National Land Monetisation Corp: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల నిరుపయోగ భూములు భవనాలను మానిటైజ్ చేయడం కోసం ఎన్‌ఎల్‌ఎంసీ(నేషనల్ లాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్) ఏర్పాటు చేసింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల భవన ఆస్తులను ఎన్‌ఎల్‌ఎంసీ మోనటైజేషన్ చేస్తుంది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. ఎన్‌ఎల్‌ఎంసీ పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని భారత కంపెనీగా ఏర్పాటు కానుంది.
National Land Monetisation Corp:ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా NLMC(నేషనల్ లాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల మిగులు భూములు, భవనాల మానిటైజేషన్ కోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ పనిచేయనుంది.
దీని ద్వారా మూసివేతకు సిద్ధంగా ఉన్న పీఎస్‌యూలు, ప్రభుత్వ ఏజెన్సీల మిగులు భూములు, భవనాలు, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ఆస్తులను ఎన్‌ఎల్‌ఎంసీ మానిటైజేషన్ చేస్తుంది. NMLC ఏర్పాటుకు మేరకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
5,000 కోట్ల ప్రారంభ అధీకృత షేర్ క్యాపిటల్, రూ. 150 కోట్ల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌తో NLMC పూర్తిగా భారత ప్రభుత్వ కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక ప్రకటన ద్వారా పేర్కొంది. అంతేకాదు ప్రభుత్వ కంపెనీల ల్యాండ్ మానిటైజేషన్‌లో NLMC ఒక సలహాదారు పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం ఉపయోగించని, అతి తక్కువ వినియోగానికి మాత్రమే వీలుండే ఆస్తులను NMLC గుర్తించి మానిటైజ్ చేసి తద్వారా కేంద్రప్రభుత్వం ఆదాయాన్ని పొందగలుగుతుందని ఈ సందర్భంగా పేర్కొంది
NLMC సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSEలు), ఇతర ప్రభుత్వ ఏజెన్సీల మిగులు భూమి, బిల్డింగ్ ఆస్తులను మాత్రమే మానిటైజ్ చేస్తుంది. ప్రస్తుతం సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSE)లకు చెందిన భూములు, భవనాల్లో చాలా వరకూ మిగులు, ఉపయోగించని లేదా పాక్షికంగా ఉపయోగిస్తున్న నాన్-కోర్ ఆస్తులు పెద్ద మొత్తంలో ఉన్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణతో పాటుగా, CPSEల నాన్-కోర్ ఆస్తులను మానిటైజేషన్ చేయడం వాటి విలువను నిర్ధారించడం చాలా కీలకం. NLMC ఈ తరహా ఆస్తుల విలువను నిర్ధారించడం కోసం పని చేస్తుంది.
NLMC ద్వారా ప్రైవేట్ రంగ పెట్టుబడులు, కొత్త ఆర్థిక కార్యకలాపాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు, మౌలిక సదుపాయాల కోసం నిరుపయోగమైన ఆస్తులను విక్రయించి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సులభం అవుతుంది.
3,500 ఎకరాల భూమి మానిటైజేషన్ కు సిద్ధం
ప్రస్తుతం, పిఎస్‌యుల వద్ద దాదాపు 3500 ఎకరాల భూమి. ఇతర నాన్-కోర్ ఆస్తులు మానిటైజేషన్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల అటువంటి ఈ ఆస్తులు కార్పొరేషన్‌కు బదిలీ అవుతాయి. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఆస్తులను లీజుకు లేదా అద్దెకు ఇవ్వడానికి లేదా మరేదైనా ఇతర మార్గంలో డబ్బు ఆర్జించే హక్కును కలిగి ఉంటుంది. NLMC వాణిజ్య లేదా నివాస ప్రయోజనాల కోసం తన ఆధీనంలోని ఆస్తులను పెట్టుబడి పెట్టవచ్చు. అభివృద్ధి చేయవచ్చు. NLMC అద్దె లేదా లీజు ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
