ముంబై: రుణ సంక్షోభంతో మూతబడిన జెట్ ఎయిర్వేస్ సంస్థలో వాటాల కొనుగోలు కోసం ప్రముఖ వ్యాపార సంస్థ హిందూజా గ్రూప్ ఆసక్తి చూపుతోంది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఈ సంస్థకు ఇచ్చిన రుణాలను ఈక్విటీలుగా మార్చుకున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జెట్ విక్రయంపై కసరత్తు చేస్తున్నాయి. జెట్ వాటాల కొనుగోలుకు బిడ్డింగ్ అంశాన్ని పరిశీలిస్తున్నామని హిందూజా వర్గాలు మీడియాకు తెలిపాయి.

ఎతిహాద్ గ్రూప్ వంటి సంస్థలు బిడ్లు వేశాయి. ఈ విషయమై జెట్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఇన్వెస్టర్ ఎతిహాద్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ నేతృత్వంలోని బ్యాంకర్ల కన్సార్టియంతో చర్చిస్తున్నట్లు హిందుజా గ్రూప్ వర్గాలు పేర్కొన్నాయి. 

ప్రస్తుతం వివిధ విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న జెట్ ఎయిర్వేస్ స్లాట్లను ఇతర ఎయిర్లైన్స్‌కు తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర పౌర విమానయాన శాఖ కేటాయించింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

హిందుజా గ్రూప్‌నకు ఆటోమోటివ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, విద్యుత్, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో కార్యకలాపాలున్నాయి. గ్రూప్ సంస్థల్లో దాదాపు 1,50,000 మంది పైచిలుకు ఉద్యోగులు పని చేస్తున్నారు.  

జెట్ ఎయిర్వేస్ సంస్థ టేకోవర్ అంశాన్ని పరిశీలిస్తున్నామన్న హిందుజాల ప్రకటనపై ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ గానీ, ఎతిహాద్ గానీ ఇంతవరకూ స్పందించలేదు. మరోవైపు జెట్ కొనుగోలుకు హిందూజా ఆసక్తి చూపుతుందన్న వార్తలతో ఎయిర్లైన్ షేర్లు భారీగా లాభపడ్డాయి. 

మంగళవారం మార్కెట్ సెషన్లో ఎన్ఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ ధర 12.94శాతం పెరిగి రూ. 148.40 వద్ద స్గిరపడింది. బీఎస్ఈలో షేర్ విలువ 14.73శాతం పెరిగి రూ. 150.75 వద్ద ముగిసింది. 

ఇండిగో, స్పైస్జెట్, గో ఎయిర్ లాంటి బడ్జెట్ ఎయిర్ లైన్ సంస్థల నుంచి పోటీ ఎక్కువవడంతోపాటు నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో జెట్ ఎయిర్వేస్ నష్టాల్లో కూరుకుపోయింది. కనీసం విమానాలకు లీజు చెల్లించలేని, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజారింది. బ్యాంకర్లు, పెట్టుబడిదారుల నుంచి కూడా ఎలాంటి ఆర్థిక సహకారం అందకపోవడంతో జెట్ మూతబడింది. 

ఇదిలా ఉంటే జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. సంస్థను పునరుద్ధరించి, తమ వేతన బకాయిలను తీర్చాలని డిమాండ్ చేశారు. దాదాపు 200 మంది ఉద్యోగులు ‘మా రోదన వినండి.. జెట్ ఎయిర్‌వేస్‌ను ఎగురనివ్వండి’ అన్న బ్యానర్లతో నిరసనకు దిగారు. 

‘మీ చుట్టూ తిరుగుతున్నాం.. జెట్ విమానాలను నేలకే పరిమితం చేయొద్దు.. సంస్థను నీరుగార్చొద్దు.. మా పొట్ట కొట్టొద్దు అని నినదించారు. ఇంటిని శుభ్రం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు ఒకరినొకరు సాయం చేసుకున్నట్లే సంస్థను బతికించుకోవడానికి అందరం కలిసి పనిచేద్దాం’ అన్న సందేశాన్నీ జెట్ ఉద్యోగులు ఇచ్చారు. 

తిండికోసం ఇతరుల మీద ఆధారపడే దుస్థితిలో ఉన్నామని కంట తడిపెట్టారు. కాగా, ఉద్యోగులందరూ మినిస్ట్రీ వైపునకు వెళ్తుండటంతో అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు.. ముగ్గురు ప్రతినిధులను మాత్రం లోనికి అనుమతించారు. మినిస్ట్రీ సంయుక్త కార్యదర్శి ఎస్‌కే మిశ్రాను కలిసి తమ సమస్యల్ని విన్నవించినట్లు ఆ ముగ్గురిలో ఒకరైన ఆశిశ్ కుమార్ మహంతి అనంతరం పీటీఐకి తెలిపారు.