డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, డబ్బు ఆదా చేయడం కూడా అంతే సవాలుతో కూడుకున్నది. అకౌంటులో డబ్బులు పెరిగే కొద్దీ ఖర్చు చేయాలనే చేతి దురద మొదలవుతుంది. అవసరం ఉన్న, లేని వస్తువులను కొనడం ప్రారంభిస్తాం. చివరకు అవసరం అయ్యే సమయంలో చేతులు కాల్చుకుంటాం.
డబ్బులు ఎక్కడ ఖర్చు చేయాలో తెలియకపోతే చాలా నష్టపోతాం. అయితే జేబులో డబ్బు అయిపోయినప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అందుకే డబ్బు సంపాదించినప్పుడు నియంత్రణలో ఉండటం అనేది చాలా అవసరం. ఈ ఆన్‌లైన్ యుగంలో డబ్బు ఖర్చు చేయడం అనేది చిటికెలో పని, ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ తో ఎంత ఖర్చు చేస్తున్నామో ట్రాక్ చేయకపోవడం వల్ల. ఆఖరికి క్రెడిట్ కార్డు అప్పు ఎలా తీర్చాలనే సమస్య మొదలవుతుంది. ఎక్కువ డబ్బు ఖర్చు చేసే వ్యక్తులకు దాన్ని ఎలా నియంత్రించాలో, పొదుపు వైపు ఎలా మొగ్గు చూపాలో తెలుసుకుందాం.
జీతం ప్రకారం బడ్జెట్: వంద రూపాయలు సంపాదించి రెండు వందలు ఖర్చు చేస్తే క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం కష్టం. కాబట్టి మీ జీతం ప్రకారం నెలవారీ బడ్జెట్‌ను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ నెలలో మీరు ఎంత డబ్బు ఖర్చు చేయాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోండి. ఖర్చు చేయండి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బడ్జెట్‌కు వెలుపల ఖర్చు చేయవద్దు. ఈ చిన్న చిట్కాలు మీ భవిష్యత్తుకు చాలా సహాయపడతాయి.
పొదుపు చేయడం చాలా ముఖ్యం: ఉద్యోగంలో చేరి ఏడాది పూర్తయినా పొదుపు చేయడం ప్రారంభించకపోతే భవిష్యత్తులో కష్టమే. మీరు మీ జీతంలో కొంత భాగాన్ని ఆదా చేసుకోవాలి. అధిక ఖర్చు చేసేవారు అనవసరమైన వాటిపై వెచ్చించే డబ్బును పొదుపులో పెట్టాలి. నెల ప్రారంభంలో మ్యూచువల్ ఫండ్స్, లేదా పోస్టాఫీసు పథకాల్లో డబ్బు ఉంచడం మేలు.
క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు దీన్ని గుర్తుంచుకోండి: చేతిలో క్రెడిట్ కార్డ్ ఉంటే షాపింగ్ చేయడానికి మీకు మరింత విశ్వాసం ఉంటుంది. మీకు ఒకే కార్డు లేకపోతే, మీరు దానిని ముందుకు వెనుకకు ఖర్చు చేయవచ్చు. మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే, ఖర్చు చేసే ముందు నాలుగైదు సార్లు ఆలోచించండి. లేదంటే అప్పు చేసి పప్పు కూడా తినాల్సిందే.
నిత్యావసర వస్తువులకే ప్రాధాన్యం: ఆన్ లైన్ ఆఫర్ల మోజులో పడి ఎడా పెడా కొనేస్తుంటే చివరకు మీరు భారీగా నష్టపోవడం ఖాయం. మీరు షాపింగ్ చేయడానికి ముందు, కావలసినవి, వద్దు అనే జాబితాను రూపొందించండి. షాపింగ్ చేసేటప్పుడు మీ మనస్సును చలించనివ్వకండి. మార్కెట్‌కి వెళితే అవసరమైన వస్తువులు లభించే దుకాణానికి మాత్రమే వెళ్లి వస్తువులు కొనుగోలు చేసి తిరిగి రావాలి. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు కూడా ఆక్షణీయ ఆఫర్‌లను చూసే షాపింగుకు వెళ్లకండి.
మరొక ఖాతాను కలిగి ఉండండి: మీరు ఎక్కువ ఖర్చు చేయాలనుకుంటే, మరొక బ్యాంకు ఖాతాను తెరవడం మంచిది. అందుకున్న మొత్తంలో కొంత మొత్తాన్ని ఆ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయండి. ఆ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించవద్దు.
