వాషింగ్టన్‌: ఈ దఫా ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగమన ప్రభావం భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలపై ఈ ఏడాది 'మరింత స్పష్టంగా కనిపిస్తుంది' అని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జివా అన్నారు. 2019-20లో వృద్ధి 'అత్యల్ప రేటుకు' పడిపోతుందని జార్జివా అభిప్రాయ పడ్డారు.

ప్రపంచంలో దాదాపు 90% మందిపై ఆర్థిక మందగమన ప్రభావం పడుతుందని ఐఎంఎఫ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం దాదాపు ఒకేసారి మాంద్యంలోకి పడిపోయిన పరిస్థితులను చూస్తున్నామన్నారు.

'రెండేళ్ల క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమకాలీకరించబడిన పురోగతిలో ఉన్నది. జీడీపీతో పోల్చిచూస్తే దాదాపు 75శాతం వేగవంతంగా వున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మందగమనంలో ఉన్నది. 2019లో దాదాపు 90 శాతం మందగమనం ఉంటుందని భావిస్తున్నాం' అని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఇటీవల ఎన్నికైన జార్జివా తన తొలి ప్రసంగంలో అన్నారు.

'అమెరికా, జర్మనీల్లో నిరుద్యోగం కనిష్ట స్థాయిలో ఉన్నది. అయినా అమెరికా, జపాన్‌, ముఖ్యంగా యూరో ప్రాంతంతో సహా అభివృద్ధిచెందిన దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు మృదువుగా సాగుతున్నాయి. భారత్‌ సహా కొన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ఈ ఏడాది మరింత స్పష్టంగా కనిపిస్తున్నది' అని ఆమె చెప్పారు.

వచ్చేవారం 2019, 2020 వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్ విడుదల కానున్నదని ఐఎంఎఫ్ నూతన చీఫ్ జార్జివా చెప్పారు. ఈ ఔట్ లుక్‌లో వ్రుద్ధిరేట్ల అంచనాకు కోత పడే అవకాశం ఉన్నదన్నారు.

ప్రపంచ వాణిజ్యవృద్ధి 'నిలిచిపోయే స్థితికి చేరుకున్నదని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అభిప్రాయపడ్డారు. బహుళ దేశాల మధ్య క్లిష్టమైన సమస్యలుగా కరెన్సీల వివాదాలు ముందుకు వచ్చాయన్నారు. దేశాల మధ్య సుంకాలు, ప్రతి సుంకాలపై పెరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. అన్ని దేశాలూ కలిసి పనిచేయాలని ఐఎంఎఫ్‌ చీఫ్‌ పిలుపునిచ్చారు.

అంతర్జాతీయంగా పలు దేశాల్లో వ్రుద్ధిరేటులో మందగమనం ఉన్నా, 40 వర్ధమాన దేశాల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఐదు శాతంపైనే ఉందని, ఆయా దేశాల్లో 19 సహార ప్రాంత ఆఫ్రికా దేశాలు ఉన్నాయని చెప్పారు.

పలు దేశాలు ఇప్పటికే ఆర్థిక రంగంలో తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం ఆర్థిక స్థిరత్వం, పటిష్టత దిశగా ద్రవ్య పరపతి విధానాలను అనుసరించాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ నూతన చీఫ్ క్రిస్టాలినా జార్జివా చెప్పారు.

తక్కువ వ్రుద్ధిరేటు ఆర్థిక వ్యవస్థల్లో అదనపు నిధులు, వ్యయాలకు కొంత అవకాశం ఉన్నదన్నారు.వ్యవస్థాగత సంస్కరణలతో ఉత్పాదకత పెంపు ద్వారా ఆర్థిక క్రియాశీలత మెరుగుదలకు అవకాశం ఉన్నదని క్రిస్టాలినా జార్జివా తెలిపారు. తద్వారా అధిక వ్రుద్ధి సాధించడం అవసరం, ఇందుకు తగిన మదింపు జరుగాల్సి ఉన్నదని తెలిపారు.