Asianet News TeluguAsianet News Telugu

చోక్సీ టెంపరితనానికి ‘ఈడీ’ చెక్: ఎయిర్‌ అంబులెన్స్‌ పంపుతామని కౌంటర్

విచారణను తప్పించుకునేందుకే మెహుల్ చోక్సీ కుంటి సాకులు వెతుకుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాడని న్యాయస్థానానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. 

ED offers to provide air ambulance with medical experts to bring back Mehul Choksi from Antigua
Author
New Delhi, First Published Jun 23, 2019, 10:52 AM IST

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను రూ. వేలకోట్లకు మోసగించి యాంటిగ్వాలో ఆశ్రయం పొందిన మెహుల్‌ ఛోక్సీని అనారోగ్య కారణాలతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకే ఇచ్చింది.

మెహుల్ చోక్సీకి అనారోగ్యంగా ఉంటే వైద్య నిపుణులతో కూడిన ఎయిర్ అంబులెన్స్‌ను పంపుతామని న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈడీ తెలిపింది. 

మెహుల్ చోక్సీని స్వదేశానికి రప్పించేందుకు భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అతడిని ‘పరారీలో ఉన్న నిందితుడి’గా ఈడీ ప్రకటించగా.. ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు కూడా జారీ చేసింది. 

కానీ మెహుల్ ఛోక్సీ మాత్రం భారత్‌కు వచ్చేందుకు నిరాకరిస్తున్నాడు. ఇందుకు తన ఆరోగ్య కారణాలను చూపుతూ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాడు. ఆరోగ్య కారణాల రీత్యా తాను భారత్‌కు రాలేనని, పీఎన్‌బీ కేసుకు సంబంధించి యాంటిగ్వాలోనే దర్యాప్తును ఎదుర్కొంటానని పేర్కొంటూ ఛోక్సీ ఇటీవల ముంబయి కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాడు.

‘దర్యాప్తునకు సహకరించడం లేదంటూ నాపై ఈడీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి.

మెదడులో రక్తం గడ్డకట్టింది. దీనికి చికిత్స తీసుకుంటున్నాను. ఈ పరిస్థితిలో నేను భారత్‌కు రాలేను. కావాలంటే వైద్య పరీక్షలు చేసుకోవచ్చు. యాంటిగ్వాలో అయితే పీఎన్‌బీ కేసు దర్యాప్తును ఎదుర్కొంటా. లేదంటే పూర్తిగా కోలుకున్నాకే భారత్‌కు వస్తా’ అని ఛోక్సీ అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. 

దీనికి ఈడీ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఛోక్సీ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాడని, దర్యాప్తు ప్రక్రియను ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ‘ఛోక్సీ భారత్‌ రాలేకపోవడానికి అనారోగ్యమే కారణమైతే.. మేం అతడిని యాంటిగ్వా నుంచి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాటుచేస్తాం.

వైద్య నిపుణుల బృందాన్ని కూడా పంపుతాం. స్వదేశానికి వచ్చాక అవసరమైన చికిత్స కూడా అందిస్తాం’ అని ఈడీ తన కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొంది.

అంతేగాక..‘ఈడీ రూ. 6,129 కోట్ల విలువైన తన ఆస్తులను జప్తు చేసిందని ఛోక్సీ ఆరోపిస్తున్నాడు. అది పూర్తిగా అవాస్తవం. కేవలం రనూ. 2,100 కోట్ల విలువైన ఛోక్సీ ఆస్తులను మాత్రమే స్వాధీనం చేసుకున్నాం.

అతను దర్యాప్తునకు సహకరించడం లేదు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌, ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయినా భారత్‌కు వచ్చేందుకు నిరాకరిస్తున్నాడు. అందుకే అతడిని పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించాం’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్పష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios