Credit Card Bills : క్రెడిట్ కార్డు బిల్లు కొండంత పెరిగిందా..ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు
ఒక్కోసారి క్రెడిట్ కార్డు బిల్లును కొండంతలా పెరిగిపోయి మిమ్మల్ని అప్పుల ఉచ్చులో కూరుకుపోయేలా చేస్తుంటాయి. ఆ అప్పు నుంచి బయటపడటానికి మార్గం లభించక కొట్టుమిట్టాడుతూ ఉంటాము. అయితే క్రెడిట్ కార్డు బిల్లులను కొన్ని రకాల టిప్స్ పాటించడం ద్వారా సులభంగా చెల్లించవచ్చు.అప్పుల ఊబిలో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
ఈ కాలంలో చాలా మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డును సక్రమంగా వినియోగించకపోతే, ఎడా పెడా వాడేసి అప్పుల ఊబిలో కూరుకుపోవడం సహజం. చాలా సార్లు ప్రజలు ఆఫర్‌ల దురాశలో పడి క్రెడిట్ కార్డులను తీసుకొని వాడేస్తుంటారు. తమ ఆర్థిక పరిమితిని చూసుకోరు దీని కారణంగా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ బిల్లులను సకాలంలో చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ సైతం దెబ్బ తిని భవిష్యత్తులో రుణాలు పొందలేకపోతున్నారు. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు బిల్లు భారం నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఈ టిప్స్ పాటించండి.
క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ
చాలా సార్లు క్రెడిట్ కార్డ్ కస్టమర్లు తమ బ్యాలెన్స్‌ను ఒక కార్డు నుండి మరొక కార్డుకు బదిలీ చేస్తుంటారు. ఈ విధానాన్ని 'క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్' అంటారు. ఈ 'బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్' సదుపాయం క్రెడిట్ కార్డ్ కస్టమర్ తన బకాయి బ్యాలెన్స్‌ను ఒక క్రెడిట్ కార్డ్ నుండి మరొక క్రెడిట్ కార్డ్‌కి బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ప్రక్రియలో, కస్టమర్ సాధారణంగా అధిక వడ్డీ రేటు క్రెడిట్ కార్డ్ నుండి తక్కువ వడ్డీ రేటు లేదా మెరుగైన రీపేమెంట్ నిబంధనలు ఉన్న కొత్త క్రెడిట్ కార్డ్‌కి తన బకాయి మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు వడ్డీ చెల్లింపులపై డబ్బును ఆదా చేసుకోవచ్చు. బ్యాలెన్స్ బదిలీని ప్రారంభించడానికి, కస్టమర్ సాధారణంగా కొత్త క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆమోదం పొందిన తర్వాత, కస్టమర్ తమ ప్రస్తుత క్రెడిట్ కార్డ్ నుండి మరొక కొత్త కార్డ్‌కి బ్యాలెన్స్ బదిలీ కోసం అభ్యర్థించవచ్చు. అలా చేయడం ద్వారా బ్యాంక్ మునుపటి క్రెడిట్ కార్డ్ జారీ చేసిన వారితో బాకీ ఉన్న మొత్తాన్ని సెటిల్ చేస్తుంది. కొత్త కార్డుకు రుణాన్ని బదిలీ చేస్తుంది.
గోల్డ్ లోన్ తీసుకొని బిల్లు చెల్లించేయండి..
క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అప్పుల ఊబి నుంచి బయటపడటానికి పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ పొందవచ్చు. ఇటువంటి లోన్ లపై రుణదాతలు వసూలు చేసే వడ్డీ రేట్లు సాధారణంగా క్రెడిట్ కార్డ్ EMI లపై విధించే రేట్ల కంటే తక్కువగా ఉంటాయి.
బకాయి మొత్తాన్ని EMIగా మార్చడం
మీ క్రెడిట్ కార్డు పెండింగ్ బకాయిలను EMIలుగా మార్చుకునే సౌకర్యం కూడా ఉంది. బిల్లు మొత్తాన్ని చిన్న వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. చాలా బ్యాంకులు మీ బకాయి మొత్తాన్ని మార్చడానికి అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి, EMI ద్వారా బకాయి ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీరు ఎంచుకున్న కాల వ్యవధిని బట్టి ఈ వడ్డీ రేటు మారవచ్చు.
తక్కువ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ తీసుకోండి..
మీ క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించడానికి మీరు వ్యక్తిగత రుణాన్ని తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బకాయిలు ఎక్కువగా ఉన్న వారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా, క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్లు సంవత్సరానికి దాదాపు 40 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తారు, అయితే మీరు దాదాపు 11 శాతం వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు.