ఆ పేరు వింటేనే హోటల్ పరిశ్రమ వణికిపోతోంది...ఎందుకు.. ?
కరోనా వైరస్ ప్రభావంతో ఆతిథ్య పరిశ్రమ అరిటాకులా వణికిపోతోంది. త్వరితగతిన ఒకరి నుంచి మరొకరికి అంటుకోవడంతో హోటళ్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. ఈ సంగతి గమనించిన రేటింగ్ సంస్థలు దేశీయ హోటళ్ల రేటింగ్స్ తగ్గించివేస్తున్నాయి.
న్యూఢిల్లీ: చైనాలో వందలమందిని బలిగొంటూ, భారత్ సహా మరో 20 దేశాలకు విస్తరిస్తున్న కరోనా వైరస్ పేరు వింటేనే హోటల్ పరిశ్రమ వణికిపోతోంది. అత్యంత త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వీలు గల కరోనా వైరస్ బారిన పడకుండా చూసేందుకు, ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు సహా పలు రంగాలకు చైనా, హాంకాంగ్ సెలవు ప్రకటించాయి.
దీంతో చైనా సమీపంలో ఉన్న దేశాలకు పర్యాటకుల రాక బాగా తగ్గిపోతోంది. ఇప్పటికే మన దేశంలోనూ కరోనా వైరస్ బాధితులు బయట పడిన కేరళ రాష్ట్రంలోనూ హోటల్ బుకింగ్‌ను అతిథులు రద్దు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి విదితమే. ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందనే ఆందోళన పరిశ్రమ వర్గాల్లో ఉంది.
విహారానికి వచ్చే పర్యాటకులతో పాటు వ్యాపారం/విధుల్లో భాగంగా వచ్చే ఖాతాదారుల వల్లే హోటళ్లకు అధిక ఆదాయం వస్తుంటుంది. రిస్క్ చేసి పర్యటనలకు వెళ్లడం ఎందుకు అని కొందరు మానుకుంటుంటే, మరికొందరు ఆసియా దేశాలకు దూరంగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్లు సమాచారం. చైనాలో 40వేల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడగా, 900 మంది అశువులు బాశారు. భారత్ సహా 20 దేశాలో మరో 300 కేసులను ధ్రువీకరించారు.
also read కరోనాకు మందు కనిపెట్టిన వారికి కోటి రూపాయలు:జాకీ చాన్
కరోనా దేశంలోకి ప్రబలకుండా చూసేందుకు ప్రధాన విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో క్షుణ్ణంగా వైద్యపరీక్షలు చేస్తున్నారు. చైనా వెళ్లిన విదేశీ పర్యాటకులు, మన దేశానికి రాకుండా ఆంక్షలు విధించి, రోడ్డు, వాయు, జల మర్గాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు కూడా.
చైనాకు మనదేశం నుంచి విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వేలమంది ప్రయాణించే వీలు ఉన్న నౌకల్లోనూ ప్రమాదకర వైరస్ బాధితులు ఉండటంతో, వాటిని తీరానికి రాకుండా జపాన్ వంటి దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా హోటల్ రంగానికి ఇబ్బందికర పరిణామాలేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
గదులు నిండటం తక్కువగా ఉండటానికి తోడు, రోజువారీ అద్దె కూడా పెరగకపోవడం హోటల్ రంగాన్ని 2018 ఆరంభం వరకు ఇబ్బంది పెట్టింది. తదుపరి ఈ రెండు అంశాల్లోనూ కోలుకుంది. ఫలితంగా కొత్త హోటళ్ల నిర్మాణ జోరు పెరిగింది. అంతర్జాతీయ మందగమనం కొంత ఇబ్బందికరంగా మారినా, గతేడాదిలో హోటళ్లలో గదుల భర్తీ 65 శాతం ఉండటం సంతృప్తి కలిగించే విషయం.
కానీ కరోనా ప్రభావంతో ఇప్పుడు విదేశీ పర్యాటకుల రాకత గ్గుతున్నందున, ప్రీమియం హోటళ్లపై అధిక ప్రభావం పడుతోంది. ఎందుకంటే, వీటిల్లో దిగేవారిలో 60-70 శాతం విదేశీయులే ఉంటారు. ‘పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సమీపకాలంలో ఇది తీవ్ర భయాందోళనకు దారితీయొచ్చు’ అని హోటళ్ల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ముగిశాక, జనవరి-మార్చిలో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అందువల్ల వ్యాపార పర్యాటకులతో ఇక్కడి హోటళ్లకూ ఆదాయం బాగుంటుంది. ఫిబ్రవరిలో దేశీయ హోటళ్లు విదేశీ అతిథులతో కళకళలాడుతుంటాయి.
also read కరోనా వైరస్ నుంచి కరుణ లభించేదెప్పుడు..? వారు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు...
ఈసారి కరోనా వైరస్ దెబ్బకు, వీరి రాక బాగా తగ్గింది. భారత్‌తోపాటు ఆసియా దేశాలకు వచ్చేందుకే పర్యాటకులు వెనుకాడుతున్నారని జర్మనీ కేంద్రంగా పనిచేసే డేటాపోర్టల్ స్టాటిస్టా పేర్కొంది. ఆతిథ్యరంగంపై కరోనా వైరస్ ప్రభావాన్ని గమనించిన బ్రోకరేజీ సంస్థలు, దిగ్గజ హోటళ్ల షేర్ల రేటింగ్‌నూ తగ్గించి వేస్తున్నాయి.
ఇండియన్ హోటల్స్, ఓరియెంటల్ హోటల్స్ షేర్లకు ‘బై’ నుంచి ‘హోల్డ్’కు ఐసీఐసీఐడైరెక్ట్ డాట్ కామ్ తగ్గించింది. సగటు గది అద్దె, గదుల భర్తీ రేటును గణిస్తే, ఒక గదిపై వచ్చే సగటు ఆదాయంలో వృద్ధి నెమ్మదిస్తుందని ఎడెల్వీస్ సెక్యూరిటీస్ పేర్కొంది.
గత మూడు త్రైమాసికాలుగా ఈ వృద్ధి 4-5 శాతం ఉందని, ఇప్పుడు 1 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేస్తోంది. ఇండియన్ హోటల్స్ విక్రయాలపై 20-25 శాతం ప్రభావం ఉండొచ్చని స్థానిక బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. సార్స్ (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) మరణాలను రెండు నెలల్లోనే కరోనా వైరస్ దాటేసినందున, ఇప్పుడే భయాందోళనలు అధికమవుతాయని, వచ్చే ఆరేడు నెలలు కష్టకాలమేనని పలు హోటళ్ల నిర్వాహకులు భావిస్తున్నారు.