మీకు నచ్చిన కారు సొంతం చేసుకోండి: తక్కువ వడ్డీకి రుణాలిస్తున్న బ్యాంకులివిగో
ఇప్పుడున్న పరిస్థితుల్లో కారు ప్రతి కుటుంబానికి అత్యవసర వస్తువు. లగ్జరీ కారు కాకపోయినా మామూలు కారు కొనుక్కోవడమే అవసరంగా అందరూ భావిస్తున్నారు. బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకి కారు రుణాలు ఇస్తూ వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకులు పోటీపడి కార్ లోన్లు ఇస్తున్నాయి. అయితే కారు కొనేముందు ఏ బ్యాంకులు ఎంత వడ్డీ వేస్తున్నాయో ముందు తెలుసుకోవాలి.
ఒకప్పుడు కారు విలాసవంతమైన వస్తువు. ఇప్పడు నిత్యావసరం. ఈ పోటీ మార్కెట్‌లో కారు కొనుగోలు ప్రక్రియ చాలా సింపుల్ అయిపోయింది. అనేక బ్యాంకులు పోటీ పడి వడ్డీ రేట్లను తగ్గించి ఇస్తున్నాయి. అయితే సరైన బ్యాంకును ఎంచుకోవడం చాలా కీలకం. వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను సరిపోల్చడం చాలా అవసరం. 5 సంవత్సరాల కాలవ్యవధితో రూ. 5 లక్షల రుణానికి ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు విధించే వడ్డీ రేట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
SBI(స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా)
ఎస్‌బీఐ నుంచి రూ.5 లక్షల కారు రుణం తీసుకుంటే నెలకు రూ.10,367 నుంచి రూ.10,624 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 8.95 శాతం నుంచి 10 శాతం.
బ్యాంక్ ఆఫ్ ఇండియా
కారు రుణాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.85 శాతం నుంచి 10.85 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. రూ. 5 లక్షలకు నెలవారీ తిరిగి చెల్లింపు రూ. 10,343 మరియు రూ. 10,834 మధ్య ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కారు రుణాలపై వడ్డీని 8.75 శాతం నుండి 10.60 శాతానికి వసూలు చేస్తోంది. రూ.5 లక్షలకు నెలవారీ చెల్లింపు రూ.10,319 నుంచి రూ.10,772 మధ్య ఉంటుంది.
యూనియన్ బ్యాంక్
పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ కార్ లోన్లపై 8.70 శాతం నుండి 10.45 శాతానికి వడ్డీని వసూలు చేస్తోంది. రూ.5 లక్షలకు నెలవారీ చెల్లింపు రూ.10,307 నుంచి రూ.10,735 మధ్య ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.5 లక్షల కారు లోన్ తీసుకుంటే రూ.5 లక్షలకు నెలకు రూ.10,355 నుంచి రూ.11,300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 8.90 శాతం నుంచి 12.70 శాతం.
కెనరా బ్యాంక్
కారు రుణాలపై కెనరా బ్యాంక్ 8.70 శాతం నుంచి 12.70 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. రూ.5 లక్షలకు నెలవారీ చెల్లింపు రూ.10,307 నుంచి రూ.11,300 మధ్య ఉంటుంది.