అమ్మకాలు పెంచుకోవడానికి ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల సంస్థలు, డీలర్లు ఎంతగా ప్రయత్నిస్తున్నా, వినియోగదారులు అంతంతమాత్రంగానే షాపులకు వస్తున్నారు. అమ్మకాలు సరిగా లేక, కొన్ని నెట్ వర్క్ డీలర్లు తమ శాఖలను మూసివేస్తుండటం వల్ల ఉద్యోగాల్లో కోత ఏర్పడుతోంది. 

పండగల సీజన్‌ ముందుగా వచ్చే స్వాతంత్య్ర దినోత్సవాన్ని సేల్స్ ఫెస్టివల్‌గామార్చేందుకు ఇటీవల పలు సంస్థలు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయినా గతేడాదితో పోలిస్తే సేల్స్‌లో పురోగతి లేదని ఆయా సంస్థల నిర్వాహకులంటున్నారు.  

ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల అమ్మకాలకు దసరా-దీపావళి సీజన్‌ ప్రధానం. దీనికి ముందు వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాడు భారీ ఆఫర్లతో సేల్స్ పెంచుకోవడానికి సంస్థలు యత్నిస్తున్నాయి. వేసవి తరవాత ఆషాఢమాసం (జూలై)లో అమ్మకాలు చాలా తక్కువగా ఉంటాయి కనుక, ఆగస్టు 15ను సేల్స్‌కు వేదికగా మారుస్తున్నాయి. 

గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 15-20 శాతం తక్కువే జరిగాయని విక్రేతలు అంటున్నారు. సంపాదన పరిమితంగా ఉండటం, ఐటీ సహా భిన్న రంగాల కంపెనీల్లో ఉద్యోగ కోతల వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి.

ఫైనాన్స్‌ సంస్థల వద్ద అప్పు చేసి కొనుగోలు చేసినా, తీర్చలేకపోతే ఎగవేతదారు ముద్రపడుతుందనే భయంతో, అవసరమైతేనే టీవీలు, ఫ్రిజ్‌ల కొనుగోలు కోసం ముందుకు వస్తున్నారు.

వడ్డీలేకుండా  గృహ ఉపకరణాలను సులభ వాయిదాల్లో చెల్లించేందుకు ఫైనాన్స్‌ కంపెనీలు వెసులుబాటు కల్పిస్తుండటంతో 50-60% సేల్స్ ఆ విధంగానే జరుగుతున్నాయని సమాచారం,

దేశంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే, దక్షిణాదిలో నాణ్యత గల గృహ ఉపకరణాలకు గిరాకీ ఎక్కువ. పెద్దనోట్ల రద్దు తరవాత విక్రయాలు నెమ్మదిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల కొనుగోళ్లలో ఉద్యోగుల పాత్ర ఎక్కువ.

రోజువారీ అవసరాల కోసం రిఫ్రిజరేటర్‌, వాషింగ్‌మెషీన్‌, ఏసీల వంటివి కొనుగోలు చేస్తుంటారు. వినోదానికి ఎల్‌ఈడీ, అనుబంధ వినోద పరికరాలూ కొంటారు. కొత్త ఉద్యోగాల కల్పన పెద్దగా లేనందున, అదనంగా వచ్చే కొనుగోళ్లు ఉండటం లేదు.

పాత ఉత్పత్తులు మార్చుకుని, కొత్తవి తీసుకోవడమే అధికంగా ఉంటోందని చెబుతున్నారు. సాధారణ సీఆర్‌టీ టీవీలు, ఎల్‌ఈడీలు మార్చుకుని, స్మార్ట్‌-పెద్ద తెర టీవీలు, సింగిల్‌డోర్‌ రిఫ్రిజరేటర్ల స్థానంలో డబుల్‌డోర్‌, పాత ఏసీల బదులు విద్యుత్ తక్కువగా వినియోగించుకునే 5 స్టార్‌ రేటింగ్‌ కలిగినవి కొనుగోలు చేస్తున్నారు.

పాత వస్తువులు మరీ పాతవైతే మినహా, మార్చుకునేందుకు సిద్ధపడటం లేదని చెబుతున్నారు. ఈసారి ఎండలు జూన్‌ ఆఖరు వరకు ఉన్నందున, ఏసీల విక్రయాలు మాత్రం సంతృప్తికరంగా జరిగాయని తెలిపారు.

