రష్యా, ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు ముడిచమురు ధర త్వరలో బ్యారెల్‌కు 150 డాలర్లు దాటవచ్చని పలు ఏజెన్సీలు చెబుతున్నాయి. రష్యా తన క్రూడ్ ధరను రికార్డు స్థాయిలో తగ్గించినా, అమెరికా, యూరప్ లు విధించిన ఆంక్షల కారణంగా ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో క్రూడాయిల్ కోసం కేవలం సౌదీ అరేబియా లాంటి దేశాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది.  

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం (Russia-Ukraine War) కారణంగా ముడిచమురు మండిపడింది. ప్రపంచ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు పెరిగింది. ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) హెచ్చరించింది.

ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే భయాందోళనలు వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం బ్రెంట్ క్రూడ్ ధరలు 5 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 110.54 డాలర్లకు చేరుకున్నాయి. డబ్ల్యుటిఐ (West Texas Intermediate) కూడా 5 శాతంపైగా బ్యారెల్‌కు పెంచగా, బ్యారల్ ధర 108 డాలర్లకు చేరుకుంది. 

రష్యా సరఫరా సంక్షోభాన్ని పెంచింది
యుద్ధం కారణంగా, రష్యా నుండి ముడి చమురు సరఫరా ప్రభావితమైంది. దీంతో ఇంధన ధరలలో అకస్మాత్తుగా 7 శాతం జంప్ నమోదైంది. దీని కారణంగా క్రూడ్ ధర 2014 నాటి అత్యధిక స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా రష్యా నుంచి క్రూడ్ సరఫరా నిలిచిపోయింది. దీంతో డిమాండ్ కు తగ్గ ముడి చమురు సరఫరా కావడం లేదు. జపాన్, అమెరికాతో సహా IEA సభ్యులు తమ నిల్వల నుండి 60 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయడానికి సిద్ధమయ్యారు, అయితే ఇది ఒక రోజు చమురు వినియోగం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తవచ్చు
చమురు నిల్వలు డిమాండ్ కు తగినంత లేకపోతే దాని ప్రభావం ధరలపై పడుతుందని IEA అంచనా వేసింది. ఓ వైపు డిమాండ్ ఇలాగే కొనసాగితే, ప్రపంచంలో ఇంధన సంక్షోభం ఏర్పడవచ్చు. అమెరికా మార్కెట్‌లో తన నిల్వల నుంచి 30 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం పెరుగుతుండడంతో రిజర్వ్‌లో ఉంచిన చమురు దీనికి సరిపోదు. కరోనా మహమ్మారికి ముందు, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 100 మిలియన్ బ్యారెళ్ల చమురు వినిగియోగంలో ఉండేది. 

క్రూడ్ ఆయిల్ 150 డాలర్లకు చేరుకుంటుంది
గ్లోబల్ కంపెనీలు గోల్డ్‌మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ, జెపి మోర్గాన్ ముడి చమురు ధరలపై అంచనా వేసాయి. ముడిచమురు ధర త్వరలో బ్యారెల్‌కు 150 డాలర్లు దాటవచ్చని ఈ ఏజెన్సీలు చెబుతున్నాయి. రష్యా తన క్రూడ్ ధరను రికార్డు స్థాయిలో తగ్గించినా, అమెరికా, యూరప్ లు విధించిన ఆంక్షల కారణంగా ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో క్రూడాయిల్ కోసం కేవలం సౌదీ అరేబియా లాంటి దేశాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది.

సౌదీ అరేబియా చమురు ధరను రికార్డు స్థాయిలో పెంచనుంది
గల్ఫ్ దేశాలలో ముడి చమురు ఉత్పత్తిలో ప్రధాన దేశమైన సౌదీ అరేబియా ఏప్రిల్‌లో తన క్లయింట్స్ లో ప్రధానంగా ఉన్న ఆసియా దేశాలకు ముడి చమురును రికార్డు ధరకు విక్రయించే అవకాశం ఉందని చమురు వ్యాపారులకు సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. సౌదీ అరేబియా ముడి చమురు బ్యారెల్‌కు 4.50 డాలర్ల వరకూ పెంచే వీలుందని అంచనా వేస్తున్నారు. నిజానికి సౌదీ అరేబియాకు రోజుకు 2 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ సౌదీ మాత్రం ఓపెక్ (Opec) దేశాల కూటమికి తమ ఉత్పత్తిని యుద్ధ ప్రాతిపదికన పెంచే అవకాశం లేదని సూచించింది. అంటే దానర్థం ధరల పెరుగుదల ద్వారా వచ్చే రాబడిని పెంచుకునేందుకు సౌదీ పావులు కదుపుతోంది. 

మరోవైపు రష్యా రోజుకు 4 మిలియన్ల నుండి 5 మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తుంది. కానీ పశ్చిమ దేశాలు ప్రకటించిన ఆంక్షలు రష్యా ఇంధన రంగాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించినవి కానప్పటికీ, ప్రధాన చమురు కంపెనీలు రష్యాతో తమ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. రష్యన్ క్రూడాయిల్ కార్గోలు భారీ తగ్గింపుతో లభిస్తున్నప్పటికీ, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షల నేపథ్యంలో కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు.