ముంబై/న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు అంటే ‘హాట్‌మనీ’. దేశీయ కేపిటల్‌ మార్కెట్లను ముందుకు నడిపించడంలో విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులే (ఎఫ్‌పీఐ) కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఈ విదేశీ పోర్ట్‌ ఫోలియో పెట్టుబడులు ఒక్కోసారి మన మార్కెట్లోకి వచ్చినంత వేగంగా తరలిపోతుంటాయి. ఈ ఏడాదిలోనూ అదే జరిగింది. మరో 15 రోజుల్లో పూర్తి కానున్న 2018లో దేశీయ మార్కెట్లలో వెనక్కి వెళ్లిన హాట్‌మనీ రూ.లక్ష కోట్లకు చేరువైంది. 

దాంతో ఎఫ్‌పీఐల విషయంలో మన దేశీయ మార్కెట్లకు 2002 తర్వాత మళ్లీ ఇదే అత్యంత గడ్డు సంవత్సరంగా మారింది. డిపాజిటరీలు, స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల వద్ద ఉన్న గణాంకాల ప్రకారం.. 2017లో దేశీయ ఈక్విటీ, డెట్‌ సెక్యూరిటీల మార్కెట్లోకి రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. 2018కి ముందు వరుసగా ఆరేళ్లు ఎఫ్‌పీఐల జోరు కొనసాగింది.
 
కానీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.87వేల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మరో 15 రోజుల్లో పెట్టుబడుల ఉపసంహరణ రూ.లక్ష కోట్ల చేరుకోవచ్చని అంచనా. మున్ముందు కూడా మార్కెట్లో ఇదే ట్రెండ్‌ కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాతో నియంత్రణ నియమావళిలో మార్పులు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. 
రాజకీయంగానూ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్‌ తగలడం కూడా మార్కెట్లో ప్రస్తుతం ప్రతికూల వాతావరణం నెలకొనడం ఒక కారణం. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, డాలర్‌పై రూపాయి పతనం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి ప్రతికూల అంశాలకు తోడు ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడుల అసలు లబ్ధిదారులెవరన్న వివరాలను సమర్పించాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో సెబీ నిబంధలను కఠినతరం చేసింది.

ఫలితంగా ఎఫ్‌పీఐలు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐలపై చాలా వరకు ఆంక్షలను సెప్టెంబర్ నెలలో సెబీ సడలించింది. అయినా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడలేదు. చాలావరకు ప్రధాన లిస్టెడ్‌ కంపెనీల్లో, ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగ సంస్థల్లో ఎఫ్‌పీఐలే అతిపెద్ద వాటాదారులుగా ఉన్నారు.

భారత లిస్టెడ్‌ కంపెనీల్లో విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడుల సరాసరి వాటా 25 శాతం వరకు ఉండవచ్చని అంచనా. ప్రమోటర్ల తర్వాత పెద్ద మొత్తంలో వాటాలు ఉన్నది ఎఫ్‌పీలకే. కంపెనీ ప్రమోటర్ల మొత్తం వాటా సరాసరిగా 60 శాతం వరకు ఉండవచ్చని అంచనా. ఎఫ్‌పీఐలు పోగా మిగతా కొద్ది శాతం వాటా దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు, హెచ్‌ఎన్‌ఐలు, రిటైల్‌ ఇన్వెస్టర్ల చేతుల్లో ఉంది.
 
ఫండ్స్‌ ఇండియా డాట్‌ కామ్‌లో ఫండ్స్‌ రీసెర్చ్‌ అధిపతి విద్యా బాల మాట్లాడుతూ ‘అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పెంచడంతోపాటు అంతర్జాతీయంగా పెట్టుబడి పోర్ట్‌ఫోలియోల్లో జరిగిన మార్పులు, రూపాయి పతనం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు ఎఫ్‌పీఐలు వెనక్కి వెళ్లడానికి ప్రధాన కారణం’ అని తెలిపారు. వచ్చే ఏడాది లోక్‌‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ అనిశ్చితి పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారని విద్యా బాల పేర్కొన్నారు. 
 
మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సీనియర్ విశ్లేషకులు హిమాన్షు శ్రీ వాత్సవ మాట్లాడతూ ఫెడ్‌ రేట్లు, రూపాయి పతనం, ముడి చమురు ధరలతోపాటు మళ్లీ పెరుగుతున్న కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్), లక్ష్యం మేరకు ద్రవ్యలోటు నియంత్రణ విషయంలో అనిశ్చితి కూడా ఎఫ్‌పీఐల సెంటిమెంట్‌కు గండి కొట్టాయన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాదీ విదేశీ పెట్టుబడులు అంతంత మాత్రమేనని హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు.