మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. రోజువారీ సవరణలో భాగంగా వరుసగా మూడో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. దీంతో దేశ రాజధానిలో మంగళవారం పెట్రోల్‌ ధర లీటర్‌పై 14పైసలు, డీజిల్‌ ధర లీటర్‌పై 15 పైసలు పెరిగింది. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది.

తాజా ధరల ప్రకారం.. దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 78మార్క్‌ను తాకింది. నేడు దేశరాజధానిలో పెట్రోల్‌ ధర రూ. 78.05గా ఉంది. ఇక ముంబయిలో రూ. 85.47, కోల్‌కతాలో రూ. 80.98, చెన్నైలో రూ. 81.09గా ఉంది. డీజిల్‌ ధర కూడా మంగళవారం రికార్డు స్థాయిని తాకింది. నేడు దిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 69.61కి చేరింది. ఇక ముంబయిలో రూ. 73.90, కోల్‌కతాలో రూ. 72.46, చెన్నైలో రూ. 73.54గా ఉంది.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో పాటు వెనుజువెలాలో ఆర్థిక సంక్షోభం, ఆఫ్రికా, ఇరాన్‌ దేశాల నుంచి సరఫరా తగ్గడంతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.