Asianet News TeluguAsianet News Telugu

చెక్, ఏటీఎం సేవలకూ జీఎస్టీ: కేంద్రానికి రూ.40 వేల కోట్ల ఇన్‌కం

ఇప్పటివరకు బ్యాంకుల ఖాతాదారులకు లభించిన వివిధ రకాల ఉచిత సేవలు ఇక ప్రియం కానున్నాయి. సీజీఎస్టీ రూపంలో 18 శాతం పన్నును ఖాతాదారుల నుంచి వసూలు చేసేందుకు ప్రధాన బ్యాంకులు అంగీకరించినట్లు సమాచారం. తద్వారా రూ.40 వేల కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని తెలుస్తోంది. 

End to bank freebies? Get set to pay GST on credit cards, ATM, cheque books
Author
Delhi, First Published Dec 2, 2018, 12:13 PM IST

ఖాతాదారులపై మరో ఆర్థిక భారం మోపేందుకు దేశంలోని బ్యాంకుల సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సర్‌ఛార్జీల పేరుతో కస్టమర్లను దోచుకుంటున్న ప్రభుత్వ, ప్రైవేట్  బ్యాంకులు, ఇకపై బ్యాంకింగ్‌ సేవలపై జీఎస్టీ పేరుతో మరింత భారాన్ని మోపాలని భావిస్తున్నాయి. అదీ కూడా 18 శాతం జీఎస్టీ వసూలు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. 

ఖాతాల్లో కనీస నిల్వలను నిర్వహిస్తున్న వారికి అందించే ఉచిత సర్వీసుల మీద ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన జీఎస్టీ భారాన్ని త్వరలో ఖాతాదారుల నెత్తిన నెట్టేసేందుకు బ్యాంకులు వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా సమాచారం. సర్కారు చర్యలకు అనుగుణంగా ఇప్పటి వరకు బ్యాంకులు అందిస్తున్నపలు ఉచిత సేవలను ఈ పన్ను పరిధిలోకి తేవాలని యాజమాన్యాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

దీంతో ఇప్పటి వరకు బ్యాంకులు కస్టమర్లకు అందించే పలు ఉచిత సేవలు రానున్న రోజుల్లో భారంగా మారనున్నాయి. ముఖ్యంగా చెక్‌ బుక్‌ల జారీ, క్రెడిట్‌ కార్డ్‌ల మంజూరు, ఏటీఎంలలో డెబిట్‌ కార్డు వాడకం, ఫ్యూయల్‌ సర్‌ఛార్జ్‌ రిఫండ్స్‌ వంటి సేవలపై జీఎస్టీ మోత మోగనుందని సమాచారం. 

తద్వారా దాదాపు రూ.40వేల కోట్ల ట్యాక్స్‌, పెనాల్టీలను బ్యాంకుల నుండి ప్రభుత్వం రాబట్టేందుకు  ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. బ్యాంకులు ఇస్తున్న ఉచిత సర్వీసులపై జీఎస్టీని విధిస్తూ బ్యాంకులకు రెండు నెలల క్రితమే పన్నులశాఖ నోటీసులను జారీ చేసింది. ఇప్పటికే లాభాలు కుంగి ఆర్థిక కష్టాల్లో ఉన్న బ్యాంకులు ప్రభుత్వం జీఎస్టీ పేరుతో విధించే మరో భారీ భారాన్ని మోయలేమని చేతులు ఎత్తేస్తున్నాయి. 

దీంతో విధిలేక ఆ పన్ను భారాన్ని నేరుగా ఖాతాదారులపైనే వేయాలని ఆయా బ్యాంకులు భావిస్తున్నట్టు సమాచారం. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి బ్యాంకులు జీఎస్టీ పన్నును వినియోగదారులకు బదిలీ చేసేందుకు సిద్ధం కానున్నాయని ఎకనామిక్‌ టైమ్స్‌ తెలిపింది. 

ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు తమ ఉచిత సేవలకు 18 శాతం జీఎస్టీ విధింపునకు సూత్రప్రాయంగా తమ సమ్మతిని తెలియజేసినట్టుగా సమాచారం. ఎంత మొత్తంలో.. ఏ రూపంలో జీఎస్టీ విధించాలన్నదానిపై ఆయా బ్యాంకులు తుది ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి.

ఇందులో చాలా బ్యాంకులు ఈ నెల రెండో వారం నుంచే జీఎస్టీ వడ్డ నకు సిద్ధమవుతున్నాయని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సీఈవో కేజీ కన్నన్‌ పేర్కొన్నారు. ఈ విధానం అమలైతే ఖాతాదారుల పన్ను చెల్లింపులు నేరుగా ప్రభు త్వానికే వెళ్ళిపోతాయని పేర్కొన్నారు.

సీజీఎస్టీ చట్టం లోని షెడ్యూల్‌ 2 ప్రకారం ఇతర నాన్‌ బ్యాంకింగ్‌ రంగ సంస్థల సేవలపై కూడా జీఎస్టీ పేరుతో కాసులు సంపాదించేందుకు పన్ను శాఖ కసరత్తులు చేస్తుందని సమాచారం. తాజాగా పన్నుల శాఖ నుంచి నోటీసులు అందుకున్న బ్యాంకుల్లో మల్టీనేషనల్‌ బ్యాంకులైన డీబీఎస్‌, సిటీబ్యాంక్‌ కూడా ఉన్నాయి. 

ఇప్పటికే బ్యాంకుల చార్జీలతో దిమ్మతిరిగి అటువైపు వేళ్లాలంటేనే జంకుతున్న సామాన్య మానవుడు ఏటీఎంతో సహా పలు బ్యాంకింగ్‌ సేవలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని యోచిస్తుండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమపై జీఎస్టీ భారాన్ని మోపే విషయమై బ్యాంకులు మరోసారి పునరాలోచించుకోవాలని వారు కోరుతున్నారు. 

తాజా నిర్ణయంతో బ్యాంకులకు ప్రజలు మరింత దూరమయ్యే అవకాశం లేకపోలేదని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ భారాన్ని ప్రజలపై ఎలా మోపాలనే విషయమై పెద్ద విత్త సంస్థలు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వస్తాయో చూసి తమ ప్రణాళికలను వెల్లడించాలని చిన్న బ్యాంకులు, తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నట్లు సమాచారం.

యూనియన్‌ బ్యాంకు వడ్డీరేట్లు పెంపు
యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులకు చేదువార్త అందించింది. ఎంసీఎల్‌ఆర్‌ రేటు 0.5శాతం పెంచుతూ శనివారం ప్రకటించింది. ఈ పెంచిన వడ్డీరేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios