస్థ సెక్రటరీల బృందం అక్టోబర్ నెలలోనే అంగీకరించింది. ఈ సంస్థ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.1.02 లక్షల కోట్లు. ఇందులో ప్రభుత్వ వాటా విలువ.. సుమారు రూ.65 వేల కోట్లుగా ఉండవచ్చు.