ముంబై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న అదనపు మూలధనం తీసుకుని సంక్షేమ పథకాలకు కేటాయించాలన్నది మోదీ సర్కార్ వ్యూహం. ఆలోచన బాగానే ఉన్నా.. ఆచరణలోనే ఇబ్బందులు ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థకు దేశ సార్వభౌమత్వ భద్రత అనేదే అత్యంత ముఖ్యమని కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వానికే విలువ అధికమని, కేంద్ర బ్యాంక్‌ దగ్గర ఉన్న భారీ నిల్వల కంటే ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని తెలిపారు.  కేంద్ర బ్యాంకులకు ఆదాయం సృష్టించే సామర్థ్యం ఉండటమే ఇందుకు కారణం’ అని పేర్కొన్నారు. 

ఆర్బీఐ మూలధనంలో మార్పులు చేయడం వల్ల, అనేక నష్టభయాలు ఏర్పడతాయి. మార్కెట్‌ రిస్క్‌తో పాటు విదేశీ మారకపు నిల్వల విలువలో వచ్చే మార్పుల వల్ల కలిగే రిస్క్‌లు, పసిడి, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర కేంద్రబ్యాంకులమైనా ఎగవేస్తే ఏర్పడే నష్టాలు, కార్యనిర్వాహక రిస్క్‌, అత్యవసర రిస్క్‌ల వంటివీ ఉంటాయని సుబ్రమణియన్‌ వివరించారు. ఇదే విషయాన్ని 2017 ఆర్థిక సర్వేలో కూడా సుబ్రమణియన్‌ తొలుత ప్రతిపాదించడం గమనార్హం.

అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కలిగి ఉన్న అదనపు మూలధనం నుంచి రూ.4.5-7.0 లక్షల కోట్ల వరకు ప్రభుత్వం కోరే అవకాశం ఉందని ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. మిగిలిన కేంద్ర బ్యాంకులతో పోలిస్తే, మిగులు నిధుల్లో ఆర్‌బీఐ ఎంతో ముందుండటమే ఇందుకు కారణమన్నారు. 

తన బ్యాలెన్స్‌షీట్‌లో 28 శాతం మొత్తాన్ని నిల్వలుగా ఆర్‌బీఐ కలిగి ఉందని, ప్రపంచ సగటు 8.4 శాతం మాత్రమేనని సుబ్రమణియన్‌ వివరించారు. 2014 అక్టోబర్ నుంచి 2018 జూన్‌ వరకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించిన సుబ్రమణియన్‌ ‘ఆఫ్‌ కౌన్సెల్‌: ది ఛాలెంజెస్‌ ఆఫ్‌ ది మోదీ-జైట్లీ ఎకానమీ’ పుస్తకంలో ఈ వివరాలు పొందుపరచారు. ఆర్‌బీఐ వద్ద ఉన్న అదనపు నిధులు రూ.9.5 లక్షల కోట్లని తెలిపారు. 

‘పెద్ద కేంద్ర బ్యాంకులతో పోలిస్తే, ఆర్‌బీఐ వద్ద మరిన్ని అదనపు నిల్వలున్నాయి. 28 శాతం నిల్వ మూలధనాన్ని ఇది కలిగి ఉంది. ఇతర ప్రధాన బ్యాంకులతో పోల్చినపుడు, అయిదో అతిపెద్ద మొత్తంగా చెప్పొచ్చు. ప్రపంచ సగటు చూస్తే ఈ నిధుల సగటు 8.4 శాతమే. ఆర్‌బీఐ వద్ద అదనపు మూలధనం రూ.7 లక్షల కోట్ల వరకు ఉంది’ అని వివరించారు. పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకాన్ని డిసెంబరు 7న ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య మిగుల నిధుల విషయమై వివాదం నెలకొన్న నేపథ్యంలో, విడుదల కానున్న ఈ పుస్తకంపై ఆసక్తి ఏర్పడింది.

అయితే 1991లో తెలుగు నేత పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేనాటికి చెల్లింపుల కోసం ఆర్బీఐ బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చింది. తర్వాత అమలు చేసిన ఆర్థిక సంస్కరణల పుణ్యమా! అని దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా సరిగ్దా దశాబ్ది క్రితం సబ్ ప్రైమ్ సమస్య వల్ల అమెరికాతోపాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని దేశాలపైనా బాగానే ఉంది. మనదేశంపై తాత్కాలిక ప్రభావం చూపింది. కానీ తర్వాతీ కాలంలో ఆర్బీఐ అండగా ఉండటంతో మన ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోగలిగామని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు.

అవినీతి అంతానికే నోట్ల రద్దు అని నీతి ఆయోగ్ 
అవినీతిని అంతానికే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందన్న మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యలపై రాజీవ్ కుమార్ కౌంటర్‌గా పై వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ హెల్త్ సమ్మిట్‌లో రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ ఉన్నతమైన వారికోసమే నోట్లరద్దు చేశారని అర్వింద్ చెప్పారు. ఆయన ఉన్నతమైన పదాన్ని ఎవరి గురించి వాడారో అర్థం కావడం లేదు అని పేర్కొన్నారు.