Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం వెనుకడుగు: మొండిబాకీలు+నిధులపై కమిటీలు.. ఇలా రాజీ


ఎట్టకేలకు ఆర్బీఐ, కేంద్రం మధ్య ఉద్రిక్తతలకు తాత్కాలికంగానైనా తెర పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిబంధనల సడలింపుతో సమస్యలు తలెత్తుతాయన్న ఆర్బీఐ సూచనతో కేంద్రం ప్రతినిధులు వెనకడుగు వేశారన్న సంకేతాలందుతున్నాయి. ఎన్బీఎఫ్సీలకు రుణాలు, ఆర్బీఐ నిధులపై కమిటీల నియామకానికే ఆర్బీఐ పాలక మండలి సమావేశం పరిమితమైంది. 

Govt-RBI call truce after a marathon board meeting
Author
Mumbai, First Published Nov 20, 2018, 10:52 AM IST

ముంబై: కొన్ని రోజులుగా సెక్షన్-7 ప్రయోగించనున్నదన్న వార్తల నేపథ్యంలో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ఉద్రిక్తత.. ఏం జరుగుతుందోనని సామాన్యుడు మొదలు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వరకు.. రిటైల్ వ్యాపారి వేత్త నుంచి ప్రముఖ రాజకీయ నేతల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నిధులపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యాఖ్యతో కేంద్రం వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. 

సోమవారం ఉదయం 10 గంటలకు మొదలైన ఆర్బీఐ పాలక మండలి భేటీ సుదీర్ఘంగా తొమ్మిది గంటల పాటు సాగింది. ఆర్‌బీఐ మిగులు నిధులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ద్రవ్య లభ్యత పెంపు, ఎంఎస్‌ఎంఈలకు రుణ నిబంధనల్లో సడలింపు, బలహీన బ్యాంకులపై విధించిన ఆంక్షల మినహాయింపులు, పలు అంశాలపై ఆర్బీఐ, కేంద్రమధ్య విబేధాలు తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అత్యంత కీలకంగా మారిన బోర్డు సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌, డిప్యూటీ గవర్నర్లు ప్రభుత్వ నామినీ డైరెక్టర్లతో కలిసి ముఖాముఖీ పలు అంశాలపై చర్చించారు. అందులో కొన్నింటిపై ఇరు వర్గాలు పరస్పర అవగాహనకు వచ్చినట్లు, అందరూ ఊహించినట్లు సమావేశం వాడివేడిగా కాక సాఫీగానే సాగినట్లు సమాచారం. 

అయితే, ఎన్‌బీఎఫ్‌సీలకు ద్రవ్య లభ్యత పెంపు అంశం మాత్రం కొలిక్కి రాలేదు. ఈ విషయంలో ఆర్‌బీఐ మెట్టు దిగేందుకు సిద్ధంగా లేదని సమాచారం. నిబంధనలను పూర్తిగా సడలిస్తే మార్కెట్లకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఉర్జిత్‌ పటేల్‌ అన్నట్లు సమాచారం. అపరిష్కృతంగా ఉన్న అంశాలపై వచ్చేనెల 14వ తేదీన జరిగే బోర్డు భేటీలో చర్చిస్తారు. 

ఏతావాతా కేంద్రం, ఆర్బీఐ మధ్య దాదాపు కీలక అంశాలన్నింటిపై మధ్య సయోధ్య కుదిరింది. సుహృద్భావ పూర్వక వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. చాలా అంశాలు స్నేహపూర్వక రీతిలో పరిష్కారం అయ్యాయి’’ అని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. తదుపరి ఆర్‌బీఐ బోర్డు సమావేశం డిసెంబర్‌ 14న జరుగుతుందని బోర్డు సభ్యుడు సచిన్‌ చతుర్వేది తెలియజేశారు. 

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) ఇచ్చిన రుణాల్లో, మొండి బకాయిలుగా మారిన వాటిని పునరుద్ధరించాలని కేంద్రం కోరుతోంది. దీనికి ఓ పథకాన్ని పరిశీలించే బాధ్యతను నిపుణుల కమిటీకి ఆర్‌బీఐ బోర్డు అప్పగించింది. ఇక ఆర్బీఐ వద్ద భారీగా ఉన్న రూ.9.69 లక్షల కోట్ల నగదు నిల్వల నుంచి కొంత భాగాన్ని బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తోంది.  
దీనిపై అసలు ఆర్‌బీఐ వద్ద వాస్తవంగా ఎంత మేర మిగులు నిల్వలు ఉండాలి? మిగులు నిల్వలను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించడానికి సంబంధించిన ‘ఎకనమిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌’ ఎలా ఉండాలి? అనేది నిర్ణయించేందుకు ఓ ఉన్నత స్థాయి నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ బోర్డు నిర్ణయించింది.

ప్రభుత్వరంగంలోని 21 బ్యాంకులకు 11 బ్యాంకులను ఆర్బీఐ ఖచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలోకి తీసుకొచ్చి, వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇవి కొత్త రుణాలివ్వడానికి అవకాశం లేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటిని సరళించాలని కేంద్రం డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐకి చెందిన ఆర్థిక పర్యవేక్షక బోర్డు పీసీఏ పరిధిలోకి వచ్చిన బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలన్న నిర్ణయానికి ఆర్‌బీఐ బోర్డు వచ్చింది.   

‘ఎకనమిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌ను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో సభ్యులు, నిబంధనలను ప్రభుత్వం, ఆర్బీఐ ఉమ్మడిగా నిర్ణయిస్తాయి. ఇక రూ.25 కోట్ల వరకు ఎంఎస్‌ఎంఈల మొండి బకాయిలను పునరుద్ధరించే పథకాన్ని పరిశీలించాలని కూడా నిర్ణయించాం’ అని ఆర్బీఐ తన ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక స్థిరత్వం కోసం ఈ తరహా చర్యలు అవసరమని పేర్కొంది.

ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు ఆర్థిక వ్యహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌తోపాటు స్వతంత్ర డైరెక్టర్‌ ఎస్‌ గురుమూర్తి ఆర్‌బీఐ క్యాపిటల్‌ బేస్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తక్కువ ఉండాలని వాదించారు. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్, ఆర్‌బీఐ నుంచి ఇతర సభ్యులతో ప్రభుత్వ నామినీలు, గురుమూర్తి ముఖాముఖి చర్చించారు. ఆర్‌బీఐ బోర్డులో 10 మంది ఇండిపెండెంట్‌ డైరెక్టర్లలో టాటాసన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ సహా ఎక్కువ మంది పాల్గొన్నారు.  

ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య ఎటువంటి ఘర్షణ లేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌గాంధీ, మీడియానే దీన్ని చిత్రీకరిస్తున్నాయన్నారు. ఎంతో ముఖ్య సంస్థ సెంట్రల్‌ బ్యాంక్‌కు దేశం పట్ల ఉన్న బాధ్యతలపై ఆర్‌బీఐ బోర్డు సభ్యుల మధ్య చర్చ జరగడం అభ్యంతరకరమేమీ కాదన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి ప్రభుత్వం రూపాయి కూడా ఆశించడం లేదన్నారు.

ఆర్బీఐ స్వతంత్రతను అసమ్మతంగానైనా  కేంద్రం ఒప్పుకుందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఓ అడుగు వెనక్కు తగ్గడాన్ని ఆహ్వానించారు. ‘కేంద్రం ప్రమాదకరమైన ధోరణితో ఉందన్న విషయాన్ని స్వతంత్ర డైరెక్టర్లు అర్థం చేసుకుని ఉంటారు. అందుకే ఆర్బీఐకి సూచన ఇవ్వడానికి మించి ముందుకు వెళ్లలేదు’’అని పేర్కొన్నారు. సాంకేతిక కమిటీ మిగులు నిల్వల పరిశీలన వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్నారు. దీనివల్ల ఆర్బీఐ మిగులు నిల్వలు కనీసం 2019 వరకైనా సురక్షితంగా ఉంటాయంటూ, పరోక్షంగా మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలను గుర్తు చేశారు.  

వ్యవస్థలో నగదు లభ్యతను పెంచే చర్యలో భాగంగా ఈ నెల 22న ఆర్‌బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. తద్వారా రూ.8,000 కోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. నగదు లభ్యత పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ (ఓఎంవో) ద్వారా ఈ నెల 22న రూ.8,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు నిర్ణయించినట్టు ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్య నెలకొన్న విషయం తెలిసిందే. దీన్ని సులభతరం చేసేందుకు ఆర్బీఐ ఓఎంవో మార్గాన్ని ఆశ్రయించింది. ఒకవేళ వ్యవస్థలో నగదు లభ్యత అధికమైన సమయాల్లో ఆర్‌బీఐ తిరిగి ఇవే సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా తగ్గిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios