పైలట్ల బాసట: మూసివేత అంచుల్లో జెట్ ఎయిర్‌వేస్.. వేతనాల్లో కోతలు అనివార్యమే?

Endeavouring to help airline achieve cost efficiencies: Jet Airways' pilots union
Highlights

దేశంలోకెల్లా అతిపెద్ద ప్రైవేట్ విమాన యాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో జెట్‌ఎయిర్‌వేస్‌ను కాపాడుకొనేందుకు ఆ సంస్థ పైలెట్‌లు ముందుకొచ్చారు.

ముంబై: దేశంలోకెల్లా అతిపెద్ద ప్రైవేట్ విమాన యాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో జెట్‌ఎయిర్‌వేస్‌ను కాపాడుకొనేందుకు ఆ సంస్థ పైలెట్‌లు ముందుకొచ్చారు. అపద సమయంలో తాము సంస్థను కాపాడుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ (ఎన్‌ఏజీ) తెలిపింది. 'కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలపై మేం సమావేశమై చర్చించాం. ఖర్చులు తగ్గించుకునేందుకు మేమంతా యాజమాన్యానికి సహకరిస్తాం. మా కంపెనీ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేలా చేసేందుకు మావంతు కృషి చేస్తాం' అని పైలెట్ల ఎన్‌ఏజీ పేర్కొంది. ఈ ఎన్‌ఏజీ యూనియన్‌లో దాదాపు 1100 మంది సభ్యులుగా ఉన్నారు. 

జెట్ ఎయిర్‌వేస్ కష్టాలకు కారణాలివి..
ఇంధన వ్యయం పెరిగి, రూపాయి విలువ క్షీణించడం, తక్కువ ధరలకే టికెట్లు అమ్ముతూ విమానాశ్రయ సంస్థల మధ్య పోటీ నెలకొనడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నట్లు యూనియన్‌ అభిప్రాయపడింది. అనతి కాలంలోనే జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ మళ్లీ పుంజుకుంటుందని ఎన్‌ఏజీ అబిప్రాయ పడింది. నిర్వహణ ఖర్చులు పెరుగుదలతోనే జెట్‌ ఎయిర్‌వేస్‌ కష్టాలను ఎదుర్కొం టుందని వార్తలొచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చుల భారం తగ్గించుకోకపోతే ఎయిర్‌లైన్‌ను 60రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగించలేమని, అందువల్ల పైలెట్లతో పాటు ఇతర సిబ్బంది జీతాల్లో కోత విధించాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతిపాదించిన నేపథ్యంలో పైలెట్‌ యూనియన్‌ సానుకూల ధృక్పథంతో ముందుకు రావడం విశేషం. ఖర్చులు తగ్గించుకొనేందుకు ముందుకొచ్చిన పైలెట్లు వేతనం విషయంలో రాజీ పడేందుకు సుముఖంగా లేరని సమాచారం. పైలట్ల వేతనంలోనూ 15 శాతం తగ్గింపునకు సంస్థ యాజమాన్యం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

వేతనాల్లో కోతకు సహకరించాలని జెట్ ఎయిర్ వేస్ విజ్ఞప్తి 
భారత్‌లో అతిపెద్ద ప్రయివేటు విమాన సంస్థగా సేవలందిస్తోన్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఆర్థిక కష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరిగి, రూపాయి విలువ క్షీణిస్తుండడం, నిర్వహణ ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో  ఎయిర్‌లైన్‌ సంస్థను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధులే ప్రత్యక్షంగా చెప్పారని ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చుల భారం తగ్గించుకోకపోతే సంస్థను 60 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగించలేమని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు మీడియాకు వివరించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. సంస్థ భవిష్యత్తు నిమిత్తం ఎయిర్‌లైన్‌ చైర్మన్‌ సహా యాజమాన్య బృందం ఇటీవల పలుమార్లు సంస్థ సిబ్బందితో చర్చలు జరిపి పరిస్థితిని వివరించినట్టుగా ఆ కథనాల సారాంశం.

వాటా విక్రయం దిశగా జెట్ ఎయిర్‌వేస్ ఆలోచనలు
2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో వరుస లాభాలను ఆర్జించిన జెట్‌ ఎయిర్‌వేస్‌. గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.767 కోట్ల నష్టం చవిచూసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే సంస్థకు రూ.1000 కోట్ల నష్టం రావొచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏటా సిబ్బంది వేతనాలకు రూ.3000 కోట్లు ఖర్చు చేస్తోంది. దీన్ని తగ్గించుకోవాడానికి ఇప్పటికే సిబ్బంది జీతాల్లో కోత విధించేందుకు యాజమాన్యం సిద్ధమైన విషయం తెలిసిందే. సిబ్బంది వేతనాల ఆధారంగా ఐదు నుంచినుంచి 25శాతం వరకు కోత విధించాలని ఎయిర్‌లైన్‌ నిర్ణయించింది. ఇదే విషయాన్ని సదరు సిబ్బందితో యాజమాన్యం చర్చించింది. ఈ తగ్గింపుతో సంస్థకు రూ.500 కోట్ల భారం తగ్గుతుందని సంస్థ ఆశిస్తోంది. ఈ ప్రయత్నాలలో భాగంగానే మరోవైపు ఎయిర్‌ లైన్‌లో కొంత వాటాను అమ్మేయాలనీసంస్థ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎదురు 'నిలుస్తాం': జెట్ ఎయిర్ వేస్ సీఈఓ వినయ్ దూబే
జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోందని సర్వీసులు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్న మీడియా వార్తలను ఆ సంస్థ సీఈవో వినయ్ దూబే తోసిపుచ్చారు. ఈ వార్తలు సత్యదూరమైనవని, కల్పితాలన్నారు. మీడియాలో వస్తున్న వార్తల్లో ఏది నిర్ధిష్టంగా సత్య దూరమన్నది మాత్రం చెప్పలేదు. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా తాము ఉద్యోగులతో చర్చిస్తున్నట్లు అంగీకరించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆరోగ్యవంతమైన, దృఢమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు విక్రయాలు, పంపిణీ, పేరోల్‌, నిర్వహణ, ఫ్లీట్‌ సింప్లిఫికేన్‌ విభాగాలలో వ్యయనియంత్రణ చర్యలను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు.

loader