Asianet News TeluguAsianet News Telugu

సంపన్నులకు రెడ్ కార్పెట్: కాసులకే ప్రభుత్వ ప్రాధాన్యం

భారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు చెక్కేయడం కొందరికి సర్వ సాధారణంగా పరిణమించింది. పెట్టుబడుల కోసం వివిధ దేశాలు కూడా సంపన్నులకు సకల సౌకర్యాలతో నివాస వసతులు కల్పిస్తున్నాయి. 

Citizenship on sale for Indian fugitives; Cyprus a top destination

డబ్బెవరికి చేదు.. పైసా మే పరమాత్మ హై.. ఈనాడు కాసులు ఖర్చు చేస్తే దొరుకనిదంటూ ఏదీ లేదంటున్నాయి పలు దేశాలు. సంపన్నులకైతే పౌరసత్వం అంగడి సరుకైపోయింది మరి. కొన్ని దేశాలు విదేశీ సంపన్నులకు పెట్టుబడుల ద్వారా తమ పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి. కరేబియన్ దీవుల్లో ఒకటైన సెయింట్ కిట్స్-నెవీస్ 1984లో తొలిసారి ఈ తరహా ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది. ఈ ఆలోచన అప్పుడు ఎంతో వివాదాస్పదమైంది. 

ప్రపంచ దేశాల్లో పెట్టుబడిని బట్టి సిటిజన్ షిప్ ఇలా


కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అమలు చేస్తున్నాయి. తమ దేశంలో నిర్ణీత స్థాయిలో పెట్టుబడి పెట్టినా,నూతన నివాసం కోసం నిర్ణీత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించినా అత్యంత విలువైన పౌరసత్వాన్ని తేలిగ్గా ఇచ్చేస్తున్నాయి. ఇచ్చిన సొమ్ముపై పౌరసత్వ కాలపరిమితి ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో వీరికి స్థానికులకు గల అన్ని హక్కులు వర్తిస్తాయి. భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పరారైన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, హైటెక్ మోసగాళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, జతిన్ మెహతా, లలిత్ మోదీ వంటి వారికి ఈ విధానాలు బాగా కలిసొస్తున్నాయి.

సంపన్నుల పెట్టుబడులకు అనుగుణంగా వసతులు 


విదేశాల్లోని ధనికులకు చాలా దేశాలు తమ పౌరసత్వాన్ని కల్పించకున్నా.. స్థానిక పెట్టుబడులకు అనుగుణంగా నివాస ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆరోగ్య భద్రతతోపాటు పని చేసుకోవడానికి, చదువుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. ఓటు హక్కు, పాస్‌పోర్టులను తీసుకునే అవకాశాన్ని మాత్రం ఇవ్వడం లేదు. ఇక వీసాల కోసం కూడా ఓ రేట్ ఉన్నది. భారతీయుల విషయానికే వస్తే.. రూ.18.1 కోట్లను బ్రిటన్‌లో గనుక పెట్టుబడిగా పెడితే ఇన్వెస్టర్ వీసాను అందుకోవచ్చు. ఐదేళ్లు అక్కడ నివాసం ఉండవచ్చు. అమెరికాలో 10 లక్షల డాలర్లు పెట్టుబడిగా పెట్టి కొత్తగా 10 పూర్తికాల ఉద్యోగాలను సృష్టించినా, గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టి ఉపాధి అవకాశాలను కల్పించినా గ్రీన్ కార్డు ప్రక్రియను వేగవంతం చేసుకోవచ్చు.

మెహుల్‌ చోక్సీని పట్టుకోండి: భారత్‌


తమ దేశ పౌరసత్వం తీసుకున్న భారత వజ్రాల వ్యాపారి మోహుల్‌ చోక్సీని అదుపులోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆంటిగ్వా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మేనల్లుడు నీరవ్‌ మోదీతో కలిసి ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని రూ.14వేల కోట్ల మేర ముంచిన కేసులో చోక్సీ ప్రధాన నిందితుడు. గత ఫిబ్రవరిలో దేశం నుంచి పారిపోయిన చోక్సీ, గత ఏడాది నవంబర్‌లోనే ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నట్టు ఇటీవలే తేలింది. దీంతో చోక్సీని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆ దేశాన్ని కోరింది. ఇంకా అతడు దేశం విడిచి పోకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కూడా కోరినట్టు అధికార వర్గాలు చెప్పాయి. చోక్సీని దేశానికి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంతోపాటు ఆంటిగ్వా ప్రభుత్వంతోనూ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి.

ఆస్ట్రేలియా, అమెరికాకే వలసలు


ప్రపంచ దేశాల్లో చైనా, భారత్‌ల నుంచే అత్యధికంగా అపర కుబేరులు (రూ.6.9 కోట్లకు మించి సంపద ఉన్నవారు) విదేశాలకు వలసపోతున్నట్లు దక్షిణాఫ్రికాకు చెందిన గ్లోబల్ మార్కెట్ రిసెర్చ్ గ్రూపైన న్యూ వరల్డ్ వెల్త్ తెలియజేసింది. ఈ హెచ్‌ఎన్‌ఐ (హై నెట్‌వర్త్ ఇండివీడ్యువల్స్)లలో ఎక్కువ మంది ఆస్ట్రేలియా, అమెరికాలకు చేరుతున్నట్లు కూడా గుర్తించింది. సింగపూర్‌లో రూ.12.6 కోట్లు పెట్టుబడి పెట్టగలిగితే రెండేళ్లు, థాయిలాండ్ లో కేవలం రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే 13 ఏళ్లు అదే దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదే నాలుగేళ్లు ఉండాలంటే స్పెయిన్ లోనైతే రూ. 4 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సైప్రస్‌లో  20 లక్షల యూరోలతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే మూడేళ్లు సిటిజన్ షిప్ లభిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios