న్యూఢిల్లీ: డిజిటల్ రిటైల్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వచ్చే పండుగల సీజన్‌ను సొమ్ము చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతేడాదితో పోలిస్తే 30 శాతానికి పైగా మొబైల్ ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఫ్లిప్‌కార్ట్.. సదరు మొబైల్ ఫోన్ సంస్థలు మార్కెట్‌లోకి నూతనంగా విడుదల చేస్తున్న మొబైల్ ఫోన్లపై ఆఫర్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. క్యాష్ బ్యాక్ తరహా ఫైనాన్సింగ్ ఆప్షన్లతో భారతీయ వినియోగదారులకు ఆకట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతర్జాతీయ రిటైల్ దిగ్గజం ‘వాల్‌మార్ట్’తో జత కట్టిన ఫ్లిప్‌కార్ట్ సంస్థకు అమెరికా కేంద్రంగా ఆన్ లైన్ రిటైల్ సేవలందిస్తున్న ‘అమెజాన్’ నుంచి ఈ దఫా గట్టి పోటీ ఎదురవుతోంది. భారతదేశంలో 25 శాతం ఫోన్లను విక్రయించాలని ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్నది అమెజాన్. 

ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ల విభాగం సీనియర్ డైరెక్టర్ అయ్యప్పన్ రాజగోపాల్ మాట్లాడుతూ ‘పండుగల సీజన్‌లో మా సంస్థ విక్రయాలు మరింత పెరుగుతాయని మేం విశ్వాసంతో ఉన్నాం. మార్కెట్ లో 30 - 32 శాతం వాటా పొందుతాం’ అని చెప్పారు. 2020 నాటికి ‘మొబైల్స్ 40బై 20’ వ్యూహంలో భాగంగా 40 శాతం మార్కెట్ ను సొంతం చేసుకోవాలని ఏప్రిల్‌లో ఫ్లిప్‌కార్ట్ లక్ష్యంగా పెట్టుకున్నది. పండుగల సీజన్‌లో మా మొబైల్ ఫోన్ల సంస్థల భాగస్వాములతో కలిసి నూతన మొబైల్ ఫోన్లను మార్కెట్‌లోకి ఆవిష్కరించేందుకు మా ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉన్నది. అన్ని ప్రైస్ పాయింట్ల వద్ద మొబైల్ ఫోన్లు లభిస్తాయి. ప్రత్యేకించి రూ.10,000 - 15,000 క్యాటగిరీతోపాటు ప్రారంభ స్థాయి (రూ.4000 - రూ.7000) స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు చాలా ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నాం’ అని తెలిపారు. 

ఇన్ఫోమాక్స్, రియల్ మీ, పనాసోనిక్, అసూస్ తదితర మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలతో కలిసి ఫ్లిప్ కార్ట్ పని చేస్తోంది. పరిశ్రమ అంచనా నివేదికల ప్రకారం భారతదేశంలో ఆన్ లైన్ వేదికలపై ఫ్లిప్‌కార్ట్ 39 శాతం ఫోన్లను విక్రయిస్తున్నదని అయ్యప్పన్ రాజగోపాల్ తెలిపారు. చైనాలో 29 శాతం ఫోన్లను ఆన్ లైన్ లో తాము విక్రయిస్తున్నామని చెప్పారు. మొబైల్ ఫోన్ వినియోగదారులు అత్యధికంగా ఆన్ లైన్ వేదికగా ఫ్లిప్‌కార్ట్ ను వాడుకునేందుకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసేవారికి ఈఎంఐ ఆప్షన్లు ప్రారంభించిందన్నారు. 

పండుగల సీజన్ సందర్భంగా మొబైల్ ఫోన్ల కొనుగోళ్లకు ఆపర్లను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కానీ విక్రయాలు మాత్రం వచ్చేనెలలోనే ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు రెండు కూడా భారతదేశంలో ‘ఈ- కామర్స్’ ద్వారా విక్రయిస్తున్న అతిపెద్ద సంస్థలుగా నిలిచాయి. ఆన్ లైన్ కొనుగోళ్లలో అత్యంత ప్రజాదరణ గల వస్తువులుగా మొబైల్ ఫోన్లు నిలిచాయి. కొన్నేళ్లుగా హెచ్ఎండీ, జియామీ, మోటరోలా, కూల్ పాడ్ తదితర మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ తదితర సంస్థలతో కలిసి భారతీయ మార్కెట్‌లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాయి.