న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి ప్రభావంతో 2020-21లో భారత్‌ 5.1 శాతం వృద్ధిని మాత్రమే సాధించే అవకాశం ఉందని ఫిచ్ అంచనా వేసింది. కరోనాతో సప్లయ్‌ చెయిన్‌లో తీవ్ర విఘాతాలు ఏర్పడ్డాయని, వీటి ప్రభావం పెట్టుబడులు, ఎగుమతులపైనా తీవ్రంగా ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కూడా తగ్గుతోందని, ఇప్పుడు ప్రపంచం మాంద్యంలో ఉందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 5.6% వృద్ధిని సాధించడానికి అవకాశం ఉందని గత డిసెంబరులో ఫిచ్‌ పేర్కొంది. 

అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో వృద్ధి అంచనాను 5.1 శాతానికి తగ్గించింది. ఇక 2019-20లో జీడీపీ వృద్ధి ఐదు శాతానికి పరిమితం కావచ్చునని ఫిచ్‌ చెబుతోంది. 

also read కరోనా వ్యాప్తితో ఉద్యోగుల జీతాల చెల్లింపు కష్టమే: ఫిక్కీ

మరోవైపు కరోనా వల్ల డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలు నిలిచి పోయాయి. ఫలితంగా సిమెంట్‌ డిమాండ్‌ తగ్గుముఖం పట్టిందని కోటక్ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది.

సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత డిమాండ్‌ మళ్లీ పుంజుకుంటుందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. తాజా ఆంక్షల వల్ల మార్చి నుంచి కొంత కాలం పాటు డిమాండ్‌పై ప్రభావం ఉంటుందని పేర్కొంది. 

కరోనాతో సర్వీసుల రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఈ రంగానికి తక్షణమే ద్రవ్యపరంగా మద్దతు అందించాలని క్రిసిల్‌ సూచిస్తోంది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు విత్తపరమైన, ద్రవ్యపరమైన చర్యలు కూడా తీసుకోవాలని అంటోంది. కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావం మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలని అంటోంది. 

విమానయాన కంపెనీలు, హోటళ్లు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, రిటైలర్లకు ద్రవ్యపరంగా మద్దతు ఇవ్వాలని క్రిసిల్ పేర్కొంది. ఈ రంగంలోని కంపెనీలు చాలా నష్టాల్లో ఉన్నాయని క్రిసిల్‌ ఒక నివేదికలో పేర్కొన్నది. 

also read నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కరోనా వైరస్ పేరుతో వాల్​మార్ట్​ బంపర్​ ఆఫర్

కరోనాను కట్టడి చేయకపోతే చైనాకు భారత్‌ నుంచి ఎగుమతయ్యే పత్తి, ఇనుప ఖనిజం, పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్‌ భారీగా తగ్గవచ్చని క్రిసిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫార్మా, ఆటోమొబైల్స్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఎలక్ర్టానిక్స్‌, టెలికాం/స్మార్ట్‌ఫోన్‌ ఎక్విప్‌మెంట్‌ దిగుమతులు కూడా తగ్గడానికి అవకాశం ఉందని, ఫలితంగా దేశీయ పరిశ్రమలకు ఇబ్బందులు ఏర్పడవచ్చని చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి ప్రభావంతో పసిడి మార్కెట్లో సెంటిమెంట్‌ బలహీనంగా మారిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అంతగా ఆసక్తి చూపడం లేదని, ఫలితంగా గిరాకీ తగ్గిపోయిందని  ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) చెబుతోంది.

కరోనా దెబ్బతో అన్ని ఆస్తుల మాదిరిగానే బంగారంపైనా ప్రభావం పడిందని డబ్ల్యూజీసీ తెలిపింది. ఇతర ఆస్తుల్లో నష్టాలను కవర్‌ చేసుకోవడానికి చాలా మంది బంగారం నగదులోకి మార్చుకుంటుండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు నమోదు అవుతున్నాయని డబ్ల్యూజీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇండియా) సోమసుందరం పీఆర్‌ తెలిపారు.