Gold vs SIP: మహిళలు ఆర్థిక స్వాతంత్య్ర సాధించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు. వారు బంగారం కొనడం లేదా SIP చేయడం… ఈ రెండింటిలో ఏది వారికి ఎక్కువ కలిసి వస్తుందో తెలుసుకోండి. బంగారం సురక్షితమైన, దీర్ఘకాలిక పొదుపు అయితే, SIP క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి.
Gold vs SIP: పొదుపు చేయడం ప్రతి ఒక్కరికి అవసరం. ముఖ్యంగా మహిళలు కూడా ప్రత్యేకంగా తమకంటూ పొదుపు చేసుకోవడం ఉత్తమమైనది. అయితే మహిళలు అధికంగా బంగారం కొనేందుకు ఇష్టపడతారు. తాము దాచుకున్న డబ్బుతో లేదా వచ్చిన జీతంతో బంగారం కొనడం ఉత్తమమా? లేక సిప్ చేయడం మంచిదా? అనే విషయాలు తెలుసుకోండి.
మహిళలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్నారు. దీనికి బంగారం, SIP అనే రెండు ముఖ్యమైన పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. ఈ రెండూ కూడా మంచివే. కానీ ఏ పద్దతి మంచిదో మాత్రం ఎంతో మందికి తెలియదు. దీనిపై అవగాహన చాలా తక్కువ మందికే తెలిసింది.
బంగారంలో పెట్టుబడి పెడితే

ఎన్నో ఏళ్లుగా మహిళల నమ్మకమైన పెట్టుబడి బంగారమే. పది వేల రూపాయలు ఉన్నా చాలు గ్రాము బంగారం కొనేస్తారు. బంగారాన్ని ఒక వస్తువు రూపంలో చూడరు… అది ఒక భావోద్వేగం వారికి. అలాగే ఆర్ధిక భద్రతను కూడా అందిస్తుంది. బంగారాన్ని అత్యవసర అవసరాలకు వాడుకోవచ్చు కూడా. బంగారం ధర కూడా దీర్ఘకాలంలో అలా పెరుగుతూనే ఉంటుంది. అందుకే బంగారంపై పెట్టుబడిని సురక్షితమైన పొదుపుగా చూస్తారు. కానీ బంగారంపై పెట్టుబడి పెట్టినా దాని వృద్ధి వేగం నెమ్మదిగా ఉంటుంది.
SIP

SIP అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. ఇందులో భాగంగా ప్రతి నెలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెడతారు. అలా దానిపై వడ్డీ పడి కాలక్రమేణా పెద్ద సంపదను సృష్టిస్తుంది. అయితే ఇది స్టాక్ మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది. కొంచెం రిస్క్ తో కూడుకున్నదే. మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని దీర్ఘకాలంగా వేచి ఉంటే మంచి రాబడిని ఇస్తుంది. దీనికి ప్రతినెలా సిప్ కట్టడం, ఎక్కువ ఏళ్ల పాటూ ఇలా పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. కనీసం పదేళ్లు సిప్ చేస్తేనే మీరు పెట్టిన డబ్బు రెట్టింపు అయి మీ చేతికి వస్తుంది. SIPతో సంపదను సృష్టించే శక్తి ఎక్కువ.
రిస్క్ లేదా భద్రత
బంగారం చాలావరకు సురక్షితమైన పెట్టుబడి. దాని విలువ ఎప్పుడూ పడిపోదు. కానీ SIP మాత్రం మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది. అయినా, దీర్ఘకాలం కొనసాగితే, SIP బంగారం కంటే రెండు రెట్లు ఎక్కువ వృద్ధిని ఇస్తుంది. స్వల్పకాలిక భద్రతకు బంగారం, దీర్ఘకాలిక వృద్ధికి SIP ఉత్తమం.
రాబడిలో తేడా
బంగారంపై సగటు రాబడి 8–10 శాతం వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఇంకా పెరగవచ్చు. SIPలోని ఈక్విటీ ఫండ్‌లు 12-15 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధిని అందిస్తాయి.
అత్యవసరానికి డబ్బు
నగల రూపంలో ఉన్న బంగారాన్ని అమ్మడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ETFలను వెంటనే అమ్మవచ్చు. SIPలో ఉన్న డబ్బును ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ 5-7 ఏళ్లు ఉంచితే ఎక్కువ లాభం వస్తుంది. నిజానికి రెండు రకాల పెట్టుబడులూ ఉపయోగపడతాయి.
పన్ను నియమాలు
3 ఏళ్లకు పైగా బంగారం ETF ఉంచుకుంటే 20 శాతం పన్ను ఉంటుంది. SIPలో ఒక ఏడాదిలోపు అమ్మితే 15 శాతం పన్ను… ఒక ఏడాది తర్వాత లాభంపై 10 శాతం పన్ను ఉంటుంది. డెట్ ఫండ్‌లపై కొంచెం ఎక్కువ పన్ను విధిస్తారు. కాబట్టి సరైన పెట్టుబడిని, ఆర్థిక సలహాదారుని సంప్రదించి ఎంచుకోవడం ముఖ్యం.
