Asianet News TeluguAsianet News Telugu

ట్రేడ్ వార్ తీవ్రతరం: అమెరికాకు చైనా వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచక్షణా రహితంగా అమలు చేస్తున్న విధానాలతో యావత్ ప్రపంచం అల్లకల్లోలమవుతున్నది. ప్రధానంగా చైనా, అమెరికా మధ్య వాణిజ్య పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది.

China slams 'US extortion tricks,' digs in heels as it vows to aid businesses hurt by tariffs

బీజింగ్: అమెరికా దోపిడీ కుయుక్తులు పని చేయబోవని చైనా హెచ్చరించింది. ప్రపంచ మార్కెట్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. టారిఫ్‌ వార్‌లో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా అస్త్రం ప్రయోగించారు. 

తొలుత 3,400 కోట్ల డాలర్ల (రూ.2.34 లక్షల కోట్లు) విలువైన చైనా ఉత్పత్తులపై గత శుక్రవారం నుంచి 25 శాతం దిగుమతి సుంకాన్ని అమల్లోకి తెచ్చిన ట్రంప్‌ ప్రభుత్వం.. తాజాగా మరో 20 వేల కోట్ల డాలర్ల (రూ.13.75 లక్షల కోట్లు) ఉత్పత్తులపై 10 శాతం టారిఫ్‌ విధించనున్నట్లు ప్రకటించింది. 

దీనికి ప్రతిగా తాము ఎగుమతి చేసే ఉత్పత్తులపై అమెరికా విధించే దిగుమతి సుంకం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నది. దీనికి అవసరమైన ప్రతీకార చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ దేశాల్లో మూడింట రెండొంతుల మేరకు సోయాబీన్ ఎగుమతులు చేసుకున్న దేశం చైనా. వంట నూనె అందిస్తున్న ఏడువేల కోట్ల పందులకు సోయాబీన్ అవసరం. చైనాలోని చేపల పెంపకం, ఫౌల్డీ ఫామ్‌కూ సోయాబీన్ కావాల్సి ఉంటుంది. 

సోయాబీన్ దిగుమతిదారులు తమ జంతువులకు గతేడాది కంటే 15 నుంచి 20 శాతం సోయాబీన్ ఫీడ్ తగ్గించాలని పౌరులకు చైనా ప్రభుత్వం చెప్పిందని అమెరికా సొయాబీన్ ఎక్స్ పోర్ట్ కౌన్సిల్ కన్సల్జెంట్ జాన్ సీ బైజే తెలిపారు. పందులు ఆకలితో అలమటించే స్థితికి చేరుకునే వరకు వేచి చూడాలని పేర్కొన్నది. సోయాబీన్ భోజనానికి ప్రత్యామ్నాయాన్ని కూడా అందుబాటులోకి తేవాల్సి ఉందని, అవసరమైనప్పుడు కొంత మేరకు ప్రోటీన్ సప్లిమెంట్లు అందించాలని సూచించిందని జాన్ సీ బైజే చెప్పినట్లు చైనా అధికార దిన పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొన్నది. 

ఇంతకుముందు అమెరికా మొదటి దెబ్బకు చైనా అదే స్థాయిలో జవాబిచ్చింది. చైనాలోకి ఏటా దిగుమతయ్యే 3,400 కోట్ల డాలర్ల విలువైన అమెరికన్‌ కార్లు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల మోత మోగించింది. ప్రతీకార చర్యలకు పాల్పడిపడితే చైనా నుంచి దిగుమతి అవుతోన్న మరో 20 వేల కోట్ల డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని ట్రంప్‌ ముందుగానే హెచ్చరించారు. అయినా చైనా వెనక్కి తగ్గకపోగా.. దెబ్బకు దెబ్బ తీసింది.
 
దాంతో ట్రంప్‌ ప్రభుత్వం ముందుగా హెచ్చరించినట్లే మరిన్ని చైనా ఉత్పత్తులపై సుంకాలను ప్రకటించింది. పది శాతం టారిఫ్‌ విధించనున్న చైనా వస్తువుల జాబితాను అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్‌ లైట్‌హైజర్‌ బుధవారం విడుదల చేశారు. ఆ లిస్ట్‌లో పళ్లు, కూరగాయలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, రిఫ్రిజిరేటర్లు, రెయిన్‌ జాకెట్లు, బేస్‌బాల్‌ గ్లోవ్స్‌తోపాటు పలు చైనా ఉత్పత్తులు ఉన్నాయి.

మరోవైపు అమెరికా-చైనా మధ్య రోజు రోజుకు పెరుగుతున్న వాణిజ్య యుద్ధంపై ముడి చమురు ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉద్రిక్తతలతో ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా, దీర్ఘకాలంలో ముడి చమురుకు డిమాండ్‌ తగ్గే ప్రమాదం ఉందని తన తాజా నెలవారీ నివేదికలో హెచ్చరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటం వల్లనే గత రెండేళ్లలో డిమాండ్‌ పుంజుకుని చమురు ధరలు పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే వాణిజ్య యుద్ధ భయాలతో పెట్టుబడులు, నిధుల ప్రవాహం, వినియోగదారుల ఖర్చులు దెబ్బతిని ఆ ప్రభావం ముడి చమురు డిమాండ్‌పైనా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఇదిలా ఉంటే డిమాండ్‌కు తగినట్టు ఉత్పత్తి పెంచి ధరలు తగ్గించకపోతే ఒపెక్‌ దేశాలకే నష్టమని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఒసి) చైర్మన్‌ సంజయ్‌ సింగ్‌ హెచ్చరించారు. ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే భారత వినియోగదారులు కూడా విద్యుత్‌ వాహనాలు, గ్యాస్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోకతప్పదన్నారు. అదే జరిగితే 2025 నాటికి భారత్‌లో రోజువారీ ముడి చమురు వినియోగం 10 లక్షల పీపాలు పడిపోతుందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios