న్యూఢిల్లీ: ఉల్లి ఉత్పాదక రాష్ర్టాల్లో నెలకొన్న కరువు పరిస్థితుల్లో అప్రమత్తమైన కేంద్రం.. దాని నియంత్రణకు చర్యలు చేపట్టింది. 50వేల టన్నులతో భారీ నిల్వకు శ్రీకారం చుట్టింది. మున్ముందు మార్కెట్‌లో ఉల్లి ధరల  నియంత్రణకు ఈ నిల్వలను వినియోగించుకోవాలని భావిస్తున్నది. 

ఆసియా దేశాల్లోనే అతిపెద్ద ఉల్లి హోల్‌సేల్ మార్కెటైన మహారాష్ట్రలోని లాసల్గావ్‌లో మంగళవారం కిలో ఉల్లిగడ్డ ధర 29 శాతానికిపైగా ఎగిసి రూ.11 పలికింది. సోమవారం ఇది రూ.8.50గా ఉన్నది. ఇక ఢిల్లీలో రకాన్నిబట్టి రిటైల్ ధరలు కిలో రూ.20-25కు చేరాయి. 

ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని, దేశీయ అవసరాల నిమిత్తం భారీ నిల్వలకు తెరతీశామని ఆహార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఉల్లి ఉత్పాదక రాష్ర్టాల్లో కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ రబీ సీజన్‌లో పంట దిగుబడి తగ్గనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 

ఇదే నిజమైతే మార్కెట్‌లో సరఫరా తగ్గి, ధరల పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయని సదరు అధికారులు పీటీఐకి తెలిపారు. మునుపు కిలో ఉల్లి ధర రూ.100ను దాటి పరుగులు తీసిన సంగతి విదితమే. కాగా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రధాన ఉల్లి ఉత్పాదక రాష్ర్టాల్లో కరువు కారణంగా ఈ ఏడాది దిగుబడి అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. 

ఈ నెలతో ముగిసే ప్రస్తుత 2018-19 పంట సంవత్సరంలో ఉల్లి ఉత్పత్తి నిరుడుతో పోల్చితే స్వల్పంగా పెరిగి 23.62 మిలియన్ టన్నులుగా ఉంటుందని ఆరంభంలో అంచనా వేశారు. అయితే సవరించిన అంచనాల ప్రకారం కరువు పరిస్థితుల దృష్ట్యా ఉత్పత్తి తగ్గిపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.