కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసలు బడ్జెట్ ఎక్కడ మొదలైంది? దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 8వ సారి దేశ బడ్జెట్ (బడ్జెట్ 2025)ను ప్రవేశపెట్టనున్నారు. అయితే స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ నవంబర్ 26, 1947న ప్రవేశ పెట్టారు. అప్పటి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముగం చెట్టి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దేశ విభజన, అల్లర్ల మధ్య ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది ఏడున్నర నెలలే ఉంది. అసలు బడ్జెట్ ఎక్కడ మొదలైందో మీకు తెలుసా? మొట్టమొదటి బడ్జెట్ ఏ దేశంలో ప్రవేశపెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.

బడ్జెట్ అంటే ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం, కేంద్ర బడ్జెట్ దేశ వార్షిక ఆర్థిక నివేదిక. ఇది ఒక నిర్దిష్ట సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల అంచనా. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది.

మొట్టమొదటి బడ్జెట్ 

భారతదేశంలో బడ్జెట్ చరిత్ర స్వాతంత్య్రానికి ముందే ఉంది. బ్రిటిష్ కాలంలో మొదటిసారిగా ఏప్రిల్ 7, 1860న దేశంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుడు దీనిని ఆర్థిక సభ్యుడు జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. 1955-56 నుంచి దేశంలో బడ్జెట్ పత్రాలు హిందీలో కూడా రావడం మొదలైంది.

మొదటి బడ్జెట్ ఎక్కడ ప్రవేశపెట్టారు?

లాటిన్ పదం 'బుల్గా' నుంచి బడ్జెట్ వచ్చింది. ఫ్రెంచ్ భాషలో దీనిని బుగెట్ అంటారు. ఇంగ్లీషులో ఈ పదం బొగెట్ అయ్యింది. తర్వాత బడ్జెట్ అని పిలవడం మొదలైంది. ప్రపంచంలో మొట్టమొదటి బడ్జెట్ ఇంగ్లాండ్‌లో ప్రవేశపెట్టారు. 1760లో ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మొదలైంది. ఆ తర్వాత అనేక దేశాలకు వ్యాపించింది.