భారీగా రుణాలు తీసుకుని, ఆపై వాటిని ఎగవేసి విదేశాలకు ఉడాయిస్తున్న బడా బాబులకు బ్యాంకర్లూ ఇకపై చెక్ పెట్టొచ్చు. దేశం విడిచి పారిపోకుండా ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుల (విల్‌ఫుల్ డిఫాల్టర్లు)ను, మోసగాళ్లను అడ్డుకునేలా ప్రభుత్వానికి బ్యాంక్ చైర్మన్లు, ఎండీలు, సీఈవోలు సిఫారసు చేయొచ్చు. అనుమానితులకు వ్యతిరేకంగా లుకౌట్ నోటీసుల జారీకి విజ్ఞప్తి చేసుకునే అవకాశాన్ని కేంద్రం ఇచ్చింది. 

రాజీవ్ కుమార్ కమిటీ సిఫారసులకు ఓకే
ఈ మేరకు ఓ ప్రతిపాదనను ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ సర్కారుకు సిఫారసు చేయగా, దానికి ఆమోదం లభించింది. మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న విషయం తెలిసిందే.

మొన్న జతిన్ మెహెతా.. నిన్న విజయ్ మాల్యా.. నేడు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు.. ఇలా బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని దేశం దాటిపోయినా, పోతున్న కార్పోరేట్ ప్రముఖులు అనేకమంది ఉన్నాయి. 

ఇలా కార్పొరేట్ ప్రముఖులకు లుకౌట్ నోటీసులు?
కార్పొరేట్ల బకాయిలు మొండి బాకీలుగా మారుతుండగా, వీటి వసూళ్ల కోసం అటు బ్యాంకర్లు, ఇటు ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. విదేశాల్లోని కోర్టుల చుట్టూ తిరుగాల్సి వస్తుండగా, ఏండ్ల తరబడి కేసులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి.

ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని వాటిని చెల్లించనివారిలో విదేశాలకు పారిపోయే వీలున్నవారిపై లుకౌట్ సర్క్యూలర్ల (ఎల్‌వోసీ)ను జారీ చేయాలని ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచనలు చేసే వెసులుబాటును కల్పించారు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత నెల ఈ మేరకు ఓ నోటీసును విడుదల చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసిన పీఎన్బీ కుంభకోణం
దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం ఏ స్థాయిలో కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు రూ.14,000 కోట్ల ఈ స్కాం.. భారతీయ బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచింది.

ఈ మోసం సూత్రధారులు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, రత్నాల వర్తకుడు మెహుల్ చోక్సీలు ఈ ఏడాది ఆరంభంలోనే దేశం విడిచి పారిపోయారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఫిబ్రవరిలో కేసు నమోదు చేయగా, జనవరిలోనే ఈ మామాఅల్లుళ్ళు చెక్కేశారు.

వీరిని తిరిగి రప్పించేందుకు ఎన్ని పాట్లు పడుతున్నామో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. రూ.50 కోట్లు, అంతకుమించిన బడా బకాయిదారులందరి పాస్‌పోర్టు వివరాలను సేకరించాల్సిందిగా ప్రభుత్వ బ్యాంకులను ఈ ఏడాది మార్చిలో ఆదేశించింది.

ఇలా ఎగవేత దారులకు లుకౌట్ నోటీసులు
ఇది చాలదని భావించే.. బ్యాంకర్లకు లుకౌట్ నోటీసుల జారీ విజ్ఞప్తి అవకాశాన్ని కల్పించామని ఆర్థిక సేవల కార్యదర్శిరాజీవ్ కుమార్ తెలిపారు. రుణాల చెల్లింపుల్లో మార్పులు, మారిన రుణగ్రహీతల స్వరం ఆధారంగా రుణ ఎగవేతల సంకేతాలు ముందుగా బ్యాంకర్లకే వస్తాయని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఈ మేరకు చర్యలు తీసుకున్నామని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

విల్‌ఫుల్ డిఫాల్టర్లు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు తీసుకునే చర్యల్లో భాగంగానే రాజీవ్ కుమార్ కమిటీని ఈ ఏడాది కేంద్రం నియమించింది. ఇప్పటికే పరారీ ఆర్థిక నేరగాళ్ల చట్టాన్నీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంతో డిఫాల్టర్ల ఆస్తులను త్వరగా జప్తు చేసే వెసులుబాటు దొరికింది.