ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక వచ్చేస్తోంది. దీపావళి వరకు డీఏ పెరగదేమో అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దసరాకే ఆ పండుగ కానుకను ఇచ్చేస్తోంది. సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా డిఏ పెరగబోతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందకరమైన వార్త ఇది. దీపావళి వరకు కొత్త డీఏ అందుబాటులోకి రాదేమో అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ శుభవార్తను దసరాకి అందించనుంది. సెప్టెంబర్ లోనే అంటే దీపావళికి ముందే నవరాత్రికి డిఏ పెంపును ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రకటన ఎప్పుడు వచ్చినా కూడా జూలై 1, 2025 నుండి ఆ డీఏ పెంపు అమల్లోకి వస్తుంది. అంటే ఎరియర్స్ రూపంలో ఆ డబ్బులు అన్ని ఖాతాల్లో పడిపోతాయి.

డీఏ పెంపు ఎంత?
ఇక డిఎ ఎంత పెరుగుతుందనే విషయంపై ఇప్పటికే ఎన్నో చర్చలు నడుస్తున్నాయి. దాదాపు మూడు శాతం నుండి నాలుగు శాతం వరకు పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 55 శాతం ఉంది. దీన్ని 59 శాతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డిఏ పెంపును అందిస్తుంది. ఫిబ్రవరి, మార్చ్ లో ఒకసారి డిఏ పెంపును ప్రకటిస్తుంది. అలాగే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కూడా డిఏ పెంపును ప్రకటిస్తుంది.

డిఏ పెంపు నోటిఫికేషన్ ఆలస్యం అయినప్పటికీ ఉద్యోగులకు ఎలాంటి బెంగా లే.దు వారి బకాయిలన్నీ కూడా చెల్లిస్తుంది. ప్రభుత్వం ఎంత డీఎ పెంచాలి అన్నదానిపై నిర్ణయం తీసుకొని.. ఎప్పుడు పెంచాలన్నది ప్రకటిస్తే చాలు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ వచ్చేస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ ద్వారానే ప్రతి సంవత్సరం ఎంతో కొంత జీతం పెరుగుతూ ఉంటుంది. అయితే ద్రవ్యోల్బణం కూడా దీనిని ప్రభావితం చేస్తుంది. డిఏ ఎంత పెంచాలన్న విషయంపై ద్రవ్యోల్భణం గురించి ఎక్కడ నేరుగా ప్రత్యక్ష సంబంధం కనిపించకపోయినా అది ఖచ్చితంగా డీఏ పెరుగుదలను ప్రభావితం చేసే అవకాశాలు అధికంగానే ఉన్నాయి.

కోవిడ్ బకాయిలు కూడా
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 18 నెలల డీఏ బకాయిలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కోవిడ్ కాలంలో 18 నెలల డిఏ బకాయిలను గవర్నమెంట్ ఆపేసింది. వాటి గురించి ఇప్పటికి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ 18 నెలల డబ్బును తిరిగి ఇస్తారా? ఇవ్వరా? అనే అనుమానం కూడా ఎంతోమందిలో ఉంది.

కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు పెన్షనర్లకి సంబంధించిన డిఏను కూడా ఆ కాలంలో ఆపేశారు. కోవిడ్ కాలంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలు డిఏ బకాయిలను చెల్లించాలని అడుగుతూనే ఉన్నాయి. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. ఇక ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. అప్పుడైనా ఈ బకాయిలను తిరిగి చెల్లిస్తారని ఉద్యోగులు ఆశపడుతున్నారు.
