Asianet News TeluguAsianet News Telugu

బోయింగ్‌కు శాపం ‘737 మాక్స్8: భారీ పరిహారం ముప్పు

అమెరికా ఏవియేషన్ మేజర్ బోయింగ్ క్రుత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ సాయంతో రూపొందించిన 737 మ్యాక్స్ 8 విమానాలు ప్రమాదాల భారీన పడటం ఆ సంస్థకు ఆశనిపాతంగా మారింది. 

Boeing 737 Crashes Raise Tough Questions on Aircraft Automation
Author
Washington, First Published Mar 17, 2019, 1:13 PM IST

వరుసగా ‘737 మాక్స్‌ 8’ విమానాలు కుప్పకూలడం బోయింగ్‌కు పెద్ద శాపంగా మారింది. ఆటోమేషన్ సాయంతో తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగల అత్యాధునిక టెక్నాలజీతో సంస్థ ఈ తరహా విమానాలను తయారు చేసింది. 

దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన సంస్థలు ఈ తరహా విమానాల కొనుగోలుకు ఎక్కువగా ముందుకు రావడంతో అనతి కాలంలోనే సంస్థ వివిధ దేశాలకు 350కి పైగా విమానాలను బోయింగ్ విక్రయించింది. బోయింగ్‌కు ‘737 మాక్స్ 8’ మోడల్‌ విమానాలు పాడి ఆవులా మారుతున్నవేళ అధిక టెక్నాలజీ వాడకం ఆ సంస్థకే ముప్పు తెచ్చింది. 

సాధారణంగా బోయింగ్‌ విమానాల్లో పైలట్ల చేతిలోనే ఎక్కువ నియంత్రణ ఉంటుంది. కానీ కొత్తగా బోయింగ్‌ ఉత్పత్తి చేసిన 737 మాక్స్‌ 8 విమానాల్లోనూ కూడా ది మనూవరింగ్‌ క్యారెక్టరిస్ట్‌ అగ్మెంటేషన్‌ సిస్టమ్‌(ఎంకాస్‌)ను ఏర్పాటు చేసింది. దీంతో విమాన నియంత్రణను కృత్రిమమేథస్సు (ఏఐ) ఎంకాస్‌ టెక్నాలజీ చూసుకుంటుంది.

విమానంపై ఎంత మేరకు కృత్రిమమేథస్సు పర్యవేక్షిస్తుంది? పైలట్‌ దానిని ఎలా నియంత్రించాలన్నదానిపై స్పష్టత లేదు. దీంతో టెక్నాలజీ పరంగా, మ్యానువల్‌గా విమానాల నియంత్రణ చేపడుతుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అర్థం చేసుకొనే లోపే ఈ తరహా విమానాలు నేల కూలుతున్నాయి. 

2009లో ఎయిర్‌ ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఎ330-203 విమానం కూడా బ్రెజిల్‌ నుంచి తిరుగు ప్రయాణంలో అట్లాంటిక్‌ మహాసముద్రంలో కూలిపోయింది. ఎయిర్‌బస్‌ కూడా ఎ330లో స్టాల్‌ సమస్యను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఆటోమేషన్‌ గందరగోళంవల్లే ప్రమాదానికి గురైంది.

ఆ తర్వాత సంస్థ నష్టనివారణ చర్యల్లో భాగంగా పైలట్లకు ఎయిర్‌బస్‌ శిక్షణ ఇచ్చింది. తాజాగా బోయింగ్‌ సంస్థ కూడా ఈ దిశగానే అడుగులు వేస్తోంది. బోయింగ్‌ 737 మాక్స్‌ 8 విమానాల్లో టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌కు చర్యలను ప్రారంభించింది. వీటిపై త్వరలోనే పైలట్లకు కూడా శిక్షణనివ్వనుంది. 

బోయింగ్‌ 737 మాక్స్‌ 8 ఫ్లైట్‌లు ప్రపంచ విమానయాన సంస్థలకు శాపంగా మారాయి. వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా 350కి పైగా బోయింగ్‌ విమానాలను విమానాశ్రయాలకే పరిమితం చేశారు. దీంతో ప్రయాణికుల రద్దీని తట్టుకొనేందుకు ఇప్పుడు ఆ విమానాల స్థానే వేరే విమానాలను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఒక్కో ప్రత్యామ్నాయ విమానానికి నెలకు సగటున 2.5లక్షల డాలర్లు (రూ.1.7కోట్లు) అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌లైన్స్‌ సంస్థలు బోయింగ్‌ సంస్థపై ఆర్థిక యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి.

అనూహ్య నష్టాలకు కారణమైన బోయింగ్‌ ఈ మొత్తాన్ని చెల్లించాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మొదలు పెట్టాయి. ఈ పరిహారం ఇప్పటికే నెలకు 100 మిలియన్‌ డాలర్లకు పైగా ఉండవచ్చని అంచనా వేశారు. ఇక ఇప్పటికే విక్రయించిన 737 మ్యాక్స్‌ విమానాల సాఫ్ట్‌వేర్‌, ఇతర పరికరాల్లో మార్పుల ఖర్చును ఈ లెక్కలో చేర్చలేదు.

ఇదిలా ఉండగానే మార్పులు చేర్పులు చేశాకే మళ్లీ పైలట్లకు దీనిపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ శిక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ మార్పులు చేర్పుల ప్రక్రియ ఎంత ఆలస్యమైతే బోయింగ్‌పై భారం అంతగా పెరిగిపోతుంది. మొత్తంగా చూస్తే బోయిరగ్‌ సంస్థకు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులేనన్న విషయం అవగతమవుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios