ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) తొలి త్రైమాసికంలో భారత కంపెనీలు అంచనాలు మించి రాణిస్తాయని ఒక నివేదిక అభిప్రాయపడింది. ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు 12.8 శాతం వృద్ధి చెందొచ్చని, గత మూడేళ్లలో ఇదే అత్యధికమని క్రిసిల్‌ నివేదిక పేర్కొంది. అధిక చమురు ధరల వల్ల లాభం మార్జిన్లు 0.2 శాతం తగ్గొచ్చని అంచనా వేసింది. 

వరుసగా మూడో త్రైమాసికంలో నమోదు కానున్న వృద్ధి 


వివిధ ఆర్థిక సంస్థల్లో రెండంకెల వృద్ధి నమోదు కానుండటం ఇది వరుసగా మూడో త్రైమాసికం కావడం గమనార్హం. ముందు రెండు త్రైమాసికాల్లో వృద్ధికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల వచ్చిన బేస్‌ ఎఫెక్ట్‌ కారణమని క్రిసిల్‌ తెలిపింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా, చమురు రంగాలు మినహా 350 కంపెనీల ఆదాయాలను క్రిసిల్‌ విశ్లేషించింది. నిఫ్టీలో ఈ కంపెనీలు దాదాపు 50 శాతం వాటా కలిగి ఉన్నాయి. మంగళవారం నుంచి కంపెనీ త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 

కీలక రంగాల్లో రెండంకెల ప్రగతి


మొదటి త్రైమాసికంలో 21 కీలక రంగాల్లో 15 రెండంకెల వృద్ధి సాధిస్తాయని, వినియోగ, వస్తు ఆధారిత రంగాల అమ్మకాలు పుంజుకుంటాయని క్రిసిల్‌ రీసెర్చ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ కోపార్కర్‌ పేర్కొన్నారు. లాభదాయకత పరంగా చూస్తే.. పన్నుకు ముందు మార్జిన్ 0.20 శాతం తగ్గొచ్చని, అంతకు ముందు త్రైమాసికాల్లో నమోదైన 1- 2.50 శాతంతో పోలిస్తే తక్కువేనని అన్నారు. వాహన, రిటైల్‌, విమానయాన రంగాల్లో అమ్మకాల వృద్ధి అంచనాలు మించొచ్చని అన్నారు. 

రూపాయి విలువ క్షీణతతో ఐటీ, ఫార్మా ఆదాయం పెరుగుదలకు చాన్స్


కమొడిటీ రంగాలైన..  సహజవాయువు, సిమెంట్‌ కంపెనీలు మంచి వృద్ధి నమోదు చేయొచ్చని, పెట్రోకెమికల్స్‌, ఉక్కు ఉత్పత్తులు అధిక ధరల వల్ల లబ్ధి పొందడం కొనసాగొచ్చునని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌పై రూపాయి మారకం విలువ క్షీణించడంతో ఐటీ, ఔషధ కంపెనీల ఆదాయం పుంజుకోవచ్చని తెలిపారు. టెలికాం రంగం కష్టాలు కొనసాగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

టెలికం మినహా వినియోగ రంగంలో ప్రగతి


టెలికం రంగం మినహా వినియోగ రంగాల్లో వరుసగా పురోగతి కనిపిస్తుందని క్రిసిల్ అధ్యయన నివేదిక పేర్కొన్నది. దీనికి క్షేత్రస్థాయిలో సూక్ష్మ స్థాయి పరిస్థితులు కేంద్రం కానున్నాయి. వినియోగదారుల సెంటిమెంట్, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్, వరుసగా మూడో ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ వర్షాలపై అంచనాలు కీలకం కానున్నాయి. ఆటోమొబైల్ రంగ ఆదాయాల్లో 34.3 శాతం పురోగతి కనిపించింది. 2017 - 18లో చివరి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 4.7 శాతం పురోగతి సాధించిందని క్రిసిల్ వివరించింది. 

రెరాతో రియాల్టీలో క్రమశిక్షణ


రియల్ ఎస్టేట్ రంగంలో నియంత్రణకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఏర్పాటు చేయడంతో ఆర్థిక, న్యాయ, నిర్వహణ పరమైన క్రమశిక్షణ పెరుగుతుందని క్రిసిల్ తెలిపింది. భవన నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టడంలో బిల్డర్లు ఆచితూచి స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. రెరా నిబంధనలకు అనుగుణంగా అంకిత భావంతో పని చేసే సిబ్బంది ఉంటారని, తద్వారా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అమలులో పారదర్శకత క్రమంగా పెరుగుతుందని క్రిసిల్ వివరించింది. భవన నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లో రెరా పూర్తిగా మార్పు తీసుకొస్తుందని తెలిపింది. 

మార్కెట్‌ను టీసీఎస్‌ మెప్పిస్తుందా! 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉంది. అమ్మకాల్లో మంచి వృద్ధి, ప్రధానమైన బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల విభాగాల్లో జోరు వల్ల టీసీఎస్‌ ఫలితాలు ఆకర్షణీయంగా నిలుస్తాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థిర మారకం ప్రాతిపదికన.. మార్చి త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 3-4 శాతం వృద్ధి నమోదు కావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బలహీన నిర్వహణ పనితీరుతో ఏకీకృత నికర లాభం 4 శాతం తగ్గి రూ.6,660 కోట్లుగా నమోదు కావొచ్చని భావిస్తున్నారు. 2017-18 ద్వితీయార్థంలో పెద్ద ప్రాజెక్టులు దక్కించుకోవడం..అనుకూలమైన సీజన్‌ కావడం వంటి అంశాలు ఇందుకు దన్నుగా నిలిచాయి. 5 మంది విశ్లేషకుల సగటు అంచనా ప్రకారం.. మొత్తం అమ్మకాలు 2 శాతం పెరిగి రూ.32,579 కోట్లకు చేరే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ మినహా అన్ని విభాగాల్లో పురోగతిపై ఇదీ అంచనా


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ సేవల మినహా అన్ని విభాగాల్లో రెండంకెల అమ్మకాల వృద్ధి సాధిస్తామని టీసీఎస్‌ అంచనా వేసింది. మొత్తం అమ్మకాల్లో  బ్యాంకింగ్‌ సేవల వాటా దాదాపు మూడింట ఒక వంతు కావడం గమనార్హం. కంపెనీ ఆర్థిక సేవల విభాగానికి ఉత్తర అమెరికా కీలక విపణి. ఖాతాదారులతో చర్చల్లో  గిరాకీ పెరగడం స్పష్టమైందని, ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో తిరిగి గాడిలో పడతామని కంపెనీ గతంలో తెలిపింది. తొలి త్రైమాసిక ఫలితాల్లో ఈ విభాగం ప్రభావం ఉంటుందో.. లేకపోతే ఇంకా ఎదురు చూడాలో తెలుస్తుందని నిర్మల్‌ బాంగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ నివేదిక పేర్కొంది.