విపణిలో నగదు లావాదేవీలు తగ్గిపోతున్నాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో, అవసరానికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నారని విక్రేతలు అంటున్నారు. మధ్యతరగతి వర్గీయుల్లో ఈ ధోరణి ఎక్కువగా కనపడుతోందని, ఏదైనా కొనుగోలు చేసే ముందు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు.

ఈ సీజన్‌లో పిల్లలకు విద్యాసంస్థల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. రైతులకు వ్యవసాయ ఖర్చులుంటాయి. అందువల్ల సాధారణంగానే అమ్మకాలు తగ్గుతాయని, ఈసారి ఇది మరింత అధికంగా ఉందనే వాదనా ఉంది.

పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు చెలామణీ తగ్గి ఆన్‌లైన్‌, కార్డు చెల్లింపులు అధికమవుతున్నాయి. ఏటీఎంలలో కూడా సరిపడా నగదు లభించడం లేదు. ఇందువల్ల అధిక విలువైన వస్తువులు కొనేందుకు ఆన్‌లైన్‌/డెబిట్‌కార్డ్‌లనే వాడుతున్నారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతోంది. 

లెక్కలో చూపని నగదుతో, అధిక విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేసే వారికి పరిస్థితి ఇబ్బంది కరంగా మారిందని షాపుల యజమానులు అంటున్నారు. దీని ప్రభావమూ అమ్మకాలపై ఉందని అంటున్నారు.

అధికమొత్తంలో నల్లధనం కలిగిన వారు కూడా పసిడి, స్థిరాస్తులపైకి మళ్లిస్తున్నారు కానీ, ఖరీదైన ఉత్పత్తుల కొనుగోలుకు సుముఖత వ్యక్తం చేయడం లేదంటున్నారు. ఎల్‌ఈడీలు, స్మార్ట్‌ టీవీల అమ్మకాలు ఈ ఏడాది తక్కువగా నమోదయ్యేందుకు మరో కారణం కూడా ఉంది.

గతేడాది పండుగ సీజన్‌ కోసం భారీగా తయారీ జరపగా, అప్పుడు అరకొరగా అమ్మకాలు జరిగాయి. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి వరకు అదే సరకు అమ్మకాలు సాగాయని ఒక దిగ్గజ సంస్థ అధికారి చెప్పారు. 

ఎంఐ, శాన్యో, మైక్రోమ్యాక్స్‌, టీసీఎల్‌, థామ్సన్‌, బీపీఎల్‌ వంటి సంస్థలు 32 అంగుళాల ఎల్‌ఈడీ/స్మార్ట్‌ ఎల్‌ఈడీలను రూ.12-13 వేలకే ఆన్‌లైన్‌లో విక్రయిస్తుండటంతో, వాటి అమ్మకాలు బాగా పెరిగాయి. వీటి ధాటిని తట్టుకునేందుకు ఎల్‌జీ, శామ్‌సంగ్‌, సోనీ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. 

బ్రాండెడ్‌ ఎల్‌ఈడీల ధరలు 10-25 శాతం వరకు తగ్గినట్లు మరో దిగ్గజ కంపెనీ ఉన్నతాధికారి పేర్కొన్నారు. 32 సాధారణ ఎల్‌ఈడీలను రూ.15 వేల నుంచి, 43 అంగుళాల ఎల్‌ఈడీలను రూ.30 వేల నుంచి బ్రాండెడ్‌ కంపెనీలు అమ్ముతున్నాయి.

సాధారణంగా కంపెనీ నుంచి ఉత్పత్తి వినియోగదారులకు చేరాలంటే, మధ్యలో నాలుగైదు చేతులు మారాలి. అయితే కంపెనీ నుంచి నేరుగా ఉత్పత్తులను భారీసంఖ్యలో కొనుగోలు చేసి, విక్రయదార్లకు విక్రయించగలిగితే మార్జిన్లు తగ్గుతాయి కనుక, ధరలు అదుపులో ఉంటాయి. ఇ కామర్స్‌ పోర్టళ్లు ఇదే ధోరణి అనుసరిస్తున్నాయి. 

నెట్ వర్క్ దుకాణాలను దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థలు కూడా ఇదే ధోరణి అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సంబంధిత విడిభాగాల వంటి ఐటీ ఉత్పత్తుల్లో ఈ ధోరణి ఉంది. ఇతర గృహోపకరణాల్లోనూ ఇదే ధోరణి పెరిగితే, దేశీయంగా వ్యాపార ధోరణే మారిపోతుందన్నది విక్రయ సంస్థల వాదన.