సిమెంట్‌ ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో మోత మోగిస్తున్న బస్తా రేటు.. ఇంకా పైకి చేరనుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సిమెంట్‌ ధర 6 -13 శాతం పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.  

రష్యా-ఉక్రెయిన్ పెట్రోలియం ఉత్పత్తులు సహా ఎన్నో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఇప్పటికే సిమెంట్ ధరలు షాకిచ్చాయి. ఈ సిమెంట్ ధరలు ఇప్పుడు మరోసారి పెరగనున్నాయని తెలుస్తోంది. ఉక్రెయిన్ పైన రష్యా దాడటి నేపథ్యంలో బొగ్గు, పెట్ కోక్, ముడి చమురు ధరలు భారమవుతున్నాయని, దీంతో ఈ నెలలో సిమెంట్ బస్తా మరో రూ.25 నుండి రూ.50 పెరిగే అవకాశముందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. సిమెంట్ తయారీలో వినియోగించే బొగ్గు, పెట్ కోక్ ధరలు గత ఆరు నెలల కాలంలో 30 శాతం నుండి 50 శాతం పెరిగాయి. ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. 

రష్యా-ఉక్రెయిన్‌ సంఘర్షణ మధ్య బొగ్గు, పెట్‌ కోక్‌, ముడి చమురు దిగుమతులు భారమైపోయాయి. ఈ ప్రభావం సిమెంట్‌ ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి యుద్ధం కారణంగానే బొగ్గు, పెట్‌ కోక్‌ ధరలు గడిచిన ఆరు నెలల్లో 30-50 శాతం పెరిగాయి. క్రిసిల్‌ తాజా నివేదిక ప్రకారం గడిచిన ఏడాది కాలంలో జాతీయ స్థాయిలో ఒక్కో సిమెంట్‌ బస్తా ధర రూ.390కి పెరిగింది. పెరిగిన ఉత్పాదక వ్యయాన్ని వినియోగదారులపై సిమెంట్‌ కంపెనీలు వేస్తే ఈ నెలలో బస్తా రేటు మరో రూ.25-50 పెరగవచ్చని అంటుంది. ఇంధనం, విద్యుత్తు, రవాణా చార్జీలు పెరగడంతో సిమెంట్‌ ధరలు పెరుగుతుపోతున్నాయని దక్షిణ భారత సిమెంట్‌ తయారీదారుల సంఘం చెప్తుంది.

సిమెంట్ తయారీలో బొగ్గు, పెట్ కోక్ కీలకమైన ముడి పదార్థాలు. ఆస్ట్రేలియాలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఇండోనేషియాలో నిషేధం వల్ల బొగ్గు ఎగుమతులు తగ్గడంతో ధర పెరిగింది. అంతర్జాతీయ పెట్ కోక్ ధరలు మార్చి త్రైమాసికంలో 43 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా పెట్ కోక్ ధర 96 శాతం పెరిగింది. దేశీయ పెట్ కోక్ ధరలు మార్చిలో 23 శాతం, ఏప్రిల్ నెలలో 21 శాతం పెరిగాయి. సముద్ర రవాణా ఖర్చులు పెరగడం, సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందుల కారణంగా పెట్ కోక్ దిగుమతి వ్యయం ఏడాది క్రితంతో పెలిస్తే టన్నుపై 130 డాలర్ల మేర పెరిగింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ వినియోగం పరిమాణ పరంగా 5 శాతం నుండి 7 శాతం పెరిగే అవకాశముందని క్రిసిల్ తెలిపింది. దేశీయ సిమెంట్ వినియోగంలో 60 శాతం ఇళ్ల నిర్మాణానికి వెళ్తుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అఫోర్డబుల్ హౌసింగ్‌కు డిమాండ్ పెరగడం, మౌలిక వసతుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో సిమెంట్ వినియోగం పెరుగుతుందని అభిప్రాయపడింది.