ముంబై: దాదాపు రెండు నెలల క్రితం నేలకు పరిమితమైన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణపై ఇటు హిందుజా గ్రూప్, అటు ఎతిహాద్ సిద్ధంగా లేవని తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ సంస్థలో వాటా పెంపొందించుకోవడంపైనే కేంద్రీకరించింది ఎతిహాద్. 

దీనికి అనుగుణంగా హిందుజా గ్రూప్‌ చర్చలు నిలిపివేసింది. ఫలితంగా ముందు పీఠిన ఎతిహాద్ నిలవడంతోపాటు బ్యాక్ సీటు నుంచి హిందుజా గ్రూప్ భాగస్వామిగా ఉంటుందని విశ్వసనీయ వర్గాలను బట్టి తెలుస్తోంది. ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌లు జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణకు సిద్ధంగా లేవన్న వార్తల నేపథ్యంలో మంగళవారం షేరు ధర సుమారు 11 శాతం క్షీణించింది. 

ఎతిహాద్, హిందుజాలతోపాటు పలు బిడ్లు దాఖలు చేసిన పలు సంస్థలు కూడా సదరు జెట్ ఎయిర్వేస్ సంస్థపై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధీనంలోని ఎస్ఎఫ్ఐఓ వంటి సంస్థల దర్యాప్తు నేపథ్యంలో ఈ సంస్థ టేకోవర్ రిస్కీగా మారుతుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొన్ని క్రెడిటార్ సంస్థలు జెట్ ఎయిర్వేస్ సంస్థపై దివాళా ప్రక్రియ ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని కోరడం గమనార్హం.

పౌర విమాన యాన రంగంలోకి స్పైస్‌జెట్‌, ఇండిగో వంటి సంస్థల ప్రవేశం, తక్కువ ధరలకే విమాన ప్రయాణం అందించడంతో పోటీ నేపథ్యంలో అన్ని సంస్థలు రెండు శాతం మేర ధరలు తగ్గించాయి. ఇక్కడే జెట్‌ ఎయిర్‌వేస్‌ పతనం ఆరంభమైందన్న అభిప్రాయం ఉంది.

ఇతర సంస్థల నుంచి పోటీని తట్టుకోవడానికి నగదు నిల్వలు వినియోగించడంతోపాటు జెట్ ఎయిర్వేస్ భారీగా అప్పులు చేస్తూ పోయింది. గతేడాది నవంబర్ నెలలో జెట్‌ ఎయిర్‌వేస్‌ నష్టాలు భారీగా పెరిగిపోయాయి. 2019 మార్చిలో నాలుగో వంతు విమానాల కార్యకలాపాలు నిలిపేయాల్సి వచ్చింది. 

బకాయిలు చెల్లించక ఏప్రిల్‌ నుంచి పెట్రోల్ సరఫరా చేసేందుకు ముడి చమురు సంస్థలు నిరాకరించాయి. ఇదే నెలలో ఆమ్‌స్టెర్‌డామ్‌లో విమానాన్ని సీజ్‌ చేశారు. దీంతోపాటు బోయింగ్‌ 777 విమానాల్ని అన్నింటిని అద్దెదారులు సీజ్‌ చేయడానికి సిద్ధమయ్యారు. 

ఈ క్రమంలోనే బ్యాంకుల కన్సార్షియం జెట్ ఎయిర్వేస్‌ను ఆధీనంలోకి తీసుకుంది. కానీ సంస్థ పనితీరు, నగదు నిల్వలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న బ్యాంకుల కన్సార్టియం తదుపరి పెట్టుబడులకు వెనుకడుగు వేసింది.

జెట్ ఎయిర్వేస్ 1992 ఏప్రిల్‌ 1న ఏర్పాటైంది. నరేశ్‌ గోయల్‌ 60 శాతం, గల్ఫ్‌ ఎయిర్‌ 20 శాతం, కువైట్‌ ఎయిర్‌వేస్‌ 20 శాతం చొప్పున నిధులు సమకూర్చారు. అయితే 1993 వరకు వారు తమ కార్యకలాపాల్ని ప్రారంభించలేదు. 

తొలుత 4 బోయింగ్‌ 737-300 విమానాల్ని అద్దె ప్రాతిపదికన తీసుకొని ఆ ఏడాది తొలి విమానాన్ని ముంబై నుంచి అహ్మదాబాద్‌కు నడిపించారు. ఆ ఏడాది 5 లక్షల మందిని 12 గమ్యస్థానాలకు చేరవేయగలిగారు.

1994లో విస్తరణ దిశగా జెట్ ఎయిర్వేస్ అడుగులు వేసింది. ఆ ఏడాది ఏకంగా 17 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేసింది. అప్పటికి సంస్థ వద్ద ఉన్న ఏడు విమానాలకు తోడు అదనంగా మూడు 737-400 విమానాల్ని మలేసియా ఎయిర్‌లైన్స్‌ నుంచి అద్దెకు తీసుకున్నది.

జెట్ ెయిర్వేస్ 1996లో మరో అడుగు ముందుకేసి బోయింగ్‌కు 375 మిలియన్‌ డాలర్ల ఆర్డర్‌ ఇచ్చింది. నాలుగు 737-400, ఆరు 737-800 విమానాలను కొనుగోలు చేసింది. దాంతో ఏడాదికి 24 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చగలిగే స్థాయికి ఎదిగింది.

అప్పటికి మొత్తం 12 బోయింగ్‌ 737 విమానాలతో 83 రోజువారీ విమాన సర్వీసులు 23 గమ్యస్థానాలకు నడిపింది జెట్ ఎయిర్వేస్. దీంతో 20 శాతం మార్కెట్‌ వాటా ఈ కంపెనీ సొంతమైంది.

1997 వరకు సంస్థకు గల్ఫ్‌ ఎయిర్‌, కువైట్‌ ఎయిర్‌లైన్స్‌ రూపంలో విదేశీ పెట్టుబడుల సాయం అందుతుండటంతో విస్తరణ దిశగా జెట్ ఎయిర్వేస్ పరుగులు తీసింది. అయితే ఆ ఏడాది భారత ప్రభుత్వం దేశీయ విమానయాన రంగంలో విదేశీ పెట్టుబడులు ఉండొద్దని తీసుకున్న నిర్ణయంతో నరేశ్‌ గోయల్‌ ఆ విదేశీ సంస్థల వద్ద ఉన్న 40% వాటాను కొనుగోలు చేశారు.

జెట్ ఎయిర్వేస్ 1999లో మరో 10 బోయింగ్‌ 737-800 విమానాల్ని 550 మిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. 2001 ఏప్రిల్‌నాటికి 30 విమానాలు, 195 రోజువారీ సర్వీసులు, 37 గమ్యస్థానాలతో సంస్థ కార్యకలాపాలు కొనసాగించింది. తొలిసారిగా 2002లో కంపెనీ నష్టాల బాట పట్టింది. 

2003లో జెట్‌ ఎయిర్‌వేస్‌ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అదృష్టం కలిసొచ్చింది. చెన్నై నుంచి కొలంబోకు తొలి అంతర్జాతీయ సర్వీసు ప్రారంభించింది. ఆ తర్వాత 20 శాతం వాటాను మదుపర్లకు కేటాయించి, జెట్ ఎయిర్వేస్ సంస్థను స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టింగ్ చేశారు.

నాటినుంచి మార్కెట్‌లో జెట్ ఎయిర్వేస్ ఆధిపత్యాన్ని కొనసాగించింది. జెట్‌ కనెక్ట్‌ పేరుతో తక్కువ ధరలకే విమాన టికెట్లు విక్రయించింది. మార్కెట్‌లో 22.5 శాతం వాటా సాధించి అగ్రగామి విమానయాన సంస్థగా నిలిచింది. 

విదేశీ విమానయాన సంస్థలు దేశీయ విమానయాన సంస్థల్లో 49% పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌లో 26 శాతం వాటాను ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు విక్రయించింది.

మరోవైపు 1994లో ప్రారంభమైన మోదీలఫ్ట్‌ సంస్థ 1996లో కార్యకలాపాలు నిలిపేసింది. దీన్ని 2004లో అజయ్‌ సింగ్‌ కొనుగోలు చేసి స్పైస్‌జెట్‌గా మార్చారు. 2005 మే నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. 2010లో మీడియా దిగ్గజం కళానిధి మారన్‌, సన్‌ గ్రూపు ద్వారా స్పైస్‌జెట్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేశారు. 

2015 జనవరిలో తిరిగి అజయ్‌ సింగ్‌కే ఆ వాటాను విక్రయించారు. 2019 మార్చి నాటికి స్పైస్‌జెట్‌ 312 రోజువారీ విమాన సర్వీసుల్ని నడుపుతోంది. 47 దేశీయ మార్గాల్లో, 7 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులు కొనసాగిస్తోంది.

ఇప్పుడు జెట్ ఎయిర్వేస్, సంస్థ షేర్ 52 వారాల కనిష్ఠానికి పడిపోతే స్పైస్ జెట్ 52 వారాల గరిష్ఠానికి దగ్గరలో ఉంది. రూ.8,000 కోట్ల రుణ ఊబిలో చిక్కుకుని  జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణదాతల చేతికి చేరింది. 

కార్యకలాపాలు నిలిచిపోయి తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో స్పైస్‌జెట్‌ మాత్రం తగినన్ని నగదు నిల్వలతో  దూసుకెళుతోంది. ఇటీవలే ఆ సంస్థ ఛైర్మన్‌ అజయ్‌ సింగ్‌ కూడా ఈ సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయా సంస్థలు పాటించిన పాలనా వ్యవహారాలతోనే ఒకటి కష్టాలు ఎదుర్కొంటుంటే, మరొకటి దేశీయ విమానయానంలో 13.6 శాతం వాటా కలిగి రెండో అతిపెద్ద సంస్థగా వెలుగుతోంది.