న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 16కోట్ల మంది వినియోగదారులకు ఆన్​లైన్ ద్వారా వాల్ మార్ట్ - ఫ్లిప్​కార్ట్ సంస్థ వస్తు సరఫరా సేవలందిస్తున్నది. ఇకముందు కూడా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు మరో ముందడుగు వేసింది. 700 నగరాల్లో, 27వేల కిరాణా దుకాణాల ద్వారా వస్తు సరఫరా సేవలను అందించనున్నట్లు ఫ్లిప్​కార్ట్ అధికారిక ప్రకటనలో తెలిపింది. 

డిజిటల్ చెల్లింపుల తర్వాత వినూత్న కార్యచరణ ద్వారా ఈ-కామర్స్​లో సరికొత్త విప్లవం రానుందని ఫ్లిప్ కార్ట్ సీఈఓ కల్యాణ్ క్రుష్ణమూర్తి చెప్పారు. వచ్చే పండగ సీజన్​, బిగ్ బిలియన్​ డేస్​‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లిప్​కార్ట్ తెలిపింది. ఈ నిర్ణయంతో కస్టమర్లకు మరింత చేరువ కావడమే కాక, కిరాణా దుకాణాల యజమానులు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు చేయూతనిస్తుందని పేర్కొంది. 

ప్రతిరోజు 10లక్షల వస్తువులను కస్టమర్లకు సరఫరా చేస్తోంది ఫ్లిప్​కార్ట్​. దేశంలోని దాదాపు అన్ని పిన్ కోడ్ పరిధిలలో సేవలను అందిస్తోంది. ఆరు నెలల క్రితమే దేశవ్యాప్తంగా కిరాణ దుకాణాలను తమ బోర్డులో చేర్చుకునేందుకు ఫ్లిప్ కార్ట్ ప్రణాళిక అమలు ప్రారంభించింది. ఈ- కామర్స్ నూతన ఆదాయం వనరుగా కిరాణ వ్యాపారులకు లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. బిగ్ బిలియన్ డేస్ సమయంలో ద్వితీయ, త్రుతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరించాలన్నది ఫ్లిప్ కార్ట్ వ్యూహం. 

గత ఆరు నెలల్లో 800 నగరాలు, పట్టణాల పరిధిలో కార్యకలాపాలను వేగవంతం చేసింది ఫ్లిప్ కార్ట్. తద్వారా నూతన విక్రేతలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, దేశీయ ఉత్పత్తిదారులు, చేతి వ్రుత్తుల కళాఖండాలను ఈ-కామర్స్ రంగంలోకి తేవడమే లక్ష్యంగా ఫ్లిప్ కార్డు ముందుకు సాగుతోంది.